🙏 నాటకము --- పంచ సంధులు🙏
నాటక రచనకు పూర్వము తాను స్వీకరించిన వస్తువు క్రమ వికాస పరిణామము పొందుటకై, దానిని ఏ విధముగా సన్నివేశపరుపవలెనో ఆ విధ మును ఊహించి ఏర్చరచుకొనిన కథా ప్రణాశికా భాగములను అర్థప్రకృతులు అందురు .
1బీజము, 2 బిందువు, 3 పతాక 4 ప్రకరి 5 కార్యము అని అర్థప్రకృతులు ఐదు విధములు
ఆ యర్థ ప్రకృతులలో ఏ భాగమునందు ఏ కార్యదశను నిబంధింవవలెనో నిర్ణయించుకొని కవి ఆ ప్రకారము కథను నడుపును. ఈ దశలకు కార్యావస్థలు అనిపేరు
1 ఆరంభము 2:ప్రయత్నము 3 ప్రాప్తాశ 4:నియతాప్తి 5 ఫలాగమము ఇవి కార్యావస్థలు
అర్థప్రకృతులు కార్యావస్థలతో కూడిన వాటికి పంచ సంధులు అని పేరు
1 ముఖసంధి, 2:ప్రతి ముఖసంధి 3 గర్భ సంధి 4 అవిమర్శ సంధి 5 నిర్వహణ సంధి
అర్థప్రకృతులు + కార్యావస్థలు = పంచ సంధులు
బీజము + ఆరంభము = ముఖ సంధి
బిందువు + ప్రయత్నం = ప్రతి ముఖ సంధి
పతాక + ప్రాప్తాశ =గర్భసంధి
ప్రకరి+ నియతాప్తి = అవిమర్శ సంధి
కార్యము + ఫలాగమము = నిర్వహణ సంధి
ఇచ్చట సంధి అనగా రెండు రేఖలు కలియగా
ఏర్పడెడి బిందువువంటి స్థానమని తలవరాదు ఆ పదమునకు ఆనుకూల్యము,
అవిరోధము, సమన్వయము అని అర్థము చెప్ప
కొనవలెను. కథ ప్రణాళికానునారము నడచిన నాటకమే సుసంపన్న ఘటితమగును అది ఎట్లంటే ఒక భవన నిర్మాణమునకు పూనుకొన్న వాస్తుశిల్పి ముందుగా ఆ భవనము యొక్క అవయవ పరిమాణాత్మకమైన ఒక పటమును వేసుకొని , దానిని ఆనుసరించియే నిర్మాణము ప్రారంభించును. ఆ పటమున పునాదుల లోతు వెడల్పులు, గోడల ఎత్తు పొడవులు, ద్వారముల, కిటికీల స్థానములు, వాటి
కొలతలు మొదలైన విధములన్నియు ముందే సూచించి యంచుకొనును. శంకు స్థాపన మొదలు భవనము పూర్తి యగు వరకును ఆ ప్రణాళికనే అనుసరించు చుండును గాని, దానికి విరుద్ధముగా కట్టడు
అట్లే నాటక కర్త కూడా ముందుగా తాను వేసుకున్న అర్థప్రకృతులు కార్యావస్థలు పంచ సంధుల ప్రణాళికను తు. చ తప్పక పాటించుచు
ఆయా అంకములందు పొందుపరచును
ఈ విధముగా నాటక రచన చేయడం కాళిదాసు వంటి సంస్కృత కవులకు ప్రాచీన తెలుగు కవులకు సాధ్యం అయినది.
మనము నాటకం లోని పంచ సంధులు వెతికితే అంత సులభంగా దొరకవు ప్రతి అంకము క్షణ్ణముగా పరిశీలించి కవి హృదయం తెలుసుకోవాలి. అల్లా తెలుసుకున్న భాష్య కారులు ఆ పంచ సంధులను మనకు అందించారు ముందుగా పతాక సన్నివేశం ఎక్కడ ఉన్నది గుర్తించాలి. ప్రతి నాటకమున పతాక సన్నివేశం ఉంటుంది ఇప్పుడు మనకు పతాక సన్నివేశం అంటే ఏమిటి అని ప్రశ్న కలుగుతుంది.
నాటక కథను మలుపు తిప్పు సన్ని సన్నివేశాన్ని
పతాక సన్నివేశం అంటారు అభిజ్ఞాన శకుంతలం
నాటకములో అంగుళీయక వృత్తాంతం పతాక
సన్నివేశము దుష్యంతుని సత్య సంధతకు భంగం వాటిల్లకుండా కవి కల్పించిన అపూర్వ సృష్టి ఇది.
ఈవిధముగా పతాక సన్నివేశం పంచ సంధులను
గుర్తించినపుడే ఆ కవి హృదయం తెలుసు కోగలము.( విద్యార్థులకు సులభంగా అర్ధమవడానికి నిజముగా ఈ వ్యాసం వ్రాయడం చాలా కష్టమనిపించింది కృతకృత్యుణ్ణి అయ్యానో లేదో చూడాలి )
తెలుగు నాటకాలు
ప్రాచీన కాలంలో కవులు ఎందువల్లనో గాని తెలుగులో నాటకాలు వ్రాయలేదు సంస్కృత నాటకాలను అనువదించేటప్పుడు నాటకాలుగా కాక ప్రబంధలుగా అనువదించారు. సంస్కృత కవులు ఆర్జించిన ఖ్యాతి తమకు లభించదనియో,
అంత రసవత్తరముగా రచించుట సాధ్యం కాదనియో, మరేయితర కారణమో తెలియదు కాని మొత్తం మీద నాటక రచన చేయలేదు
వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామము వీధి నాటకమని పేర్కొనినను అది ప్రదర్శన యోగ్యం కాదని కొందరి భావన. ప్రాచీన కాలములో తెలుగు నాటకాలు మృగ్యము.
1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రచించిన మంజరీ మధుకరీయం తెలుగు నాటక రచనకు అంకురార్పణ జరిగింది. 1880లో తొలి సాంఘిక నాటకమైన నందకరాజ్యాన్ని వావిలాల వాసుదేవశాస్ర్తి రచించారు. కందుకూరి వ్యవహార ధర్మబోధిని తొలి ప్రదర్శన పొందిన తెలుగు నాటకంగా గుర్తింపు పొందింది. వ్యవహారిక భాషకు పట్టం కట్టిన గురజాడ కన్యాశుల్కం, పాత్రోచిత భాషకు పెద్దపీట వేసిన వేదం వెంకటరాయశాస్ర్తి ప్రతాపరుద్రీయం నాటక రచనలో ఒక అద్భుత పరిణామం.చిలకమర్తి నాటకాలు విశిష్టతను సంతరించుకొన్నవి
కీచక వధ, ద్రౌపదీ పరిణయం, శ్రీరామ జననం
పారిజాతాపహరణం, సీతా కళ్యాణం
గయోపాఖ్యానం, నల చరిత్రం, ప్రసన్నయాదవం
చతుర చంద్రహాసము ఆయనకు విశేష ఖ్యాతిని కలుగజేసినవి.బలిజేపల్లి సత్యహరిశ్చంద్ర, ధర్మవరం చిత్రనిళయం, కోలాచలం రామరాజు చరిత్ర, తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ విజయాలు, కాళ్లకూరి చింతామణి, వరవ్రికయం, త్రిపురనేని హేతువాద నాటకాలు, దామరాజు పుండరీకాక్షుడి స్వాతంత్ర్యోద్యమ నాటకాలు, సుంకర వాసిరెడ్డి ఉద్యమ నేపథ్య నాటకాలు, సమకాలీన సమస్యలకు అద్దంపట్టిన ఆత్రేయ నాటకాలు తెలుగు నాట రచనను సుసంపన్నం చేశాయి. ఎన్నో పాశ్చాత్య ధోరణుల ప్రభావంతో తెలుగు నాటకం ఆధునికతను సంతరించుకుంది. అపురూపమైన జానపద కళారూపాలు నాటకంతో మమేకమయ్యాయి. ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలతో పాటు తెలుగునాట జరిగిన ఎన్నో పరిషత్తుల ప్రదర్శనల మూలంగా నాటక రచన ఇబ్బడిముబ్బడిగా జరిగింది. ప్రజానాట్యమండలి స్ఫూర్తితో నాటక రచన జనజాగృతికి బాటలు తొక్కింది. దాదాపు 141 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో వేలాది నాటక, నాటిక రచనలు వెలువడ్డాయి
స్వస్తి
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి