మన మహర్షులు- 28
🌷మంకణ మహర్షి 🌷
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
పూర్వం మాతరిశ్వుడనే గొప్ప తపశ్శాలుండేవాడు. ఆయన భార్య సుకన్య. వాళ్ళ సంతానమే మన మంకణ మహర్షి.
మంకణ మహర్షి ఆశ్రమం ఉత్తములైన బ్రాహ్మణులతోనూ చక్కటి పూల, పండ్ల చెట్లతోనూ, సాధు జంతువులతోనూ, మునుల వేదఘోషతోనూ నిండి ఉండేది. ఈ ఆశ్రమాన్ని 'సారస్వత తీర్థం' అంటారు
ఒకసారి మంకణ మహర్షి బ్రహ్మర్షులందర్నీ పిలిచి సత్రయాగం ప్రారంభించాడు అందరూ వచ్చారు, ఏర్పాట్లన్నీ జరిగాయి. కానీ సరస్వతీనది అక్కడ ప్రవహించట్లేదని అనుకుంటూండగా బ్రహ్మ సరస్వతిని తల్చుకుని అక్కడ ప్రవహించేలా చేసి వాళ్ళ యాగం చక్కగా జరిగేలా చేశాడు. అక్కడ సరస్వతీ నదికి 'సుప్రభ' అని పేరు.
సరస్వతీనదికి నైమిశారణ్యంలో 'కనకాక్షి' అని, గయలో 'విశాల' అని, ఉద్దాలకుడు యాగం చేసిన చోట 'మనోరమ' అని, కురుక్షేత్రంలో కరువు వచ్చినపుడు 'సురేణువు' లేక 'సురతన్వ' అని వసిష్ట మహర్షి యాగం చేసినపుడు 'ఓఘవతి' లేక 'ఓఘమాల' అని ఇంకొక చోట 'విమలోదక' లేదా 'సువేణి' అనే పేర్లతో ప్రవహించింది.
ఈ ఏడు నదులు కలిసిన చోటునే 'సారస్వతతీర్థం' అంటారు. అక్కడే మంకణ మహర్షి ఆశ్రమం ఉంది.
పరమశివభక్తుడు మంకణ మహర్షి 'ఆర్యావర్తము' అనే ప్రదేశము చేరి తపోనిష్టలో మునిగిపోయాడు.
పంచాక్షరీ (నమఃశివాయ) మంత్రజపంతో అతని శరీరం సూర్యసమాన తేజోవంతమైంది.
క్రమంగా భక్తి పారవశ్యంతో తాండవం చేయసాగాడు ఆ మహర్షి. అంతటి భక్తికి మెచ్చిన శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
కానీ మంకణుడు తాండవం ఆపడే... శివుడు అతని తాండవం ఆపడానికి ప్రయత్నించి ప్రశ్నించాడు "ఎవరికోసం నీ తపస్సు, నీ కోరిక ఏమిటి?". దేనికీ జవాబు చెప్పడాయే ఆ మహర్షి.
తాండవం ఆపడు.
దానితో శివుడు ఉగ్రుడై- "వెయ్యి శిరస్సులు, వెయ్యి చేతులు, వెయ్యి కాళ్ళుతో కూడిన విరాడ్రూపంతో మహాతేజోమూర్తిగా" మహాతాండవం ప్రారంభించాడు.
ఆయనతోపాటు ఒక స్త్రీమూర్తి కూడా ఉంది.
ఆ మహాతాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోయింది. దానితో అతనికి జ్ఞానోదయమయింది. శరణంటూ సాష్టాంగ నమస్కారం చేసాడు శివుడికి.
అప్పుడు శివుడు శాంతించి విశ్వరూపం ఉపసంహరించాడు. ప్రక్కనున్న దేవీ కూడా అంతర్ధానమైంది.
మహర్షి శివుడికి నమస్కరించి "దేవాదిదేవా! ఈ మహాతాండవం ఏమిటి? ఆ స్త్రీమూర్తి ఎవరు?" అంటూ ప్రశ్నించాడు.
అప్పుడు శివుడు "ఇది పరమేశ్వరుని దివ్యరూపం. ఆ దివ్యమూర్తిని నేనే. నాతో ఉన్న దేవి ప్రకృతి రూపిణి. బ్రహ్మరూపుడినై నేను సకల ప్రాణులను 25 (పంచవింశతి) తత్వాలతో పుట్టిస్తాను. విష్ణురూపుడినై వాటిని పోషిస్తాను. సంహారకాలంలో నేనే కాలస్వరూపుడినై వాటిని లయం చేస్తాను. సర్వప్రాణులయందు నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈ విషయం గ్రహించి, భక్తితో నన్ను ఉపాశించి, శివసాయుజ్యం పొందు" అని చెప్పాడు శివుడు.
(శ్రీ శివ పురాణంలోని సతీఖండము నుండి...)
మహాభారతం లోని శల్యపర్వం లోను, శివపురాణము లోను..ఇంకా అనేక సందర్భాలలోను మంకణ మహర్షి ప్రస్తావన వస్తుంది..
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి