18, మే 2021, మంగళవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*గురుబోధ గురించిన వివరణ..అవధూత లక్షణం..*


*(ముప్పై ఒకటవ రోజు)*


శ్రీ స్వామివారు ధ్యానం లో కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్లిపోయేవారు..అలా ఎంతసేపు ఉండిపోతారన్నది ఎవరికీ తెలియదు..ఒక్కొక్కసారి సాయంత్రం దాకా..లేదా ఏ అర్ధరాత్రికో..ఇంకోసారి మరుసటిరోజు ఉదయానికో..ఇలా..ఒక నిర్దిష్ట సమయమన్నది లేకుండా వుండేవారు..ఎంతసేపు సమాధి స్థితిలో వున్నా కూడా..వారు బైటకు వచ్చేసరికి వారి ముఖంలో ఒక అద్భుత తేజం గోచరిస్తూ ఉండేది..స్వచ్ఛమైన చిరునవ్వు తో..ఎంతో ప్రశాంతంగా వుండేవారు..


ఒకరోజు సాయంత్రం వేళ..శ్రీ స్వామివారు వరండాలో కూర్చున్నారు..ఆసరికి మొగలిచెర్ల గ్రామస్థులు కూడా కొంతమంది శ్రీ స్వామివారిని చూద్దామని వచ్చి వున్నారు..శ్రీధరరావు దంపతులూ అక్కడే వున్నారు..వచ్చిన అందరికీ ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పదలచారో.. లేక..శ్రీధరరావు దంపతులకు పరోక్షబోధ చేయదలిచారో..మొత్తంమీద గంభీర కంఠస్వరం తో ఉపన్యాస ధోరణిలో ప్రారంభించారు..


"సాధారణంగా అందరూ అనేమాట..అన్ని మంత్రాలూ పుస్తకాలలో అంగన్యాస కరన్యాసాలతో సహా వ్రాసి ఉంటాయి కదా..వాటిని జపిస్తే చాలదా?..మళ్లీ ప్రత్యేకంగా "గురుబోధ" ఎందుకూ..? అని!..కానీ అది తప్పు!..శిష్యులలో కూడా ఉత్తమ..మధ్యమ.. అధమ.. సంస్కారం గల శిష్యులు వుంటారు..


"రామకృష్ణపరమహంస..రమణ మహర్షి లాటి వారు ఉత్తమ తరగతికి చెందిన వారు..రామకృష్ణ పరమహంస కు ఆయన గురువుగారు "తోతాపురి" గారు తాంత్రిక సాధన గురించి బోధిస్తున్న తరుణంలోనే..సమాధి స్థితి పొంది..అప్పటిదాకా బోధిస్తున్న గురువుగారినే విభ్రాంతి కి లోనయ్యేటట్లు చేశారు..అంటే దీనర్థం వినండి..గురుబోధ జరిగే సమయం లోనే..అందులోని సారాంశాన్ని గ్రహించి..అది తు. చ. తప్పకుండా పాటించి..గురువు కృపను పొందగలిగినవాడు..ఉత్తమ శిష్యుడు..


"కొంతమంది గురుబోధ స్వీకరించి.."ఆ జీవితం చాలా ఉంది..ఇప్పుడే ఇవన్నీ అవసరమా?..మెల్లిగా చేద్దాం.." అనుకుంటూ..ఏ పది పన్నెండేళ్లకో కోటి జపం పూర్తి చేసి..గురువు ఋణం తీర్చుకుంటారు..వీళ్లకు కష్టాలు వచ్చినప్పుడు..గురువు బోధించిన మంత్రాన్ని శంకిస్తారు..గురువునూ అనుమానిస్తారు.. మరలా ఆ గురువే ధైర్యం చెపితే..మరలా ప్రారంభిస్తారు..వీళ్ళు మధ్యమ స్థాయి శిష్యులు.." అంటూ ప్రభావతి గారి వైపు చూసి.."అమ్మా!..నీలాటి వాళ్ళు ఈ కోవకు చెందుతారు" అన్నారు..


"ఇక..అధమ స్థాయి శిష్యులు..వీళ్ల గురించి ఎంత తక్కువ చెపితే..అంత మంచిది..వీళ్లకు గురుబోధ అన్నది కేవలం గొప్పగా చెప్పుకోవడానికే తప్ప..తాము ఆచరించరు.."ఆ గురువు గారు చెప్పారు..మనం విన్నాం..సంసారాలు చూసుకోవాలి కదా..పొద్దస్తం జపం అంటూ కూర్చుంటే..పనులేలా సాగుతాయి..చేద్దాం లే..తీరికున్నప్పుడు..అయినా గురువు కు మనమీద కరుణ వుంటే..ఆయనే అన్నీ చూసుకోడా?..కష్టం వచ్చినప్పుడు ఆయన శరణు వేసుకుంటే..అన్నీ ఆయనే సరి చేస్తాడు..మనకెందుకొచ్చిన శ్రమ!.."అనుకుంటూ వుంటారు.."


"అందుకే గురుబోధ చేసేముందు..శిష్యుని మానసిక పరిణితి ని గ్రహించి..మంత్రోపదేశం చేయాలి..అర్హత లేని వారికి ఉపదేశం చేస్తే..గురువు కూడా సద్గతి పొందడు!.." అన్నారు..


"నాయనా!..దత్తాత్రేయుడు ని "సద్గురువు".."అవధూత"...అంటారు..మీరు వివరంగా చెప్పగలరా?.." అన్నారు ప్రభావతి గారు..


శ్రీ స్వామివారి ముఖంలో ఒక్కసారిగా సంతోషంతో కూడిన వెలుగు వచ్చింది..ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యానం లోకి వెళ్లిపోయారు..అపరితమైన ఆనందం ఆయన వదనం లో తాండవిస్తోంది..శ్రీ స్వామివారు ఆపాదమస్తకమూ పులకించిపోయినట్లుగా..ఒకానొక పారవశ్యపు స్థితి లోకి ఉండిపోయారు..


"అమ్మా!..మంచి వివరణ కోరావు తల్లీ!..ఈరోజు తప్పకుండా చెపుతాను..శ్రీ దత్తాత్రేయ అవతారం అంటే నాకు ప్రత్యేకమైన భక్తి.. గౌరవం..అభిమానం..ఆ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..నా శక్తిమేరకు మీకు వివరిస్తాను..ముందుగా కొన్ని విషయాలు తెలిపి..ఆపై..ఆ దత్తుడి గురించి మాట్లాడతాను..శ్రద్ధగా వినండి.." అన్నారు..


"అవధూత అంటే..ఒకవిధంగా..ముక్తసంగుడు..జీవన్ముక్తుడు.. కారణ జన్ముడు..అవధూత పైకి ఆడంబరంగా కనిపించడు.. పసిపాపలా..పిచ్చివాడిలా..పిశాచరూపుడిగా.. అంటే..శరీర శుభ్రత పాటించకుండా..ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా..రకరకాల అమాయకపు వేషాలతో ప్రవర్తిస్తూ వుంటారు..అంతరంగంలో నిత్య సమాధి స్థితి లో వుంటారు.." అని చెప్పి కళ్ళు మూసుకొని..ఏదో ఆలోచిస్తూ..


"అమ్మా..ఇది రాక్షస గడ్డ!..ఇక్కడ భక్తి..భగవంతుడు..సాధుపూజ..అన్నవి చాలా తక్కువ మందికే తెలుసు..చెప్పినా వినిపించుకోరు..పైగా హేళన చేస్తారు..రాక్షసత్వం ప్రబలిన చోట..దానిని అదుపు చేయడానికి ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు..ఆయన బోధలు..ప్రవర్తన..వీళ్ళలో పరివర్తన తెస్తుంది..అదే ఉత్తర హిందూ దేశంలో చూడండి..నేటికీ..అవధూతలంటే ఎంత గౌరవం ఇస్తారో..ఒక సాధువు తమ ఊరికి వచ్చి బస చేస్తే..ఆ ఊరిలో వుండే ధనవంతులు..బీదవారు..ఎవరైనా సరే..అతని సేవ చేసుకుంటారు..ఏనాడూ ఇల్లు దాటిరాని స్త్రీలు కూడా ఆ సాధువు కోసం ఆహారపదార్ధాలు..మిఠాయిలు..చేత పట్టుకొని వస్తారు..ఆ మహనీయుడు తమ పళ్లెం లోని పదార్ధాలలో ఒక్క మెతుకు ముట్టుకుని రుచి చూసినా..తమ పది తరాలు సుభిక్షంగా వుంటాయని వాళ్ళ నమ్మకం..అది నిజం కూడా!.."


అవధూతలు..దత్తాత్రేయుడి గురించిన వివరణ రేపు కూడా...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: