🙏శివానందలహారీ🙏
ఉదర పోషణక్రియే యుదయాస్త మానంబు
మదియందు దలచుచు మానకుండ
తిరిగితి నిరతంబు సిరిమంతు లింటికి
యర్థంబు కొఱకునై వ్యర్థ ముగను
మాయాంధ కారాన మగ్నుండ నగునేను
భవసేవ నెఱుగక బ్రతికి యుంటి
పూర్వ జన్మాంతర పుణ్యంబు కతనను
నీవు నా డెందాన నిల్చి నావు
అట్టి హేతువు చేనైన యభవ ! నన్ను
తప్పకను నీవె రక్షించ దగును స్వామి !
కరుణ జూపుచు నాపైన గరళ కంఠ !
నీదు సాన్నిధ్య మోసగుచు నిలువ నిమ్ము. 57#
క్షితి నభో వ్యాప్తమై. చీకట్ల నెల్లను
పారద్రోలుచు నుండు భాస్కరుండు
యగుపించు చున్నాడు యంబరంబందున
ప్రత్యక్ష మూర్తి యై పలువురికిని
కోటి సూర్య ప్రభల్ గూడిన నీవేల
సాక్షాత్క రించవు శర్వ ! నాకు ?
అరయ నాలో నున్న యజ్ఞాన తిమిరమున్
తొలగించ జాలవే ? తలచితేని
పార్వతీ నాథ ! సర్వేశ ! భవ విదూర !
నాదు యజ్ఞాన మంతయు నాశ పరచి
దివ్య దర్శన మిచ్చియు భవ్య పురుష !
నిండు యభయంబు నిడి ప్రసన్నుండ వగుము. 58 .
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి