*లలితా అష్టోత్తర శతనామావళి- భావం*
*(పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు )*
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
*Part - 14*
*౪౨.* *సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః! –*
సనకాదులచేత పూజింపబడుతున్న దివ్యపాదుకలు గల తల్లి. శుభాగమ పంచకం ద్వారా ఆరాధింపబడే తల్లి.
ఇక్కడి నుంచి వరుసగా మూడు నామములు అమ్మవారి ఉపాసకుల గురించి తెలియజేస్తున్నాయి. అమ్మవారి పాదుకలను సనకసనందాదులు సంపూర్ణంగా, సమగ్రంగా, సంతోషంగా ఆరాధన చేస్తూ ఉంటారు. పుట్టుకతోనే బహ్మవేత్తలైనటువంటి వారు వాళ్ళు. నారాయణుని అంశావతారం అని చెప్తున్నది భాగవతం. అటువంటి సనకసనందాదులు నిరంతరం ఆరాధించే పాదుకలు అమ్మవారివి.
శ్రీవిద్యలో పాదుకా దీక్ష అని ఒకటి ఉంది. అది పరిపూర్ణమైన దీక్ష. ఆ పాదుకలు బ్రహ్మజ్ఞానానికి సంకేతం. సమస్త విశ్వానికీ మూలమైన పరబ్రహ్మ, పరబ్రహ్మయొక్క శక్తిని తెలియజేస్తున్నది. పరబ్రహ్మము తప్ప అన్యము లేదు ఈ జగత్తులో. అన్యంగా జగత్తు కనబడడం కేవలం మిథ్య మాత్రమే. పరమాత్మ తత్త్వమే ఉన్నది అనే స్థితియే నిజమైన పాదుకాదీక్ష. ఆ స్థితి బ్రహ్మవేత్తలకి ఉంటుంది. అటువంటి వారు పరతత్త్వ స్వరూపిణియైన అమ్మవారి యొక్క భావనలోనే నిరంతరం ఉంటారు అదే సమారాధన అంటే అర్థం. సమారాధన అంటే కేవలం బాహ్యపూజ మాత్రమే కాదు. నిరంతరం మనస్సు అనుసంధానింపబడడమే సమారాధన.
అమ్మవారి ఉపాసనా సంప్రదాయంలో శుభాగమ పంచకము అని వైదికమైన సంప్రదాయంతో కూడిన తాత్త్వికమైన ఉపాసనా విధానాలున్నాయి. అవి సనక, సనంద, వశిష్ఠ, శుక, ఆదిగురువైన దక్షిణామూర్తి ఇత్యాదులు.. వీరినుంచి వచ్చినటువంటి వచ్చిన ఆచారాన్ని సమయాచారం, దక్షిణాచారం అంటారు. ఇవి శుభాగమములు అని చెప్పబడుతున్నాయి. ఇవి సనక మొదలైన వారి చేత ఏర్పడ్డాయి గనుక శుభాగమ పంచకం ద్వారా ఆరాధింపబడే తల్లి.
అమ్మవారి పాదుకాధ్యానం జరిగే చోటు సహస్రార కమలం. అమ్మవారి పాదచిహ్నములు భాసిస్తున్న చోటు సహస్రారం. పాదుకా స్మరణ చేసేటప్పుడు -
“వందే గురుపదద్వంద్వం అవాఙ్మానస గోచరం!
రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహత్!! -
త్రిపుర యొక్క కాంతి సమూహము పాదములుగా భాసిస్తున్నది. ఆ పాదముల వద్దకు చేరుకోవడమే పాదుకాదీక్ష. సహస్రార కమలం వద్దకు చేరుకొని అక్కడ శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించగలిగితే అది పాదుకాదీక్ష. అది సనకసనందాదులు బ్రహ్మానుభవం ద్వారా పొంది ఉన్నారు గనుక ‘సనకాదిసమారాధ్యపాదుకాయై నమోనమః’.
*౪౩.* *దేవర్షిభిస్స్తూయమానవైభవాయై నమో నమః! –*
౧. మనలో ఉన్న ఆలోచనలు ఋషులు, ఇంద్రియశక్తులు దేవతలు. ఇంద్రియములతో అమ్మవారిని స్తుతిస్తూ, అర్చిస్తూ ఆలోచనలో అమ్మవారిని భావిస్తూ, ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉంటే అదే ‘దేవర్షిభిస్స్తూయమానాత్మవైభవా’.
౨. దేవతలు, ఋషులచేత స్తుతింపబడుతున్న తల్లి.
అమ్మవారి వైభవాన్ని దేవతలు, ఋషులు స్తుతిస్తున్నారు. వైభవం – గొప్ప భావం, విశేషమైన భూతి, విభుత్వము అదే వైభవము. భూతి అనగా ఐశ్వర్యం. అమ్మవారి ఐశ్వర్యము, గుణము, లీల, మహిమ, తత్త్వము – ఇవన్నీ వైభవాలే. ఎక్కడా లేనంత సొగసు, గొప్పతనము, శోభ అమ్మవారి రూపనామగుణలీలాతత్త్వాలలో ఉన్నాయి. ఈ అయిదింటినీ కలిపి వైభవం అనాలి. అలా అమ్మవారి రూపనామగుణలీలాతత్త్వమహిమా వైభవాలను నిరంతరం గానం చేసేవారు ఋషులు. వారిచేత నిరంతరం గానం చేయబడు తల్లి.
ఎందుకంటే గొప్పతనాన్ని గొప్పవారే గుర్తించగలరు. మానవ ప్రజ్ఞకి అమ్మవారి వైభవం అందదు. అమ్మవారి వైభవాన్ని కీర్తించాలి అంటే రెండు రకాల ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞాస్థాయికి చేరిన వాళ్ళే అమ్మవారిని కీర్తించగలరు. తర్కవితర్కాలతో కూడిన మానవప్రజ్ఞ అమ్మవారి వైభవాన్ని గుర్తించలేదు, కీర్తించలేదు. తర్కవితర్కాలకు అతీతమైన దేవతా ప్రజ్ఞ, ఋషి ప్రజ్ఞ ఉండాలి. దివ్యమైన ప్రజ్ఞ దేవతా ప్రజ్ఞ, అలౌకికమైనది. అతీంద్రియమైన దర్శనశక్తి కలవాడు ఋషి. అతీంద్రియమైన జీవనము, ఉపాధి కలవారు దేవతలు. అలాంటి దేవతలు, ఋషుల చేత మాత్రమే గానం చేయబడగలిగినటువంటి వైభవం అమ్మవారిది.
మన శరీరంలో ఇంద్రియశక్తులను దేవతలు అంటారు. కంటికి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, చెవులకి దిగ్దేవతలు, నాసికకి వాయువు, పాదములకు విష్ణువు – ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. ఋషులు అనగా ఆలోచనాపరులు. తపస్సంపన్నులు. మనలో ఉన్న ఆలోచనలు ఋషులు, ఇంద్రియశక్తులు దేవతలు. ఈ ఇంద్రియములతో అమ్మవారిని స్తుతిస్తూ, అర్చిస్తూ ఆలోచనలో అమ్మవారిని భావిస్తూ, ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉంటే అదే ‘దేవర్షిభిస్స్తూయమానాత్మవైభవా’. ఇలాంటి మాటే ‘దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా’ అని సహస్రనామాలలో ఉంది.
*శ్రీమాత్రే నమః* 🙏🏻
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి