26, సెప్టెంబర్ 2024, గురువారం

తులసిదళములు

 ✳️*తులసిదళములు గురించి తెలుసుకోండి*✳️


*తుల స్యమృత జన్మాసి సదా త్వం కేశవప్రియే*

*కేశవార్థం ఛినోమి త్వాం వరదాభయ శోభనే!*


*త్వదంగసంభవై ర్నిత్యం పూజయామి యథా హరిం*

*తథా కురు పవిత్రాంగి కలౌ మలవినాశిని!*


*మంత్రే ణానేన యః కుర్యాత్ విచిత్య తులసీదళం*

*పూజనం వాసుదేవస్య లక్షకోటిగుణం భవేత్!*


*భావము :*


ఈ పై మంత్రమును ఉచ్ఛరించుచు తులసి దళములను కోసి వాసుదేవుని పూజించినచో లక్షకోటిరెట్లు ఫలము లభించును.


*తులసీపత్ర గలితం య స్తోయం శిరసా వహేత్*

*గంగాస్నాన మవాప్నోతి దశధేను ఫలప్రదమ్!!*


*భావము :*


తులసీదళము నుండి పడిన ఉదకమును శిరమున ధరించినచో గంగాస్నానము చేసినట్లగును. దశధేనుదాన ఫలము నిచ్చును.

                                --పద్మపురాణం


*పూర్ణిమాయా మమాయాంచ ద్వాదశ్యాం రవిసంక్రమే!*

*తైలాభ్యంగే చాస్నాతే చ మధ్యాహ్నే నిశి సంధ్యయోః!!*


*అశౌచే౬శుచికాలే వా రాత్రివాసాన్వితా నరాః!*

*తులసీం యే చ చ్ఛిందంతి తే ఛిందంతి హరేః శిరః!!*


*భావము :* 


పూర్ణిమనాడు, అమావాస్యనాడు, ద్వాదశి రోజున, సూర్యసంక్రమణ దినమున, తలంటుకొనునపుడు, స్నానము చేయకుండగ మధ్యాహ్న కాలమందు, రాత్రియందు, ఉభయసంధ్యలందు, అశౌచమందు, పరిశుద్ధతగా లేనప్పుడు, రాత్రి కట్టిన బట్టతో ఉన్నప్పుడు తులసిని జనులు త్రుంచరాదు. అట్లు త్రుంచువారు విష్ణువు శిరమును త్రుంచిన వారగుదురు.

                     

**** శ్రీ కృష్ణార్పణం🙏*****

కామెంట్‌లు లేవు: