పాశ్చాత్యులు ఇంకా బట్ట కట్టడం నేర్వక ముందే మన భారతీయులు తత్త్వవిచారణలో మునిగి వుండేవారు. వారికి బాహ్య వేషధారణ కంటే అంత:శౌచం గురించి ఎంతో లోతుగా విచారణ చేసేవారు. మనకన్నా మన పూర్వులు ఎంతో గొప్పవారు, తాత్త్వికులు, దార్శనికులు.
క్రైస్తవంలోకానీ, ముస్లింమతం లో కానీ మరే ఇతర మతాలలోను ఇంత లోతైన విచారణ కనబడదు. వారి పరిధి కేవలం స్వర్గంతో ఆగిపోతుంది. మనకు స్వర్గానికి ఆవల వున్న లోకాలు దాటి కైవల్యం, మోక్షం గురించి తెలుసుకున్నారు. మనకు వేదాంతంలో మూడు రకాల పద్ధతులు వున్నాయి.
💐 *1.అద్వైతం:*
మహావాక్యాలు వాటికి మూలాధారాలు. అంటే "మనలోనే భగవంతుడు వున్నాడు. అసలు మనమే భగవంతుల౦" అన్నది ఈ దర్శనం. దీనిని విస్తృతంగా ప్రచారం చేసి బౌద్ధాన్ని మన దేశంలో అంతమొందించినది సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా శ్రీ ఆదిశంకరులు జగద్గురువులు. వారు సుమారు 800 AD లో వున్నారని చరిత్రకారులు అంటారు. జోషి మఠ్ వారు 400 BC గా చెబుతారు. అప్పటి ప్రజలు, పండితులు వీటిని అవగాహన చేసుకుని అనుష్టించగలిగే బుద్ధి కుశలత కలవారు.
క్రమేణా మన బుద్ధి వికాసం కుచించుకుపోయినది. అవి చాలా అర్ధం కాని తత్వాలగా కేవలం పండితులకు మాత్రమె అర్ధమయ్యే తత్త్వాలుగా చెలామణి అయ్యాయి.
*2. విశిష్టాద్వైతము:*
వేదాంత చింతన అర్ధం కాని వారి కోసం ఆదిశేషుని అవతారంగా శ్రీ భగవద్రామానుజులు అవతరించి సుమారు 1135 AD లో మరల వేదమతాన్ని పునరుద్ధరించారు. అప్పటికి జైనం బాగా వేళ్ళూనుకున్నది. ఆయన ప్రస్తావించినది పూర్తి అద్వైతం కాదు, పూర్తి ద్వైతం కాదు. "మనం దేవునిలోని భాగం" అన్నది వారి బోధ. మనలోని దేవుని తెలుసుకోవడం కోసం పరిపూర్ణ శరణాగతి చేసి తద్వారా మనం భగవంతుని చేరుకోవడం అన్నది వీరి పద్ధతి. అప్పటికి చాలా బాగా అర్ధమయ్యి ఎందరో మరల వేదమతాన్ని అవలంబించారు. ఎందరినో వాదనలలో ఓడించి మన హైందవాన్ని పునరుద్ధరించారు. కానీ క్రమేణా ఈ భాష్యంలో రెండు వాదనలు బయలుదేరాయి. వడగలై, తేన్గలై అని. ఒకటి మనం కోతిపిల్లల్లాగా తల్లి కోతిని పట్టుకున్నట్టు మనం దేవుని ఆశ్రయించాలని, మరొక వాదం మనం దేవుని నమ్ముకుంటే పిల్లి తన పిల్లలను పోషించినట్లు దేవుడే మానను కాచుకుంటాడని. ఇలా ఎవరి మతం వారితో మరల ప్రజలలో అపోహలు సృష్టించబడ్డాయి.
🌹 *౩. ద్వైతం :*
ఇక అసలు వాదనలెందుకు దేవుడు వేరు, మనం వేరు. మనం కేవలం ఆయనను ఆశ్రయించి ఆయనను సేవించాలని వాయుదేవుని అవతారంగాభావించే మధ్వాచార్యుల (1450 AD) ప్రతిపాదన. ఇక మరే అనుమానం పెట్టుకోకుండా కేవలం భగవంతుని కైంకర్యం చేస్తూ మోక్షం పొందాలని ఆయన ఉవాచ.
ఇక్కడ మనం చూసినట్లయితే కేవలం 500 సంవత్సరాల వ్యవధిలో మానవ మేధస్సు తరుగుతూ వస్తున్నది. వారు భౌతికమైన ప్రగతిని పొందుతూ ఆధ్యాత్మిక చింతన తగ్గించుకుని చాలా విషయాలు గ్రహించలేకపోయారు.
అప్పటినుండి 700 సంవత్సరాల తరువాత మనం ఎంతగా ఎదిగి పోయామంటే అసలు దేవుడే లేదు, నాస్తికమే పరమ మతము అన్న చార్వాక వాదన ఎక్కువైపోయింది.
తరచి చూస్తె ఈ మూడు పద్ధతులు ఒకభక్తుని ప్రస్థానాన్ని తెలియచేస్తాయి. ముందుగా దేవుని తననుండి వేరుగా (ద్వైతం) భావించి, క్రమేణా ఆయన లక్షణాలు మనలో వున్నాయని గ్రహించి (విశిష్టాద్వైతము) చివరికి దేవుడు మరెక్కడా లేడు కేవలం తనలోనే వున్నాడు, తానే దైవమని (అద్వైతం) గ్రహించే ఈ ప్రస్థానం మన ఆధ్యాత్మిక జీవితం. ఎందరో మహానుభావులు ఈ పద్ధతి చూపించారు మనకు. కంచి పరమాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, ఇలా ఎందరో మన భారతావని పద్ధతులను ఆచరించి చూపి దేశ విదేశాలలోనుండి కూడా ఎందరో వీరిని శరణుజొచ్చి ప్రశాంతత పొందారు.
మనదౌర్భాగ్యం ఏమిటంటే ఎక్కడో పాశ్చాత్యులు వచ్చి మీదగ్గర ఎంతో విజ్ఞాన గని వున్నది అని చెప్పేంత వరకు మనం నమ్మము.
ఆ భగవంతుడు మన వేదాల మీద, వేదవాక్కు మీద మనకు నమ్మకం కలిగించి ఉద్ధరించాలని ఆయన పాదాలను శరణాగతి వేడుకోవడం మన తక్షణకర్తవ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి