10, ఫిబ్రవరి 2025, సోమవారం

13-22-గీతా మకరందము

 13-22-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారికII ప్రకృతియొక్క గుణములతోటి కలయికయే జీవుని జన్మకు హేతువని వచించుచున్నారు-


పురుషః ప్రకృతిస్థో హి 

భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ 

కారణం గుణసంగోస్య సదసద్యోనిజన్మసు


తాత్పర్యము:- ప్రకృతియందున్నవాడై పురుషుడు (జీవుడు) ప్రకృతివలన బుట్టిన (సుఖదు:ఖాది) గుణములను అనుభవించుచున్నాడు. ఆ యా గుణములతోడి కూడికయే ఈ జీవునకు ఉత్తమ నికృష్టజన్మములెత్తుటయందు హేతువైయున్నది.


వ్యాఖ్య:- జీవుడు ఈ సంసారబంధమున తగుల్కొనుటకును, ఉత్తమాధమజన్మలను బొందుటకును కారణమేమియో ఈ శ్లోకమున తెలుపబడినది. ప్రకృతియొక్క (సత్త్వరజస్తమో) గుణములతోటి, ఆ యా గుణములవలన బుట్టిన ప్రాపంచిక పదార్థములతోటి సంయోగమే జీవునకు బంధహేతువగుచున్నది. పురుషుడు వాస్తవముగ నిర్వికారుడై, జన్మవర్జితుడై, దృగ్రూపుడై యున్నను దృశ్యమగు దేహేంద్రియాదులందు, ప్రాపంచిక పదార్థములందు అహంకార, మమకారములు గలిగి అట్టి దృశ్యోపాధితోను, దానిగుణములతోను సంయోగము గలిగియుండుటవలన వికారవంతుడై, జనన మరణములనొందుచు సంసారిత్వమును బడయుచున్నాడు. కాబట్టి విచారశీలుడు జన్మాది దుఃఖములకు కారణము ఈ గుణసంగమేయని  ఎరింగి తన ఉపాధితోను, ఆ ఉపాధిగుణములతోను, సంగము, ఆసక్తి, మమకారము, అహంకారము లేనివాడై, అసంగ నిర్గుణ చిద్రూపమే తానని భావించుచు, తద్రూపుడై వెలయుచున్నచో, ఇక జన్మాది దుఃఖము లెచ్చట? దుఃఖభూయిష్టమగు ఈ జననమరణ ప్రవాహమునుండి తప్పించుకొనుటకు ఉపాయ మిదియొకటియే అయియున్నది. సంసక్తియే బంధము, అసంసక్తియే ముక్తి. ఒక పెద్ద "ఫ్యాక్టరీలో " అనేకచక్రములు, యంత్రములు పనిచేయుచున్నను, మూలస్థానమునగల పెద్దచక్రము (Flywhee)నకు తగిలించియుండు బెల్టు తెగిపోయినచో వేలకొలది యంత్రములన్నియు ఒక్కుమ్మడి ఆగిపోవునుగదా! అట్లే ఈ జననమరణాదిరూప సంసారయంత్రాంగమంతయు, జీవుడు గుణములతోటి, ఉపాధితోటి, ప్రకృతితోటి సంగమును త్యజించినచో, ఆ క్షణమే నిలిచిపోవ జీవునకు వెూక్షము కరతలామలకమగును.


ప్రశ్న: - జీవుడు ఉత్తమ, నీచజన్మలను బొందుటకు కారణమేమి? 

ఉత్తరము:- గుణములతోడ, ప్రకృతితోడ, ఆతని కలయికయే అట్టి జన్మాదిదుఃఖములకు కారణము. 

ప్రశ్న:- కాబట్టి జన్మరాహిత్యమునకు ఉపాయమేమి?

ఉత్తరము:-వివేకముద్వారా ప్రకృతితోను, గుణములతోను, ఉపాధితోను, దృశ్యవిషయములతోను, సంగమును (సంసక్తిని) త్యజించుటయే.

కామెంట్‌లు లేవు: