18, మే 2021, మంగళవారం

*ఓ చేదు నిజం*

 *పథ్యపు మాటలు!*

 *ఓ చేదు నిజం*   

 *ఒక కథానిక* పూర్తిగా చదవండి  


“ పెద్దనాన్నగారూ! నాన్నను నిన్ననే అపోలోలో జాయిన్ చేసా! నాలుగురోజులుగా జ్వరం తగ్గలేదు! ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఛాన్స్ తీసుకోలేక, వెంటనే అపోలోకి తెచ్చా. రాపిడ్ టెస్ట్ పాజిటివ్! నిన్ననే Remdesivir మొదలుపెట్టారు! ఫ్రెండొకడు పెద్ద రికమెండేషన్ మీద రూమ్ ఇప్పించాడు!”.... పాఠం అప్పచెప్పినట్టు చెప్పేసాడు ఋుషి... కొంత ఆయనంటే భయం, కొంత తండ్రిగురించిన ఆందోళనా పాపం పిల్లాడిలో! 


   “ అవునా! ఎలా ఉన్నాడ్రా వాడు?”.... అని అడిగారు సత్యమూర్తిగారు. “ ఇదిగోండి ఇస్తా ! ఒకసారి మాట్లాడండి!”.... అంటూ తండ్రిచేతికి ఇచ్చాడు ఋుషి! “ అన్నయ్యా!”... అంటూ నీరసంగా పలకరించాడు సూర్యం!


“ జాగ్రత్తరోయ్! రోజులేం బాలే! మన కుటుంబంలోనే... ఇప్పటికి డజన్ కేసులు. నలుగురు పోనే పోయారు. మా చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో రోజుకో రెండుమూడు కేసులురా! ఈ సెకండ్ వేవ్ ఊడ్చిపెట్టేస్తోంది జనాలను! ఇంట్లో ఏ కషాయాలో తాగి ఉండకుండా... వెధవ ఆసుపత్రికి ఎందుకు పోయావ్. ఆస్పత్రికి వెళ్ళిన వాళ్ళు సగం మంది తిరిగే రావడం లేదట! పైగా మూడువేల మందు ముప్ఫైవేలకు అమ్ముతున్నారట. అయినా కుర్రవెధవ నీతో ఉండడమేంటి? మొన్న మా రాజారావ్ కొడుకు... తల్లీతండ్రికీ కోవిడ్ వచ్చిందని పరిగెట్టుకొస్తే, వాడికీ మహమ్మారి అంటుకుని... మొత్తం కుటుంబం బలయిపోయారు!”...... అన్నగారి భయభ్రాంతిజనిత వాక్కులకు అప్పటికే వణికిపోతున్నాడు సూర్యం! ... స్వాభావికంగా కుటుంబంలోనే పిరికివాడు, అర్భకుడు అతను. దానికి తోడు కోవిడ్! 


        భర్తచేతిలోంచి ఫోన్ లాక్కున్నట్టు తీసుకుంది సత్యవతమ్మ! 


“ నాయనా సూర్యం!! నేను పెద్దవదిన్ని!”... అందో లేదో భోరుమన్నాడు మరిది! 


“ వదినా! అంతా అయిపోయింది. పిల్లల్ని , సీతనీ దిక్కులేని వాళ్లను చేసి పోతున్నాను. వాళ్ళ పెళ్ళిళ్లు, పుణ్యకార్యాలూ నీదే బాధ్యత ఇకపై”... అంటూ ఏవేవో అనేస్తున్నాడు సూర్యం! 


“ నీ మొహం! ఏవీ అవ్వవు.రెండు రోజుల్లో లక్షణంగా ఇంటికొచ్చేస్తావు. పోనీ నన్ను రమ్మంటావా, అంత భయంగా ఉంటే! 

సూరీ నీకొకటి చెప్పనా, ఏడిద సుబ్బారాయుడి గారు రాసిన నీ జాతకప్రకారం నీకు తొంభై ఎనిమిదేళ్ళ ఆయుర్దాయం ఉంది. ఇప్పటి వరకూ ఆయన చెప్పింది సహస్రాంశమేనా తప్పలేదు. చిన్నప్పుడు మశూచికమే ఏమీ చెయ్యలేదు నిన్ను, ఈ కోవిడ్ ఎంతయ్యా! 

నువ్వు చేసుకునే...నిరంతర మహాసౌరజపం , ప్రాణాయామం ఉత్తినే పోవు. ఇట్టే తరిమేస్తాయి మహమ్మారిని. ధైర్యంగా ఉండు. నాకూ, సీతకూ మానససరోవరం చూపిస్తానన్నావు. మాట నిలబెట్టుకోవాలిగా! కనుక వెర్రి ఆలోచనలు మాని, హాయిగా వైద్యం చేయించుకుంటూ, బలంగా తింటూ,భగవధ్యానం చేసుకో. శుభ్రంగా నయమయిపోతావు. అన్నయ్య చేత ఓ లక్షరూపాయిలు నీ అకౌంట్లో వేయిస్తా. అందాకా వుంచు! అవసరమయితే అందరం నీతో ఉన్నాం! సరేనా నాన్నా!”..... వదినగారి సాంత్వన వచనాలతో సగం రోగం తగ్గనట్టయింది సూర్యానికి! 


   “ అన్నయ్య తెగ భయపెట్టేసాడనుకో వదినా!”... అన్నాడు నీరసంగా! 


“ విన్నానయ్యా! ఏం మనిషో ఏం లోకమో! అలాగేనా మాట్లాడేది? అంత తెలివే ఉంటే... కలెక్టర్ గా రిటయిర్ అయ్యేవారు కాదూ! డిప్టీగా మిగిలిపోయారు! ... అందామె కినుకగా! 


        పకపకా నవ్వాడు సూర్యం,ఆమె మాట్లాడిన తీరుకి ! తనేం తప్పు గా మాట్లాడేడో తెలియక ,అయోమయంగా చూస్తూ, మళ్ళీ టీవీలో కరోనా వార్తలకు అతుక్కుపోయారు సత్యమూర్తి! 

హెచ్చరిక  :-కరొనా పేషెంట్లా మనసులో   ధైర్యాన్ని నింపుదాం  


ధన్యవాదాలతో

ఓలేటి శశికళ

కామెంట్‌లు లేవు: