*ఆ మట్టి వాసన పిలుస్తోంది...*
అమ్మలాంటి పల్లె ఆప్యాయంగా పిలుస్తోంది
అలసిన హృదయాన్ని హత్తుకునేందుకు
మసి పట్టిన శరీరాన్ని కడిగేందుకు
మురికి పట్టిన మనసును శుద్ధి చేసేందుకు..
ఆ నేల పైరగాలి పలకరిస్తోంది
చిన్ననాటి చిట్టి అడుగులను గుర్తు చేసుకుంటూ
ఊరు వదిలిన యువకుడిని తలుచుకుంటూ
ఒక్కసారి హత్తుకొని సేదతీర్చాలని చూస్తోంది..
పండగొస్తోంది.. పల్లెకు నవ్వులు వచ్చాయి
ఆత్మీయ రెక్కలు విప్పి అందరినీ పలకరిస్తూ
గతపు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ
తనపై వేసే అడుగులకు మడుగులొత్తుతోంది..
మనిషి ఖరీదైనవాడిగా మారిపోయాడు
తానిచ్చిన ఆత్మస్థైర్యాన్ని ఆసరాగా చేసుకొని
పట్నపు రంగులద్దమై నిలిచాడు
అందులో నా నీడ కనిపిస్తుందో లేదో..
నా బావి నీరు రంగు మారిపోయింది
వాడి బ్రతుకు విషపు కోరల్లో చిక్కుకుంది
ఆడంబరం చూపడానికే నా దగ్గరకు వచ్చాడా?
తన దర్జాను ప్రదర్శిస్తూ నా ఒడిలో వాలాడు..
సరేలే.. ఎంతైనా అమ్మలాంటి దాన్ని కదా
కన్నీళ్లు దిగమింగి ఆప్యాయతను పంచుతా
నా మట్టి పరిమళాన్ని ప్రసాదంగా పెడతా
నా వృద్ధికి సహకరిస్తే.. వాడికి దండం పెడతా!
కొప్పు ల ప్రసాద్
నంద్యాల
9885066235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి