14, ఆగస్టు 2020, శుక్రవారం

పెళ్ళి సందడి.

పంకజం పదనిసలు 17


   అయ్యవార్లంగారు ఏం చేస్తున్నారూ ..అంటే ...చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు. అని సామెత. అలాగే ఉంది ప్రస్తుతం అందరి పరిస్థితి.

     కూరలు కడగటం, పళ్ళు కడగటం , పూలుకడగటం, పనిమనిషిరాక అంట్లు కడగటం, చేతులేమో పదే పదే కడగటం.

      ఈ కడగటాలతో  విసుగెత్తి ఇంట్లో పలకరించినవాళ్ళనికూడా విసుగుతో కడిగిపారెయ్యటం.

     ఈ విధం  గా కడుగుళ్ళతో కడగండ్లు పడుతూ జీవుతాన్ని కడవరకూ గడపాల్సొచ్చేలా ఉంది.

      మొదటగా  రెణ్ణెల్లు అన్నారు.  ఆనక ఆర్నెల్లన్నారు. ఇప్పడేమో సహజీవనమంటున్నారు.

     ఈ విధంగా చుట్టమైవచ్చి దయ్యమై పట్టుకున్న  కోవిడ్ ని కడతేర్చే ఉపాయాలు ఆలోచిస్తుంటే అదేమో,  మీవూరుకొచ్చా ...మీ వీధికొచ్చా ...మీ పక్కింటికొచ్చా ..అని భయపెడుతోంది.

    శానిటైజరంటే అపర సంజీవినిలా అనిపిస్తోంది. మాస్కుకీ ,మందిరానికీ గొడవలుపోయి మాస్కే మన జీవితమైపోయింది.

      ఈవిధంగా నానా రగడగానూ గడబిడగానూ తయారైపోయిన జీవితాన్ని నెట్టుకురాలేక కొట్టుకు ఛస్తుంటే ...

       తిప్పుకుంటూ వచ్చింది పంకజం , "ఏంటిసంగతులూ ..."అనుకుంటూ. "ఏముందీ ...నిన్నమిగిలిన దోసెపిండీ, మొన్నమిగిలిన ఇడ్లీపిండీ కలిపి ,రాత్రిమిగిలిన ఉప్మా ఉండలు ముంచి బోండాలేస్తున్నా "అన్నాను చిరాగ్గా.

     కాస్త అయోమయం గా మొహం పెట్టి " తింటానికేనా ???"అనడిగింది. "మరేం  చెయ్యమంటావు చెప్పూ ... ఇవ్వడానికి పనిమనిషిలేదు. కంటైన్మెంట్ జోనని మున్సిపాలిటీ చెత్తవాళ్ళు కూడా రోజుమార్చి రోజు వస్తున్నారు " అన్నాను.

     "అందుకని చెత్తలో వెయ్యాల్సినవన్నీ పొట్టలో వేస్తే ...ఇంకేమన్నాఉందా ..."అంది. "ఏంచెయ్యమంటావ్ చెప్పు ...కాలేకడుపుకు మండే గంజి అనీ ...బతకాలి గాబట్టి బతికేస్తున్నాం తినాలి గాబట్టి తినేస్తున్నాం ఏదోవొకటి"  అన్నాను విరక్తిగా ...

     "ఇంకలాభం లేదు ...పీకల్లోతు డిప్రెషన్లో పడిపోయావ్. దీన్లోనించి బైటికిరావాలంటే అర్జెంటుగా అద్భుతమేదో జరగాల్సిందే"  అంది పంకజం.

    "అద్భుతమా ...! అసలు అలాంటిది ఈ జీవితంలో జరుగుందంటావా ...కరోనా పోతుందన్నది ఎంతనిజమో అద్భుతాలేవో జరుగుతాయన్నది అంతనిజం ..."అన్నాను. దువ్వుకోటానికి కూడా తీరికా, ఆసక్తీ లేక మూడురోజులనుండీ ముడిపెట్టుకుని   తిరుగుతున్న జుట్టుని సవరించుకుంటూ.

    "కళ్యాణానికి రావే కాంతమ్మా అంటే ...కోవిడమ్మా కుదరదు"  అంటావేం. మంచిరోజులు రాకపోవా ...మనుషులంతా కలిసిపోరా ..."అని పంకజం ఏదో చెబుతుండగానే సెల్లు మోగింది.

    "చూసావా శుభం. గంటమోగింది ఏదో శుభవార్తేమో చూడు " అంది పంకజం.
   "అసలు సెల్లు తీయాలంటే గుండెలు ఝల్లు మంటున్నాయి ఏమి వార్త వినాల్సొస్తుందో అని ..."అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను.

    మా చెల్లి ...అంటే నాకు పినపిన్నికూతురు.  ఊళ్ళో ఉంటున్నా నాలుగు నెల్లుగా రాకపోకలు లేవు. శ్రావణ మాసం నోములకూ కూడా ఒకరికొకరం ఈసారి పిల్చుకోలేదు. మొన్న దాని కూతురి ఏంగేజుమెంటుకు కూడా పదిమందికే పర్మిషన్ అని , ఫంక్షన్ అయిపోయాక ఫొటోలు షేర్ చేసింది. ఇంకో నాల్రోజుల్లో పిల్లపెళ్ళి. అసలే బిజీ డాక్టర్ మా మరిదిగారు. ఈ కరోనా టైం లో ఎలా పెళ్ళి చేస్తాడో అనుకుంటుంటే , ఇప్పుడీ  ఫోనూ ..

    సందేహంగా ఫోన్ తీసాను.  అటుపక్కనుంచి "హాల్లో అక్కయ్య " అంది అది హుషారుగా ..."ఏంటే సంగతులూ కొంపదీసి పెళ్ళికి పిలుస్తున్నావాయేం ..."అన్నాను. అది నిజంగానే  "అవును అక్కయ్యా ..పెళ్ళికే పిలుస్తున్నా అమ్మాయి పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అంది !!!!"

     నేను బోలెడు ఆశ్చర్యంతో నోరుతెరిచి "హౌ ! ఎలా ! నన్ను రమ్మంటున్నావా ..యే ..."అని  వసంతకోకిలలో కమలహాసన్లా ...తెరపట్టనంత ఎమోషన్ గుమ్మరించేసా.

  "ఏంలేదు అక్కయ్యా  మా పెద్దాడబడుచు  ముంబాయ్ నుండి రావలసింది. వాళ్ళ అత్తగారికి కరోనా ...వీళ్ళు క్వారంటైన్ అందుకే రావటం లేదు. ఆప్లేస్ లో నువ్వు రావొచ్చుకదా అందుకే ఫోన్ చేసా "అంది.

    " ఒకే ...ఒకే రాత్రికి పెళ్ళికదా ...బావగారూ నేనూ స్నాతకానికి మధ్యాహ్నం నుండే అక్కడుంటాం నువ్వేం కంగారుపడకు "అని మామూలుగా మాట్లాడుతున్నా ...అది వెంటనే "సారీ అక్కయ్యా మధ్యాన్నం కుదరదు ఈయన హాస్పటలో డాక్టర్లలో    ముఖ్యమైన   ఒక పదిమందికి భోజనాలు. రాత్రికి వచ్చెయ్యి నువ్వు మాత్రమే ...బావగారు కూడావస్తే సంఖ్య పెరుగుతుంది. పెళ్ళివారొక ముప్ఫై మంది. మనవైపు ఇరవై మంది మాత్రమే రావాలి. మొత్తం యాభై మందికే పర్మిషన్  నీకు కుదరకపోతే చెప్పు ఇంకొకరిని పిలుస్తా " అని నిర్మొహమాటం గా చెప్పి ఫోన్ పెట్టేసింది.

     ఒక్కసారి పాలపొంగుమీద నీళ్ళు చిలకరించినట్లైంది. తనురాకుండా నేనొక్కదాన్నేనా ...ఎలా అనుకున్నాను. ఈయన మాత్రం "దాందేవుందోయ్ ...హ్యప్పీగా వెళ్ళిరా ..మండపం దాకా దించొస్తా. రిటన్ అయ్యేటప్పుడు ఫోన్ చెయ్యి మళ్ళీ వచ్చేస్తా " అని క్రిష్ణపరమాత్మలా అభయమిచ్చేశారు.

     ఇంకేం దాదాపు నాలుగైదు నెలలతరువాత వెళ్ళబోయే ఫంక్షన్ !అదేవిటో కంగారుగానూ ...విపరీతమైన ఉత్సాహంతోనూ కాళ్ళూ చేతులూ  ఆడలేదు.

     ఇన్నాళ్ళూ అద్దంలోకూడా చూసుకోవటానికి ఉత్సాహపడని మొహాన్ని ఆనాల్రోజులూ పదే పదే తోమి మెరుగుపెట్టాను. మావార్ని బ్రతిమాలి లాకర్లో నగలు తెప్పంచుకున్నాను.

      ఆరోజు పంకజం సెలక్షన్ తో బంతిపువ్వురంగుకి రాణీ కలర్ పట్టుచీర కట్టుకుని , నగలు సింగారించి చివరిగా మొన్నచేయించుకున్న గోల్డ్ మాస్కు కూడా ధరించి కారెక్కి పెళ్ళికి బయలుదేరాను.

      మావారు నన్ను మండపం వాకిట్లో దించి వెళ్ళిపోయారు. అందంగా తెరలు వేసినగది ముందున్న అమ్మాయి "వెల్కం " అని సానిటైజరు జల్లిన గులాబీ చేతికిచ్చి లోపలికి ఆహ్వానం పలికింది. లోపలికి వెళ్ళగానే సెంటుకలిపిన సానిటైజర్ జల్లుకురిసింది. తడిసిన   చీరెతో  బిత్తరపోయి బైటపడి పెళ్ళి మండపం  లోకి  వెళ్ళాను.

    అది పెళ్ళి మండపం లాగా లేదు నాసా అంతరిక్ష కేంద్రం లా ఉంది. పూల మండపం కనపడింది కనుక పెళ్ళి మండపమేనన్న నమ్మకం కుదిరింది. అందరూ పీ. పీ యీ కిట్లతో హడావుడిగా తిరుగుతున్నారు. కొందరేమో బహుశా మగపెళ్ళివారనుకుంటా అదేకిట్లతో శిలా విగ్రహాల్లా దూరదూరంగా వేసిన కుర్చీల్లో కూర్చున్నారు.

    ఇంతలో ఒక ఆకారం హడావుడిగా వచ్చి "రా అక్కయ్యా ...ఇదేనా రావటం"  అంది. నేను నోరుతెరిచేలోపు ఒక కవర్ నా చేతికిచ్చి , "త్వరగా వేసుకుని రా "అని హడావిడి పెట్టింది. గదిలోకి వెళ్ళి చూస్తే ...నాకూ ఒక కిట్ ఇచ్చారు వేసుకోవడానికి ...ఆలోచిస్తూ నిలబడితే మళ్ళీవొచ్చి "కానీ కానీ "అని తొందరపెట్టింది.

   నా పచ్చ పట్టుచీరా నగలూ ఒక్కసారి నన్నుచూచి నవ్వినట్లు అనిపించి బాధేసింది సరే !ఏంచేస్తాం  అనుకుంటూ వాటిని కప్పెట్టి కిట్టేసుకుని బయట కొచ్చాను. అప్పట్నించీ మొదలయ్యింది  అసలు గొడవ.

     ఎవరు  ఎవరో అసలు ఆడోమొగో అర్ధమై చావటం లేదు. కాస్త పొట్టిగా లావుగా ఒక ఆకారం కనబడితే మా చెల్లేమో అనుకుని "ఏవిటే ఫొటోల్లో చూసా పిల్లాడు మరీ నలుపూ ...ఇంతలో పిల్లకేం  వయసైందని కాస్త ఈడూ జోడూ చూడొద్దూ " అన్నాను.

    ఆ మనిషి ముసుగు కాస్త తొలగించి "నేను పిల్లవాడి తల్లిని ఇంతకూ మీరెవరు "అని గట్టిగా గద్దించింది. దెబ్బకు ముసుగు మూసేసి పక్కకు పారిపోయాను. "ఇదుగో మిమ్మల్నే " అని వెనకనుండి పిలుస్తున్నా వినిపించుకోకుండా.

    కాసేపటికి నాభుజం మ్మీద చేయిపడింది "ఏమేవ్ మీ అన్నయ్య కొడుకు పెళ్ళిలో  గోల చెయ్యాలి,  గొడవ పెట్టాలి అన్నావు గా ...ఎక్కణ్ణించి మొదలెడదాం. భోజనాలు బాగులేవనా ...మర్యాదలు చాల్లేదనా"  అంది ఒక మగ కంఠం ఠక్కున ముసుగుతీసి సీరియస్ గా చూసేసరికి " సారీ మా ఆవిడనుకునీ ...."ఖంగారుగా అంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయాడతను .

    అప్పటికి అర్ధమైంది నాకు అందరూ ఎందుకని అలా శిలావిగ్రహాల్లా కూచున్నారో ..నేనూ ఒక కుర్చీ చూసుకుని మెదలకుండా కూర్చున్నాను. పంకజం నా పక్కనే సెటిలయ్యింది.

     ఒక ఆకారం నా పక్కనొచ్చి కూచొని "చూసావా వొదినా దీని గొప్ప ...పెళ్ళికొడుక్కీ ,తల్లికీ, చెల్లికీ విడిదింట్లో వెండి శానిటైజరు బాటిల్స్ పెట్టించిందట.డాక్టరు కదూ  కరోనా కాలంలో కావలసినంత సంపాయిచ్చాడ్లే ...వెండివేం ఖర్మ బంగారపవైనా పెడతాడు. ప్రైవేటు క్వారంటైను సెంటర్ పెట్టారట తెలుసానీకూ ..." ముసుగుతియ్యటానిక్కూడా భయపడి నోరు మూసుక్కూచున్నాను.

    పెళ్ళి పీటల మీద ఉన్నారు కనుక పెళ్ళి కూతురూ  పెళ్ళి కొడుకుని గుర్తుపట్టాను. వాళ్ళకి కొంచెం పక్కగా బ్రహ్మగారు కుర్చున్నారు. పండపమంతా సెంట్లూ శానిటైజర్లూ కలిసిన వింత వాసన.

     గణపతి పూజ కంటే  ముందు "అపవిత్ర పవిత్రోవా "అంటూ చేతిలో శానిటైజర్ వేసి పెళ్ళి తంతు  మొదలెట్టేడు బ్రహ్మగారు. డెట్టాల్ కలిపిన నీళ్ళతో కాళ్ళు కడిగాడు మా మరిదిగారు అసలే డాక్టరు కదా ఇంకొంచెం జాగ్రత్త తీసుకొంటున్నాడు.

     మద్య మధ్యలో చేతిలో సానిటైజరు చల్లి తాగటానికి వేన్నిళ్ళూ, కాసిని డ్రై ఫ్రూట్స్  ఉన్న పాకెట్లూ అందిచ్చారు. తాగాలనుకున్నవారికి కాఫీ టీలతో పాటు పసుపువెసిన పాలు కూడా అందించారు.

     ఆవిధంగా  సానిటైజ్ చేసిన తాళిబొట్లూ , తలంబ్రాలతో పెళ్ళి తంతు ముగిసింది. పట్టు చీరెల గలగలలూ, అయినవాళ్ళ హాస్యోక్తులూ, సరదాల బంతిభోజనాలూ లేకుండా ఏదో చూసాం , తిన్నాం అంతే ...ఆ భోజనం తినడానికి కూడా భయమే ...

    ఈయనకు ఫోన్ చేసి మండపం బయటికి వచ్చాను. వెళ్ళొస్తానని కూడా చెల్లికి  చెప్పలేదు.కట్టుకున్న పట్టుచీర , పెట్టుకున్న నగలూ చిరాగ్గ అనిపిస్తున్నాయి.  మావారు కారాపి ఎదురుచూస్తున్నారు. ఈ గ్రహాంతరవాసి అవతారంలో గుర్తుపట్టలేదనుకుంటా

     కారుదగ్గరికి వెళ్ళి "ఏమండీ" అన్నా ...అనుమానం గా చూస్తుంటే ముసుగు తీసా. నవ్వేసి తలుపు తీసారు. పంకజం వెనక సీటులో సెటిలైంది.

    "పెళ్ళి బాగా జరిగిందా ..."అన్నారు  అలవాటుగా. "అది మాత్రం  అడక్కండి కరోనాలో పెళ్ళి కెళ్ళటం కంటే క్వారంటైను సెంటరు కెళ్ళటం మేలు " అన్నాను  విసుగ్గా. వెనక సీట్లో పంకజం మాత్రం నా స్థితిచూసి చెంగు అడ్డం పెట్టుకుని కిసుక్కుమని నవ్వుతూనే ఉంది.
పద్మజ కుందుర్తి.
*********************

కామెంట్‌లు లేవు: