కేళి
ఎన్ని పాలపుంతల ఆశీర్వాదాలమో?
ఎన్ని కాంతిపుంజాల సంతకాలమో?
ఎన్ని విస్ఫులింగ చూర్ణ శకలాలమో?
ఎన్ని ప్రణవగర్జల పూర్ణ కలశాలమో?
నీపై, నాపై, ఆరని నక్షత్రధూళి,
నువ్వూ, నేనూ, ఆగని అంతరిక్షకేళి..
ఎన్ని ప్రకృతులను ఏకం చేశామో?
ఎన్ని ఆకృతులను మాయం చేశామో?
ఎన్ని లోకాల బిందురూపాలమో?
ఎన్ని కాలాల ఇంద్రజాలాలమో?
నీలో, నాలో, అనంత విశ్వకాహళి,
నువ్వూ, నేనూ, అనాది జీవగేహళి..
ఎన్ని వర్ణాలను ప్రతిబింబించామో? ,
ఎన్ని శబ్దాలను ప్రతిధ్వనించామో?
ఎన్ని యుగాలుగా పరిభ్రమించామో?
ఎన్ని అనుభవాలను పరిగ్రహించామో?
నీదీ, నాదీ, నిర్నిద్రహేలా వైకుంఠపాళి,
నువ్వూ, నేనూ, నిత్యచైతన్య దీపావళి..
🙏🕉️🙏
- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్
(రెండు వత్సరాల క్రితం వ్రాసుకొన్నది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి