శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్య.ము
అల్లు డారీతి బలుకగ యనునయమున
సుంత డెందంబు నందున చింత వీడి
వెళ్లి వెనువెంట యా యతిన్ వెదుకుటకును
కాంచి ఱొకచోట యాతని కన్నులార 131
అంత సాధువు సన్యాసి చెంతకేగి
పాదములు రెండు గట్టిగా పట్టుకొనియు
కనుల వెంబడి భాష్పముల్ గాఱుచుండ
యనియె నీరీతి యత్యంత యార్తి తోడ 132
"ధన మదాంధత వలనను దారి దప్పి
యపహసించితి యవివేకి నయ్యు నేను
నాదు తప్పులు క్షమియించి నన్ను గాచ
శరణు వేడెద మహితాత్మ! శరణు శరణు" 133
సదమల భక్తితొ వణిజుడు
పదముల పై వ్రాలి యట్లు ప్రార్ధన సేయన్
మది మెచ్చియు పరమాత్ముడు
గదుముచు మఱి యిట్టు లనియె గాంభీర్యమునన్
134
"వ్రతమును జేసెద ననియును
ప్రతి సారిటు మాట దప్పి ప్రల్లద వృత్తిన్
యతి లోభతనము జూపియు
వెతలందున పడితివీవు విపరీతమునన్ 135
దేవుని కపచారంబున
యీ విధముగ జరిగె నీకు యెఱుగుము శ్రేష్టీ!
నీ విక బుద్ధిని గలిగియు
భావించుము వ్రతముసేయ పావనమదితో" 136
అట్లు పరమాత్మ సాధువు కాన తీయ
ప్రణతు లర్పించి యాతని పదము లంటి
తప్పు లెన్నక రక్షించ తరచి వేడి
ప్రార్థనము జేసె నీరీతి భక్తితోడ 137
"చిద్విలాసా! ప్రభో ! శ్రీ సత్య దేవ !
నీ లీల నెన్నంగ నేనెంత వాడ
జగతి నీ మాయతో జనియించు చుండు
నిక్క మశక్యంబు నీ మాయ దాట
బ్రహ్మాది దేవతల్ భవుడు సైతంబు
యెఱుగరు నీ తత్త్వ మెంత సుంతైన
సహజ మూధుండనౌ సర్వేశ ! నేను
భవదీయ మాయలో బంధితు నైతి
అపరాధములు పెక్కు నాచరించితిని
మఱువను నీపూజ మాధవా ! యింక
దయయుంచి నా పూర్వ ధనమును యిచ్చి
కరుణించి రక్షించు కరుణాంతరంగ
పాహిమామ్ పాహిమామ్ పరమాత్మ !యీశ !" 138
వణిజు డారీతి ప్రార్థించ , వరదుడైన
సత్యనారాయణస్వామి సంతసించి
కామితార్థంబు దీర్చియు కరుణతోడ
యంత యంతర్హితుండయ్యె నచటినుండి 139
సశేషము …..
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి