11, ఫిబ్రవరి 2025, మంగళవారం

గురువు -లక్షణాలు

 గురువు -లక్షణాలు 

ముందుగా గురువు అంటే ఏమిటి? గురువు లక్షణం, వైశిష్ట్యం తెలుసుకొని అప్పుడు గురుపాదుక మంత్రం గురించి చర్చిద్దాం.

గురు ప్రార్ధన 

సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం

అర్ధం 

ఎవరికైనా మొదటి గురువు సదా శివుడు మాత్రమే. అందుకే శివాయ గురవేనమః అన్నారు.గురువు అంటేనే సదాశివుడు. .సదాశివుడు మొదలుకొని వ్యాస, శంకరులు మధ్యవారు. వారి తరువాత మన గురువు వరకు ఉన్న గురు పరంపరకు అందరికి నమస్కారం చేద్దాము .


గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు

గురుర్దేవో మహేశ్వరః 

గురు సాక్షాత్ పరబ్రహ్మా 

తస్మై శ్రీ గురవే నమః"


గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అందుచేత శ్రీగురువునకు నమస్కారం.


గురువుయొక్క లక్షణం గురించి ఈ విధంగా చెప్పబడింది 

శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్

శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్

ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః

నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.

అర్ధం 

 శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, (ఉన్నత వంశంలో పుట్టినవాడు) వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.

" మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అని వేదం చెబుతోంది . తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది.అని మరొక అర్ధం

ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగాఒక రూపముగా నిలిచే వ్యక్తి గురువు.


న గురోరధికం నగురోరధికం

న గురోరధికం నగురోరధికం

శివ శాసనతః శివ శాసనతః

శివ శాసనతః శివ శాసనతః

గురువు కంటే అధికులు లేరు. గురు వాక్యం మనకు శివుని శాసనమే


బీజాక్షరాల పుట్టుక గురించి తెలుసుకుందాము


మొట్ట మొదటఆకాశం (శూన్యం) లోంచి శబ్దబ్రహ్మము పుట్టింది. ఆ శబ్దమే ఓంకారం. ఓంకారం లోంచి ప్రకంపనల వలన శూన్యమంతా ఆవరించిన శక్తిలో చలనం మొదలైంది. ఆ చలనం ఈ బ్రహ్మాండ విశ్వాన్ని, గ్రహ,నక్షత్రాల్ని సృష్టించింది.


శబ్దబ్రహ్మమే శక్తి యొక్క తొలి వ్యక్త రూపం. ఓంకారం లో అ ,ఉ, మ అనే అక్షరాలున్నాయి. అంటే మనం ఏ శబ్దం పలకాలన్నా నోరు తెరిచి (అ)అనాలి తరువాత నోరు మూయాల్సి ఉంటుంది (మ).(ఇక్కడ జాగ్రత్తగా అర్ధం చేసుకోండి.)

అంటే….లోకంలో ప్రతి శబ్దం అ--మ ల మధ్యే జనిస్తుంది.

ఇలా అన్ని శబ్దాలు ఓమ్ లోంచే పుడుతాయి కనుక ఓం మూల బీజం

ఇక్కడ నుండి అమ్మవారి మంత్రం చెప్పకూడదు కనుక ఇంతవరకు మాత్రమే ఇస్తున్నాను

కామెంట్‌లు లేవు: