11, ఫిబ్రవరి 2025, మంగళవారం

పోతన - భాగవతం 🙏 మూడవ భాగం

 🙏 పోతన - భాగవతం 🙏 

                       మూడవ భాగం 

శ్రీమహాభాగవత ప్రారంభంలో పోతన 'మహా నందాంగనా డింభకు'డైన శ్రీకృష్ణుని చరిత్రను "శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్" అని చెప్పుకొన్నాడు.మనం కూడా ఆ ప్రయత్నాన్నే కొనసాగిద్దాం.


"శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర

క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో

ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా

నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌."


పోతన భాగవతాన్ని తెలుగులో వ్రాయటానికి కారణం ‘ శ్రీ కైవల్య పదం’ అనగా మోక్షాన్ని చేరటానికి వ్రాస్తున్నాను అంటాడు. కావ్య ప్రయోజనం ఇంతకంటే ఏముంటుంది. “పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట, పలికిన భవహరమగునట” ( పలికితే పాపాలు పోతాయిట ) కనుక భాగవతాన్ని మనకందించేడు పోతన. మరి శ్రీకైవల్య పదం చేరటానికి ఎవరిని ప్రార్థించాలి! “లోకాలని రక్షించేవాడు, భక్తులను పాలించేవాడు, దానవులను శిక్షించేవాడు, తన కేళీ (ఆట) లీలావిలాస దృష్టితో సమస్తలోకాలని సృజించే వాడు” అయిన శ్రీకృష్ణుని ప్రార్థించాలి అంటాడు. అలా సామాన్యంగా శ్రీకృష్ణుడు అని చెపితే ఎలా! అందుకే ‘ మహానందాంగనా డింభకున్’ అంటే మహానందుని యొక్క అంగన (భార్య) అయిన యశోదాదేవి కుమారుడట. ఈ పదంలో ఇంకో అందమైన అర్థం ఉంది మహా + ఆనంద= తలచి నంతనే గొప్ప ఆనందాన్ని కలిగించేవాడుట కృష్ణుడు. కృష్ అనగా అపరిమిత ణ అంటే ఆనందాన్ని అనే అర్థం కృష్ణ అనే పదం లోనే ఉంది. అది ‘ సహజ కవి, భక్త కవి’ అయిన పోతన కవితా చమత్కారం

సాధారణంగా నాటక లక్షణాలలో నాందీశ్లోకంగాని పద్యంగాని ఉంటుంది. పోతన గారు ఆ లక్షణాన్ని గ్రహించారు.

ఇది నాందీశ్లోకం వంటి పద్యం. ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశాలలోని ఒక లక్షణం నిక్షేపించడం దీని లక్ష్యం. "శ్రీవాణీగిరిజా శ్చిరాయ" అని నన్నయ అన్నాడు. "శ్రీయన గౌరి నాఁబరగు" అని తిక్కన అన్నాడు. "శ్రీకైవల్యపదంబు"ను పోతన్న ప్రస్తావించినాడు. ఈపద్యంలో నమస్క్రియతో పాటు వస్తునిర్దేశం కూడా ఉండటం విశేషం. భాగవత కథానాయకుడు నందనందనుడు. అత డవతార పురుషుడు. లోక రక్షణం ఆ అవతారానికి ప్రేరణం. అతడు గజేంద్రాది భక్తులను పాలించినవాడు. హిరణ్యకశిపు ప్రభృతి దానవుల ఉద్రేకాలను స్తంభింప జేసినవాడు. ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్టరక్షణకూ దుష్టశిక్షణకూ మూలకందాలు. భాగవత కథాచక్రం ఈ రెండు అంశాలచుట్టే చంక్రమించింది. ఈ రకంగా పోతన్న పై పద్యంలోని పాదచతుష్కంలో భాగవతంలోని పన్నెండు స్కంధాల పరమార్థాన్ని నిర్దేశించినాడు. మరొకవిశేషం ఈ పద్యంలోని నందాంగనా డింభకుడు కేవల స్థితికారుడే కాడు, సృష్టికారుడు కూడా. "కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు" అనే ప్రయోగంలో అది ధ్వనించింది. "దానవోద్రేకస్తంభకు" అనే మాటలో అతని లయ కారత్వం స్ఫురించింది. అంటే ఈ పద్యంలో నందింప బడిన పరమాత్ముడు త్రిగుణాత్ముడు. అయితే విశ్లేషించుకుంటే బోధపడే అర్థమిది. ఒక మహోర్మికలా ఉప్పొంగి వచ్చే మూర్తి మాత్రం సత్త్వానిది. కాష్ఠంకంటే ధూమం, ధూమంకంటే త్రయీమయమైన వహ్ని విశేషమైనది. అలాగే తమోగుణం కంటే రజోగుణం, రజోగుణంకంటే బ్రహ్మప్రకాశకమైన సత్త్వం విశిష్టమైనది. (ప్రథమ స్కంధం 59) అందుకే తొల్లిటి మునులు సత్త్వమయుడని భగవంతుడైన హరినే కొలిచినారు. ఆ భగవంతుని సత్త్వనిర్భర స్వరూపమే పైపద్యంలో ఉల్లేఖింపబడింది.


అవతారికలోని రచనాలక్ష్యాన్ని పరికించినా, నాందీపద్యాన్ని పరిశీలించినా పోతన్న ధ్యేయం కైవల్యమేనని బోధపడుతుంది. భవబంధరాహిత్యం, జన్మసాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం. ఆ కైవల్యం పోతన్న వాంఛించిన పరమపదం; పురాజన్మ తపఃఫలం. ఈ కైవల్యకాంక్ష ప్రవృత్తిలా భాసించే నివృత్తి; భాగవతంలోని ప్రధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయంతిక.


ఇంచుమించుగా సమకాలీనులైన శ్రీనాథ పోతనామాత్యుల వ్యక్తిత్వాల వాసి ఇక్కడే ఉంది. శ్రీనాథుడు శృంగారిగా ఎంత వ్యాపృతుడైనా 'ఈశ్వరార్చన కళాశీలుండ'ననే చెప్పుకున్నాడు. భోగినీదండకం వంటి పరమశృంగార కృతి రచించినా పోతన్న మహాభక్తుడుగానే పేరొందినాడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తిప్రబంధాలు వ్రాసినా, నైషధంలోని రక్తివల్లనూ, చాటుపద్యాలలోని శృంగార ప్రసక్తివల్లనూ శ్రీనాథుడు శృంగారసనాథుడుగా స్థిరపడినాడు. రుక్మిణీకల్యాణం, రాసక్రీడాభివర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగార వర్ణనలు చేసినా పోతన్న తెలుగుల పుణ్యపేటిగానే కీర్తింప బడుతున్నాడు. ఇందుకు ఒకకారణం - కాలం గడిచినకొద్దీ వీరిచుట్టూ అల్లుకున్న కట్టుకథలు. మరొకకారణం - కావ్యావతారికల్లో వీరి వ్యక్తిత్వాలు వేసుకున్న ముద్రలు. శ్రీనాథుని కృతులన్నీ నరాంకితాలు. అతని జీవితంలోని ఉజ్జ్వల ఘట్టాలన్నీ రాచకొలువులకే సమర్పితాలు. పట్టెడు వరిమెతుకులు, గుక్కెడు మంచినీళ్ళు పుట్టని దుర్దశలో కూడా ఆ రాజస మూర్తి అటు కృష్ణుణ్ణో, ఇటు శివుణ్ణో దుయ్యబట్టినాడు. ఇరవై సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక, ఎక్కడో కర్ణాటరాయల కొలువులో, నిక్కిపడే గౌడ డిండిమభట్టును ఉద్భట వివాదప్రౌఢితో ఓడించి, అతని కంచుఢక్కను పగులగొట్టించి, రాయల సభాగారంలో స్వర్ణస్నానం చేయించుకునే దాకా తృప్తిపడని మత్యహంకృతి అతనిది. దిక్కూమొక్కూ లేని అవసానదశలో దివిజకవివరుని గుండియలు దిగ్గురనేటట్టు కడ ఊపిర్లో గూడా కవిత లల్లగల్గిన ప్రౌఢవ్యక్తిత్వం అతనిది. మరి పోతన్న వ్యక్తిత్వం ఇందుకు భిన్నం. అతడు నరాధిపులను కొలువలేదు; సిరులకై ఉరుకులాడలేదు; అధికారాన్ని ఆశించలేదు; అహంకారాన్ని ప్రకటించలేదు. పూర్వకవులతోపాటు, వర్తమాన కవులతో పాటు భావికవులను గూడా బహూకరించిన వినయభూషణు డతడు. సమకాలీనకవులను సంభావించడమే ఒక విశేషం. పుట్టని కవులకు జేకొట్టడం పోతన్న సహనశీలానికి నిదర్శనం. సహనగుణం సత్త్వం పాదులో పుట్టేదే కదా! ఈ సత్త్వగుణాన్ని ఆధారంగా చేసుకునే పోతన్న నిరాడంబర వ్యక్తిత్వాన్ని గూర్చీ, నరాధిప పరాఙ్ముఖత్వాన్ని గూర్చీ కొన్ని చాటు కథలు ఆ నోటికానోటి కెక్కి నేటికీ తెలుగునాట వాడుకలో ఉన్నాయి. భాగవతాన్ని తన కంకిత మివ్వవలసిందని సర్వజ్ఞసింగ భూపాలుడు కోరడం, పోతన్న కాదనడం, భూపాలునికి కోపం వచ్చి దానిని నేలపాలు చేయడం - ఇదోకథ. శ్రీనాథుడూ పోతన్నా స్వయానా బావమరదులు.ఇది వాస్తవం కాదు. శ్రీనాథునకు పోతన అనే బావమరిది ఉన్నమాట నిజమే కానీ అతను దగ్గుపల్లి పోతన.దగ్గుపల్లిదుగ్గన సోదరుడు. అంతవరకూ ఎందుకు? శ్రీనాథుని తొంబై సంవత్సరాల వయస్సులో పోతన ఏడు ఎనిమిది ఏళ్ల బాలుడు. ఇది కాలాలను బట్టి చరిత్ర చెబుతున్న సాక్ష్యం. ప్రస్తుత విషయం చూడాలి.పోతన్న పొలం దున్నుతుంటే ఆ'నాథన్న' పల్లకిలో రావడం, అటు బోయీలు లేకుండా పల్లకి తేలిపోవడం, ఇటు ఎడ్లు లేకుండా నాగలి సాగిపోవడం - ఇది మరోకథ. ఇవే కాక 'కర్ణాటకిరాటకీచకు' లెవరో అతని కృతిని కాజేయాలని వస్తే ఆ తల్లి సరస్వతి 'కాటుక కంటి నీరు చనుకట్టు' మీద పడేటట్టు బావురు మనడం, "అమ్మా! ఏడువకమ్మా! నిన్ను ఎవరికీ అమ్మనమ్మా!" అని ఈ పరమభక్తుడు ఓదార్చడం - ఇదో పిట్టకథ. కృతిని ఇక్కడ 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి', అక్కడ 'కాలుచే సమ్మెటవ్రేటులం బడక' బమ్మెర పోతరాజు భాగవతాన్ని 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె'నని అవతారిక లోని మరోపద్యం ఇచ్చే సాక్ష్యం. పోతన్న పేరు చెప్పితేనే సగటు సాహితీ బంధువులకు ఈ పద్యమే గుర్తు కొస్తుంది. ఈ పద్యం పోతన్నది కాదంటే చాలా మందికి గుండెల్లో కలుక్కుమంటుంది. నిజానికి ఈ పద్య రచనలో ఏ కోశానా పోతన్న శైలీవాసన లేదు. 'సొమ్ములు కొన్ని పుచ్చుకొని', 'సొక్కి', 'శరీరము వాసి', 'కాలుచే సమ్మెటవ్రేటులు' 'సమ్మతి', 'ఇచ్చిచెప్పె' ఈ 'బమ్మెరపోతరా జొకఁడు' - ఇదీ ధోరణి. ఇవి పోతన్న పలుకులేనా? భావికవులను బహూకరించిన, భవబంధవిమోచనం ఆశించిన భక్తశిరోమణి మాటలేనా? కాదన వలసిన అవసరం లేకుండానే మరొక అంతస్సాక్ష్యం ఉంది. ఈ పద్యానికి ముందుమాట 'ఉభయ కావ్యకరణ దక్షుండనై' అన్నది. ఇది ఉత్తమపురుషంలో ఉంది. వెంటనే 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యంలో 'బమ్మెరపోతరాజొకఁడు' అంటూ ప్రథమ పురుషం దూకుడుంది. ఆ పద్యం తరువాత మరొక పద్యం. తరువాత 'అని మదీయ' అంటూ మళ్లీ ఉత్తమపురుషం దర్శనం ఇచ్చింది. పద్యశిల్పాన్నిబట్టే కాక అన్వయ దోషాన్ని బట్టి చూసినా ఇది పోతన్న పద్యం కాదనే అనిపిస్తుంది. అతని భక్తులో, అనురక్తులో తదనంతర కాలంలో ఈ పద్యాన్ని జొప్పించి ఉంటారు. ఎవరో ఎందుకు? అతని శిష్యుడు సింగయ్యే వ్రాసి ఉంటాడేమో? సింగయ్య భాగవతంలోని షష్ఠ స్కంధాన్ని రచించినాడు. పోతన్న పోతలోనే ఇతనూ ఒక అవతారిక సంతరించుకున్నాడు. పూర్వకవిస్తుతిలో శ్రీనాథునితోపాటు బమ్మెరపోతరాజును స్మరించినాడు. పోతరాజును స్తుతిస్తూ చెప్పిన పద్య మిది:


"ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్‌

సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు చేసినవాని భక్తిలో

నమ్మినవాని భాగవతనైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో

బమ్మెర పోతరాజు కవి పట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్‌."ఈ పద్యంలో ఒకటి రెండు అంశాలు గమనింపదగినవి ఉన్నాయి. 'ఇమ్మనురాజేశ్వరాధముల' పద్యంలో 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె' 'ఈబమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు' అని ఉంది. 'ఎమ్మెలు సెప్పనేల' పద్యంలో 'పన్నగరాజశాయికిన్‌', 'సొమ్ముగ ... భాగవత నైష్ఠికుఁడై ... తగువాని ... బమ్మెర పోతరాజు.' అని ఉంది. ఆ పద్యంలో ప్రాసస్థానంలో 'సొమ్ములు' 'బమ్మెర' ఉన్నాయి. ఈ పద్యంలోనూ ఆ మాటలే ఉన్నాయి. అక్కడ 'జగద్ధితంబుగన్‌' అని ఉంటే ఇక్కడ 'జగమెన్నఁగ' అని ఉంది. 'సమ్మతి శ్రీహరి కిచ్చి' చెప్పడం అని అందులో ఉంటే ఆ స్వామికి 'సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు' చేయడం ఇందులో ఉంది. ఈ రెండు పద్యాల్లోనూ పోతన్న భక్తి తత్పరతే ఉగ్గడింపబడింది. పైగా రెండుపద్యాల గతికూడా ఒకేస్థితిలో ఉంది. కనుకనే ఈ సింగయ్యే ఆ పద్యం రచించి పోతన్న అవతారికలో చేర్చి ఉంటాడేమో అనే సందేహం కలుగుతుంది. అలాకాదు. పోతన్న పద్యానికే సింగన్న పద్యం అనుకరణమేమో అని ఎవరైనా వాదించవచ్చు. . పద్యశిల్పంలో గానీ, పదప్రయోగంలో గానీ, భావశుద్ధిలోగానీ ఈ పద్యంలో పోతన్నముద్ర ఏమాత్రం లేకపోవడమే. ఇంకా 'హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి' అంటూ ప్రాసస్థానంలో గుప్పించిన అనుప్రాస సౌరభం ఇందుకు సాక్ష్యం.

                 సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ 


             🙏భక్త కవి -- బమ్మెర పోతన🙏 

                       మూడవ భాగం 

అవతారిక దృష్ట్యానే కాక భాగవత కథల్లో ఉపాఖ్యానాల్లో పోతన్న మూలాతిరిక్తంగా పెంచిన పట్టులను బట్టీ, పేర్చిన పద్యాలను బట్టీ, అతని సత్త్వరమణీయమూర్తి సాక్షాత్కరిస్తుంది. గజేంద్రుని సంశయంలో, ప్రహ్లాదుని నిశ్చయంలో, గోపికల ఉద్వేగంలో, వామనుని ఉత్తేజంలో - ఇవేకాక నవవిధ భక్తిలతల బహుముఖ వికాసంలో, భక్తిరసతరంగితమైన పోతన్న చిత్తవృత్తి పలువిధాలా ప్రస్ఫుట మవుతుంది. వ్యాసభగవానుని భాగవత కోశాన్ని సైతం క్షణకాలం మరచిపోయి, ఆయా భాగవతుల శ్రవణకీర్తనలకు లోనై ఆ పాత్రలన్నీ తానై పరవశించి, పద్య సంఖ్యను పెంచి, ప్రతిభా శిఖరాలపై భాసించిన సన్నివేశాలు ఆంధ్ర భాగవతంలో కోకొల్లలు. - అవతారికలోనేకాక ఆంధ్ర భాగవతంలో గూడా అడుగడుగున పోతన్న సాత్త్విక చిత్తవృత్తి, భక్తిభావనా ప్రవృత్తి వేయిరేకులతో విప్పారినవని.


నవవిధ భక్తులను కథాత్మకంగా ప్రపంచించిన ప్రథమ గ్రంథం వ్యాసభాగవతం. ఆ భక్తిరస ఘట్టాలను ఇంతకు రెండింతలుగా విస్తరించి తొలిసారిగా మధుర భక్తికి పచ్చల తురాయిని కూర్చిన తెలుగు కావ్యం పోతన్న భాగవతం. ప్రహ్లాదుని నోట వ్యాసుఁడు పలికించిన భక్తిశాఖ లివి -


"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌"

దీనికి పోతన్న చేసిన తెలుగు సేత ఇది -


"తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా

ర్చనముల్‌ సేవయు నాత్మలో నెఱుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం

బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స

జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!"

ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, కుచేలుడు, ధ్రువుడు, అక్రూరుడు, రుక్మిణి, గోపికలు - ఆయా భక్తిశాఖల విరబూసిన ప్రసూనాలు. ప్రహ్లాదుడూ, రుక్మిణీ, గోపికల వంటి పాత్రలలో పోతన్న పరమ భాగవత సత్త్వం, అరీణ భక్తితత్త్వం శబలసుందరంగా భాసిస్తాయి. ఇది చెప్పాలని ప్రహ్లాదుని ముఖతః ఎన్నెన్ని భంగులలో ఎన్నెన్ని ఫణుతులలో చెప్పించినాడు పోతన్న!


    "మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు"

అంటాడు. మరోసారి -

   "కంజాక్షునకు గాని కాయంబు కాయమే"

అంటాడు. ఇంకోసారి -

    "కమలాక్షు నర్చించు కరములు కరములు"


అంటూ లాటానుప్రాసల్లో ఉద్ఘాటిస్తాడు. ఆ 'అంబుజోదర దివ్యపాదారవిందాలు', ఆ 'చింతనామృతం', ఆ 'మత్తచిత్తం' ఎన్ని సార్లంటాడు! ఎన్ని తీర్లంటాడు! విసుగులే దా భక్తవరుని నోటికి. అది పునరుక్తిదోష మని అనిపించనే అనిపించదు పరవశించిన ఆలేఖినికి. ఇంతకూ పోతన్న రచించిన భక్తి పద్యాల్లో కోటికెక్కిన 'మందార మకరంద' పద్యం అటు వ్యాసునిదీ కాదు, ఇటు పోతన్నదీ కాదు. పాలకురికి సోమన్నది. సోమన్న పోతన్నకు పూర్వీకుడు. బమ్మెరకు సమీపంలో ఉన్న పాలకురికి వాస్తవ్యుడు. అతని చతుర్వేదసారంలోనూ, బసవ పురాణంలోనూ ఈ పద్యం పోలికలే ఉన్నాయి -


    'రాకామలజ్యోత్స్న ద్రావు చకోర - మాకాంక్ష సేయునే చీకటి ద్రావ' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

    'పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం - బరుగునే సాంద్ర నీహారములకు'

అని పోతన్న అంటాడు.

    'విరిదమ్మి వాసన విహరించు తేటి - పరిగొని నుడియునే ప్రబ్బలి విరుల' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

    'మందార మకరంద మాధుర్యమునఁ దేలు - మధుపంబు వోవునే మదనములకు'


అని పోతన్న అంటాడు. అయితే సోమన్నకు రాని కీర్తి ఈ పద్యంవల్ల పోతన్న కెందుకు వచ్చింది? అక్కడే ఉంది పోతన్న పోత. 'మందార' 'మకరంద' 'మాధుర్య' 'మధుప' 'మదనములు' - ఎన్నిమకారాల ప్రాకారాలు కట్టినాడు! పద్యాన్ని ఎంత ప్రాసాదరమ్యంగా నిలబెట్టినాడు! అక్షర రమ్యతలో నన్నయ్యను దాటి, ఆపై అంచులు ముట్టినాడు. తరువాతివాళ్ళెవరైనా ఈ శైలిని అనుకరిస్తే జారిపడిపోవడమో, నీరుగారిపోవడమో జరిగే అంత సొంతపుంత చేపట్టినాడు. మరి 'కమలాక్షు నర్చించు కరములు కరములు' కూడా పోతన్న కొత్తగా చెప్పింది కాదు. భీమఖండంలో


శ్రీభీమనాయక శివనామధేయంబుఁ జింతింపనేర్చిన జిహ్వజిహ్వ

దక్షవాటీపురాధ్యక్ష మోహనమూర్తిఁ జూడంగనేర్చిన చూపుచూపు

దక్షిణాంబుధితట స్థాయిపావనకీర్తి చే నింపనేర్చిన చెవులుచెవులు

తారకబ్రహ్మవిద్యాదాతయౌదల విరులు పూన్పఁగ నేర్చు కరముకరము

ధవళకరశేఖరునకుఁ బ్రదక్షిణంబు నర్థిఁ దిరుగంగ నేర్చిన యడుగు లడుగు

లంబికానాయకధ్యాన హర్షజలధి మధ్యమునఁ దేలియాడెడు మనసు మనసు

అని శ్రీనాథు డెన్నడో అన్నదే. కాని లోకానికి తెలిసింది '

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;

సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;

విష్ణునాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;

భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;


తే. దేవదేవుని చింతించు దినము దినము;

చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;

కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;

తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి


లోకాన్ని ఆకర్షించినది మాత్రం 

కమలాక్షు నర్చించు కరములు కరము'లే. ఈ ప్రాచుర్యానికి కారణం కూడా పోతన్న కూర్చిన పదబంధ తోరణమే.

నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది సఖ్య భక్తి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: