*తిరుమల సర్వస్వం -145*
*అలిపిరి మార్గం-16*
*పౌరాణిక ప్రాశస్త్యం*
శ్రీవారి పాదస్పర్శతో పునీతమై, *'శ్రీపతిమెట్టు"* గా కూడా పిలువబడే ఈ మార్గం ఎనలేని పౌరాణిక ప్రాశస్త్యాన్ని పొందింది. ఈ మార్గంలోనే శ్రీవారు అనేకసార్లు వేటనిమిత్తం, వ్యాహ్యాళికై; అశ్వారూఢుడై కొన్నిసార్లు, కాలినడకన కొన్నిమార్లు కొండదిగి పరిసర అటవీప్రాంతానికేతెంచేవారు. శ్రీనివాసుడు ఈ మార్గం ద్వారానే కొండ దిగి వచ్చి మొట్టమొదటిసారిగా నారాయణవనం పరిసరప్రాంత అడవిలో ఆకాశరాజు తనయ పద్మావతిని కాంచి, తొలిచూపులోనే ఆమెను ప్రేమించారని; తదనంతరం వారిరువురికి వకుళమాత చొరవతో పరిణయం జరిగిందని; ఇంతకు ముందే తెలుసుకున్నాం.
వివాహానంతరం అగస్త్యుని సలహా మేరకు ఆరు నెలలపాటు ప్రస్తుతం *"శ్రీనివాసమంగాపురం"* గా పిలువబడే ప్రదేశంలోని అగస్త్యాశ్రమంలో గడిపిన శ్రీవేంకటేశ్వరుడు-పద్మావతి, ఈ మార్గం గుండానే ఆదివారాహక్షేత్రానికి చేరుకొని; తొండమాన్ చక్రవర్తి అప్పటికే అంగరంగ వైభవంగా నిర్మించి సిద్ధంగా ఉంచిన ఆనందనిలయంలో ప్రవేశించారు. ఆ ఆరు మాసాల వ్యవధిలో, శ్రీనివాసుడు సతీసమేతంగా పగటివేళల్లో గడిపినట్లుగా స్థానికులు చెప్పుకునే *"ముక్కోటి"* ఆలయం కూడా శ్రీనివాసమంగాపురం సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరంలో ఉంది. శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి దిగి వచ్చి మొట్టమొదటగా తిరుమలక్షేత్రంపై కాలు మోపిన *"నారాయణగిరి"* శిఖరం "శ్రీవారిమెట్ల" మార్గానికి ఆనుకునే ఉంటుంది.
శ్రీవారి పాదస్పర్శకు గుర్తుగా నారాయణగిరి శిఖరం మీదనున్న "శ్రీవారిపాదాలు" గా పిలువబడే స్వామివారి దివ్య శిలాపాదాలను ఈనాడు కూడా దర్శించుకుని తరించవచ్చు
*చారిత్రక ప్రాధాన్యం*
14-15వ శతాబ్దాలలో విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలం నందు "శ్రీవారిమెట్ల" మార్గం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. శ్రీకృష్ణదేవరాయల వారు సతుల సమేతంగా ఈమార్గం ద్వారానే ఏడు సార్లు తిరుమలకేతెంచి, స్వామివారికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించి తరించాడు. రాయలవారి మంత్రులు, సామంతులు, సేనాధిపతులు, ఉన్నతోద్యోగులు సైతం సపరివార సమేతంగా; గుర్రాల పైన, పల్లకీలు, డోలీలు, మేనాల పైన; ఈ మార్గం లోనే ప్రయాణించి తిరుమలకు చేరుకునేవారు. శ్రీవారిమెట్లకు సమీపంలో ఉన్న చంద్రగిరిని ఏలిన ప్రభువులదరూ శ్రీవారి పరమ భక్తులే! తిరుమల ఆలయంలోని నైవేద్యనివేదన ఘంటానాదం విననిదే ఆహారాన్ని తీసుకునేవారు కాదు. వీరు కూడా తరచూ శ్రీవారిమెట్ల మార్గం ద్వారానే తిరుమలేశుణ్ణి దర్శించుకునే వారు. ఆలయనిర్మాణానికి, పునరుద్ధరణకు, ఆ కాలంలో కట్టబడిన లెక్కలేనన్ని మంటపాలకు అవసరమైన బండరాళ్ళను, రాతి ఇటుకలను, గండశిలలను, శిలాస్తంభాలను గజరాజుల చేత, ఈ మార్గం ద్వారానే చేరవేశారని చాలామంది చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు.
మనం "విమానప్రదక్షిణం' ప్రకరణంలో చెప్పుకున్నట్లుగా, 15వ శతాబ్దంలో నియమింపబడ్డ 24 మంది వేదపండితులు శ్రీనివాసమంగాపురం లోనే నివాసముంటూ, శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని వేదపారాయణం చేసేవారు. అలాగే తిరుమల కొండపై జనావాసాలు అంతగాలేని సమయంలో, అర్చకులు శ్రీనివాసమంగాపురం సమీపంలో నుండే 'కొత్తూరు" అనే గ్రామంలో నివసిస్తూ; వేకువఝామునే బయలుదేరి శ్రీవారిమెట్ల ద్వారా కొండపైకి చేరుకుని అర్చనాఅభిషేకాదులు నిర్వహించి చీకటి పడకుండానే క్రిందకు చేరుకునేవారు.
శ్రీవారి ఆలయంలో ఉండే హుండీని *"కొప్పెర"* గా పిలుస్తారని మనం ముందుగానే చెప్పుకున్నాం. "కొప్పెర" అంటే వెడల్పాటి మూతి గల పెద్ద లోహపుపాత్ర అని అర్థం. తిరుమలక్షేత్రం మహంతుల ఆజమాయిషీలో ఉన్నప్పుడు ప్రతిరోజూ రెండుపూటలా కానుకలతో నిండిన "కొప్పెర" ను మోసుకుంటూ వెళ్లి; ఆలయం ప్రక్కనే ఉన్న "మహంతు మఠం" లో చేర్చటానికి ప్రత్యేకంగా పరిచారకులు ఉండేవారు. "కొప్పెర" ను మోసే వారందరూ కలిసి ఒక తెగగా ఏర్పడి శ్రీనివాసమంగాపురం సమీపంలో ఉన్న ఒక గ్రామంలో నివసించటం వల్ల ఆ గ్రామాన్ని *"కొప్పెరవాండ్ల పల్లి"* గా పిలిచేవారు. వారు కూడా శ్రీవారిమెట్ల మార్గం గుండానే ప్రతిరోజూ తిరుమలకు చేరుకునేవారు.
ఆ రోజుల్లో శ్రీవారి సేవలకు, ఉత్సవాలకు, నైవేద్యాలకు, నిత్యదీపారాధనకు కావలసినటువంటి ధాన్యం, పప్పుదినుసులు, కూరగాయలు, ఆవునెయ్యి, పాలు, పెరుగు, పూలు మొదలైనవన్నీ కూడా; చంద్రగిరి పరిసర ప్రాంతాల నుండి గంపలలో కెత్తుకుని శ్రీవారిమెట్ల మార్గం ద్వారానే కొండపైకి చేర్చేవారు.
ఈ విధంగా, శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి పరిసర గ్రామాలైన ఎగువ రెడ్డివారిపల్లి, దిగువ రెడ్డివారిపల్లి, మెట్టపాలెం, నరసింగాపురం, కాళూరు, చెర్లోపల్లె, పెరుమాళ్ళపల్లి మొదలైన గ్రామాల ప్రజలందరూ; శ్రీవారిమెట్ల మార్గంతో, ఆనాడూ-ఈనాడూ కూడా; ఆత్మీయ సంబంధం, తద్వారా శ్రీనివాసునితో విడదీయరాని అనుబంధం, కలిగి ఉన్నవారే!
ఇంతటి మహత్తరమైన చారిత్రక వారసత్వాన్ని సొంతం చేసుకున్న శ్రీవారిమెట్ల మార్గం గుండా కనీసం ఒక్కసారైనా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవటం శ్రీనివాసుని భక్తులందరి చిరకాల స్వప్నం.
[ రేపటి భాగంలో... *తొండమాన్ చక్రవర్తి* గురించి తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి