14, ఆగస్టు 2020, శుక్రవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదకొండవ అధ్యాయము*

*దేవాసుర సంగ్రామము సమాప్తమగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*11.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*హరీన్ దశశతాన్యాజౌ హర్యశ్వస్య బలః శరైః|*

*తావద్భిరర్దయామాస యుగపల్లఘుహస్తవాన్॥6638॥*

బలుడు మిగుల హస్త కౌశలముతో ఒకేసారి వేయిబాణములు ప్రయోగించి ఇంద్రుని యొక్క వేయి గుర్రములను గాయపరచెను.

*11.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*శతాభ్యాం మాతలిం పాకో రథం సావయవం పృథక్|*

*సకృత్సంధానమోక్షేణ తదద్భుతమభూద్రణే॥6639॥*

పాకాసురుడు ఒక వంద బాణములతో మాతలిని కొట్టెను. మరియొక వందబాణములతో అతని రథమును ముక్కలు ముక్కలు గావించెను. ఈ విధముగ ఒకేసారి ఇన్ని బాణములను ప్రయోగించుట యుద్ధమునందు ఆశ్చర్యకరము గదా!

*11.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*నముచిః పంచదశభిః స్వర్ణపుంఖైర్మహేషుభిః|*

*ఆహత్య వ్యనదత్సంఖ్యే సతోయ ఇవ తోయదః॥6640॥*

నముచియను రాక్షసుడు బంగారు పుంఖముల పదునైదు బాణములను ఇంద్రునిపై ప్రయోగించి, జలముతో గూడిన మేఘమువలె గర్జించెను.

*11.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*సర్వతః శరకూటేన శక్రం సరథసారథిమ్|*

*ఛాదయామాసురసురాః ప్రావృట్సూర్యమివాంబుదాః॥6641॥*

వర్హాకాలములో మేఘములు సూర్యుని కప్పివేసినట్లు అసురులు శరములను పరంపరగా వర్షించి, ఇంద్రుని, అతని సారథిని, రథమును అన్ని వైపుల నుండియు కప్పివేసిరి.

*11.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*అలక్షయంతస్తమతీవ విహ్వలా  విచుక్రుశుర్దేవగణాః సహానుగాః|*

*అనాయకాః శత్రుబలేన నిర్జితా  వణిక్పథా భిన్ననవో యథార్ణవే॥6642॥*

ఇంద్రుడు కనబడకపోవుటవలన దేవతలు, వారి అనుచరులు, మిగుల విహ్వలులై ఆక్రోశించిరి. శత్రువులు ఇదివరకే వారిని ఓడించి యుండిరి. ఇప్పుడు వారి నాయకుడు గూడా కనబడపోవుటచే వారు సముద్రమధ్యములో నావ పగిలిపోవుటచే దుఃస్థితికి లోనైన వ్యాపారులవలె ఆందోళనపడిరి.

*11.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*తతస్తురాషాడిషుబద్ధపంజరాద్వినిర్గతః సాశ్వరథధ్వజాగ్రణీః|*

*బభౌ దిశః ఖం పృథివీం చ రోచయన్ స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే॥6647॥*

కొంత తడవునకు ఇంద్రుడు తన గుర్రములతో, రథములతో, ధ్వజముతో, సారథితో గూడి,  అసురులయొక్క శరపంజరము నుండి బయటపడెను. అప్పుడు ప్రాతఃకాలమున సూర్యుడు తన కిరణములచే దిక్కులను, ఆకాశమును, పృథ్విని ప్రకాశింపజేసినట్లు, ఇంద్రుడు తన తేజస్సుచే రణభూమిని తేజరిల్లజేసెను.

*11.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*నిరీక్ష్య పృతనాం దేవః పరైరభ్యర్దితాం రణే|*

*ఉదయచ్ఛద్రిపుం హంతుం వజ్రం వజ్రధరో రుషా॥6644॥*

వజ్రధారియైన ఇంద్రుడు రణభూమియందు శత్రువులు తన సైనికులను బాధించుటను చూచెను. అంతట అతడు క్రుద్ధుడై శత్రువులను పరిమార్చుటకు వజ్రాయుధమును చేబూనెను.

*11.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*స తేనైవాష్టధారేణ శిరసీ బలపాకయోః|*

*జ్ఞాతీనాం పశ్యతాం రాజన్ జహార జనయన్ భయమ్॥6645॥*

రాజా! వాడియైన అంచులు గల తన వజ్రాయుధముతో ఇంద్రుడు బలాసురుని, పాకాసురుని శిరస్సులను ఖండించెను. ఆ దృశ్యమును జూచిన వారి బంధువులు భయముతో వణకి పోయిరి.

*11.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*నముచిస్తద్వధం దృష్ట్వా శోకామర్షరుషాన్విత|*

*జిఘాంసురింద్రం నృపతే చకార పరమోద్యమమ్॥6646॥*

మహారాజా! తన సోదరులు (బలాసురుడు, పాకాసురుడు) వధింపబడుటను చూచిన నముచికి శోకము, అసహనము, కోపము కలిగెను. అంతట అతడు ఎంతయు క్రుద్ధుడై, ఇంద్రుని వధించుటకు ఉద్యుక్తుడయ్యెను.

*11.30 (ముప్పదియవ శ్లోకము)*

*అశ్మసారమయం శూలం ఘంటావద్ధేమభూషణమ్|*

*ప్రగృహ్యాభ్యద్రవత్క్రుద్ధో హతోఽసీతి వితర్జయన్|*

*ప్రాహిణోద్దేవరాజాయ నినదన్ మృగరాడివ॥6647॥*

'ఇంద్రా! ఇప్పుడు నీవు నీ ప్రాణమును రక్షించుకొన జాలవు!' అనుచు నముచి సింహమువలె గట్టిగా గర్జించుచు తన త్రిశూలమును ఇంద్రుని మీదికి విసరెను. అది ఇనుముతో నిర్మితమై , భూషణములతో అలంకరింఫబడి బంగారు గంటలను  కలిగియుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: