11, జనవరి 2026, ఆదివారం

మనలోనే ఉన్నాడు!*

 *మనలోనే ఉన్నాడు!*


పంచభూతాత్మకమైన ఈ సృష్టి చిత్రాతిచిత్రమైంది. సృష్టికర్త పరమాత్మ. ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వినే ఓపికా, తీరికా ఉండవు. నాభిలో కస్తూరిని ఉంచుకుని, దానికోసం గడ్డిలో వెతికే లేడిలా ఎక్కడెక్కడో స్వామికోసం అన్వేషిస్తూంటాం. ఆయన మనలోనే ఉన్నాడు. 'బుద్ధి' అనే శక్తి ద్వారా హెచ్చరిస్తుంటాడు. అంతరాత్మ ప్రభోదం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గ్రహించి అప్ర మత్తులం కాకపోవడం మన అవివేకం, అజ్ఞానం. లోచూపు ఉంటేనే ఆయన కనపడ తాడు. తన ఇష్టులతోనే మాట్లాడతాడు. ఇష్టులంటే ఎవరు? ప్రతిఫలాపేక్ష వీడి, కర్మచేస్తూ ఫలితం ఆయనకే వదిలేసేవారు. వారినే భక్త శిఖామణులంటాం!


భగవంతుడి కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రెప్పవాల్చకుండా ఆయనలా చూస్తుంటే మనం దర్శనం కోసం వెళ్లి కళ్లు మూసుకుంటాం. ఇంకా అజ్ఞానపు చీకట్లు, ఇక్కట్ల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఒక గురువు శిష్యుడికి హితబోధ చేస్తున్నాడు దేవుడు కనిపి స్తాడు, వినిపిస్తాడు. అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా!' అని. శిష్యుడొకసారి అడవిలో వెళ్తుంటే ఓ ఏనుగు ఘీంకరిస్తూ అతనికెదురైంది. బెదిరిపోయి, భయంతో పరిగెత్తి ఆశ్రమానికి చేరాడు. గురువు దగ్గరికెళ్లి దేవుడంతటా ఉన్నాడన్నారు, ఆ ఏనుగులోనూ ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది గురువుగారూ'! అని అడిగాడు. గురువు బదులిస్తూ 'నువ్వు మూర్ఖంగా ఎదురెళ్తుంటే అది ఘీంకరించింది. అది నీకు హెచ్చరికే. పైగా ఏనుగుపైన ఉన్న మావటివాడు నిన్ను 'తప్పుకో' అని చెబుతూనే ఉన్నాడు. ఆయనా దేవుడే, కానీ నువ్వే వినిపించుకోలేదు. అదే అజ్ఞానం' అన్నారు.


హరిని అరిగా అహంకారంతో దూషించి, కన్న కొడుకు ప్రహ్లాదుణ్ని చిత్రహింసలు పెట్టిన హిరణ్యకశిపుడు- ఆ బాలుడితో శ్రీహరి చెప్పించిన పలుకుల విలువను అర్థం చేసుకోలేకపోయాడు. సృష్టిలో ప్రతి అణువు నుంచీ మనకు భగవత్సందేశం వినిపిస్తూనే ఉంటుంది. నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి చెందమంటాయి పశుపక్ష్యాదులు. తనలాగా పరోపకారవ్రతం ఆచరించమంటుంది వృక్షం. నిశ్చలంగా ఉండమంటుంది పర్వతం. నిర్మలంగా జీవన ప్రవాహం కొనసాగనీ అంటుంది నది. తన దగ్గరికొచ్చి నామస్మరణంతో మనశ్శాంతి పొందమంటుంది దేవస్థానం. నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమంటుంది ధ్యానం. 'నేను నీవాణ్నే' అంటాడు సాటి మనిషి. తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు ఏదో సందర్భంలో మనకు దారి చూపుతుంటారు, సలహాలిస్తారు. సూచనలిస్తారు. వీళ్లంతా దేవుళ్లు కారా? ప్రత్యక్షమై ఎదుట అలంకారమూర్తిగా నిలుచుంటేనే నమ్మాలా? అందుకు కావాల్సిన యోగ్యత, తపన, భక్తిప్రపత్తులు, ఆత్మసమర్పణ భావం, ఆర్తి, శరణాగతి అనే లక్షణాలు మనలో ఉండాలి కదా! అటువంటి పరిణతి సాధించినవారితో పూర్వ యుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు. ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ పొందిన వారి సన్నిధిలో ఆ సకలగుణనిధి సందర్శనమవుతుంది. సంపూర్ణ విశ్వాసంతో సంస్మరణ చేసే సాధుగుణ సంపన్నులకి సర్వేశ్వర సాక్షాత్కారం సర్వదా సంప్రాప్త మవుతుంది. ఇది సర్వకాలీన సత్యం.

కామెంట్‌లు లేవు: