20, ఫిబ్రవరి 2021, శనివారం

మొగలిచెర్ల

 *సేవామార్గం..*


"నిన్న మధ్యాహ్నం ఇక్కడికి వచ్చానండీ..నిన్నటి సాయంత్రం జరిగిన పల్లకీసేవ లో కూడా పాల్గొన్నాను..ఈరోజు ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నాను..మరో మూడు రోజులు ఇక్కడే వుందామని అనుకుంటున్నాను..ఈ మంటపం లోనే బస చేస్తాను.." అని ఆ యువకుడు ఒక ఆదివారం మధ్యాహ్నం హారతి అయిపోయిన తరువాత నన్ను అడిగాడు.."మీ వివరాలు మా సిబ్బంది వద్ద ఇవ్వండి..ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుంది.."అన్నాను.."నాపేరు కోదండరామ మూర్తి..షాద్ నగర్ వద్ద..తెలంగాణ.." అన్నాడు.."ఆ వివరాలన్నీ మా వాళ్ళ వద్ద నమోదు చేయించండి.." అన్నాను..సరే అని చెప్పి వెళ్ళిపోయాడు..


ఆరోజు సాయంత్రం స్వామివారి హారతి ఇచ్చే వేళకు మందిరం లోకి వచ్చి స్వామివారి హారతి కళ్లకద్దుకొని..వెళ్ళిపోయాడు..అతని గురించి నేను గానీ..మా సిబ్బంది గానీ పెద్దగా శ్రద్ధ చూపలేదు..ఏదో తాను స్వామివారి సన్నిధి లో ఓ మూడురోజులు ఉండటానికి వచ్చాడు..ఆ తరువాత వెళ్ళిపోతాడు అనే భావన లో వున్నాడు..సోమవారం ఉదయం అర్చకస్వాములు వచ్చి శ్రీ స్వామివారి మందిర తలుపులు తెరచి ప్రభాతసేవ కొఱకు ఏర్పాట్లు చేసుకునే సమయానికి కోదండరామమూర్తి తాను కూడా స్నానం చేసి ఆలయం లోకి వచ్చాడు..పూలు కోసుకొచ్చి పళ్లెం లో పెట్టి అందించాడు..తులసి ఆకులు తీసుకొచ్చి అర్చకస్వాములకు ఇచ్చాడు.."స్వామీ..మీకేదైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి..స్వామివారి సేవ చేసుకోవాలని అనుకుంటున్నాను..నాకూ అవకాశం ఇవ్వండి.." అని అర్చకులతో చెప్పాడు..ప్రభాతసేవ పూర్తయ్యేదాకా మంటపం లో వుండి..పూజారి గారు స్వామివారికి ఇచ్చిన హారతి కళ్లకద్దుకొని..వరుసక్రమం లో వచ్చి తీర్ధం తీసుకొని..మంటపం లోకి తిరిగివెళ్లి కూర్చున్నాడు..ఉదయం తొమ్మిది గంటలకు నావద్దకు వచ్చి.."స్వామివారి మందిరం లో ఈ మూడురోజులూ ఏదో ఒక సేవ చేయాలని అనుకుంటున్నాను..మందిరం శుభ్రం చేయమన్నా చేస్తాను..మీ వ్యవస్థ లో వేలు పెట్టాలనే ఉద్దేశ్యం కాదు..నా వంతుగా సేవ చేసుకోవాలని ఒక కోరిక..మీరు ఏ పని చెప్పినా చేస్తాను.." అన్నాడు.."మీరే అన్నారు కదా మందిరం శుభ్రం చేయగలను అని..అదే చేయండి.." అన్నాను..సరే అన్నాడు..ఆ మూడురోజులూ ఉదయం సాయంత్రం స్వామివారి మందిర ప్రాంగణం అంతా శుభ్రం గా ఊడ్చాడు.మూడుపూటలా స్వామివారి హారతి కళ్లకద్దుకొన్నాడు..తీర్ధం తీసుకున్నాడు..మంటపం లోనే నిద్ర చేసాడు..గురువారం ఉదయం ప్రభాతసేవ హారతి తీసుకొని..తన ఊరికి వెళ్ళిపోయాడు..


ఐదు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం మధ్యాహ్నం కోదండరామమూర్తి స్వామివారి మందిరానికి వచ్చాడు..ఈసారి ఒంటరిగా రాలేదు..తన భార్యను తీసుకొని వచ్చాడు..పల్లకీసేవ కొఱకు తమ పేర్లు నమోదు చేయించుకొని..ఇద్దరూ మా దంపతుల వద్దకు వచ్చారు..అతనిని చూడగానే గుర్తుపట్టాను.."బాగున్నారా?.."అని అడిగాను..చప్పున నా రెండు చేతులూ పట్టుకొని..తన నుదుటి పై పెట్టుకొని..కళ్ళు మూసుకున్నాడు..ఒక్కసారిగా భావోద్వేగం తో కన్నీళ్లు పెట్టుకున్నాడు..అతని భార్య అతని భుజం మీద చేయి వేసి..ఓదార్పుగా తట్టింది..ఈ చర్య నాకు అర్ధం కాలేదు..అతను కొద్దిగా తేరుకొని..కళ్ళు తుడుచుకుని.."ప్రసాద్ గారూ..పోయినసారి నేనొక్కడినే ఇక్కడికి వచ్చి స్వామివారి వద్ద మొత్తం ఐదు రోజులు వున్నాను..శనివారం నుంచీ గురువారం ఉదయం వరకూ..స్వామివారి సేవ చేసుకుంటాను అని నేను అడిగితే..మీరు, మీ సిబ్బంది..మీ పూజారులు అందరూ నాకు సహకరించారు..అప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉన్నది..మాకు వివాహం జరిగి ఏడేళ్లు అవుతున్నది..సంతానం లేదు..మా ఇద్దరి జాతకాలు చూపిస్తే..సంతానయోగం ఉన్నది అని చెప్పారు కానీ..పిల్లలు పుట్టలేదు..నేను పనిమీద హైదరాబాద్ వెళ్ళాను..అక్కడ శ్రీనగర్ ఆలయం పూజారి గారు నా జాతకం చూసి..మొగలిచెర్ల వెళ్లి మూడురోజులు నిద్ర చేయి..ఆ అవధూత దత్తాత్రేయుడి కరుణిస్తే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు..ఈ మందిరం అడ్రెస్ కూడా వారే ఇచ్చారు..తిరిగి ఇంటికి వెళ్లి..ఈమెతో చెప్పి ఇక్కడికి వచ్చాను..ఇక్కడ మీ సహకారం మరువలేనిది..స్వామివారికి నాకు తోచిన సేవ నేను చేసుకున్నాను..పూర్తిగా ఈ స్వామివారినే నమ్మి..ఆయన మీదే భారం మోపి..నమస్కారం చేసుకొని వెళ్ళాను..ఇప్పుడు నా భార్య గర్భవతి..మూడో నెల..ఇప్పుడు మేమిద్దరమూ ఈ స్వామివారిని దర్శించుకొని ..మరలా మాకు సంతానం కలిగిన తరువాత..ఆ బిడ్డతో సహా వస్తాము..ఈమె ప్రయాణం చేయడం ఇబ్బందేమో అనుకున్నాను..కానీ తాను వస్తానని పట్టు పట్టింది..ఈరోజు రేపు వుండి..రేపు సాయంత్రం తిరిగి మావూరు వెళతాము..స్వామివారు పరిపూర్ణ దయ చూపారు మామీద.." అని అత్యంత సంతోషంగా చెప్పాడు..


కోదండరామమూర్తి సేవామార్గాన్ని ఎంచుకున్నాడు..అదికూడా పరిపూర్ణ భక్తి తో పూర్తి చేసాడు..ఎక్కడ భక్తి విశ్వాసాలు ఉంటాయో..అక్కడ భగవంతుడు తన కృపాకటాక్షణాలను ప్రసరింపచేస్తాడు..ఈ కోదండరాముడి విషయం లోనూ అదే జరిగింది..నమ్మి కొలిచినందుకు..మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయుడు ప్రతిఫలం ప్రసాదించాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: