18, మే 2021, మంగళవారం

సనందులవారి గురుభక్తి

 ✍🏼 .... నేటి చిట్టి కథ


జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య గారి  శిష్యులలో ఒకరైన పద్మపాదుల వారి అసలు పేరు సనందన .  ఈ కథ సనందులవారి గురుభక్తిని చాటి చెప్తుంది.  


ఒక రోజు శంకరాచార్యుల వారు కాశిలో ఉన్నప్పుడు, గంగా నది ఒడ్డున సనందనుడు గురువుగారి తడి బట్టలను ఆరేస్తున్నారు. మరొక వైపు శంకరాచార్యుల వారు నదిలో

స్నానం చేసి తడి బట్టలతో బయటికి వచ్చి నిలబడ్డారు. పొడి బట్టలను తెమ్మని శిష్యుడిని పిలిచారు


సనందుడు గురువుగారిని తడి వస్త్రములతో చూడలేకపోయాడు.ఆయన పట్ల ఉన్న అమితమైన భక్తి ,ప్రేమల కారణంగా సనందుడు, ఎక్కడ ఉన్నాడో ఆలోచించకుండా,వెంటనే వెళ్ళి ఆయనకి పొడి బట్టలని అందించాలని అనుకున్నాడు.


గంగా నది దాటాలి  అంటే పడవలో వెళ్ళాలి, అనికూడా ఆలోచించించ లేదు.


సనందుడికి ఒక్కటే ఆలోచన ఏమిటి అంటే గురువువుగారికి పొడి వస్త్రములు అందించడం. అంతే !


అలలని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా హుటాహుటిన బయలుదేరాడు.  


నేలమీద నడిచినట్టు , గంగా నదిలో నడుచుకుంటూ , గురువుగారి దగ్గరకి వెళ్ళిపోయాడు.


ఒక వేళ తాను నదిలో మునిగిపోతే ఉన్న పొడి బట్టలు కూడా తడిసిపోతాయని కూడా అతనికి తట్టలేదు. మరి అటువంటి భక్తులకి భగవంతుడు అండగా నిలవడా ?


సరిగ్గా అదే జరిగింది.


సనందుడు నడుస్తుండగా  గంగా దేవి నది పొడుగునా తామర పువ్వులతో దారి పరిచింది



తాను వేసే ప్రతి అడుగుకి ఒక తామర పువ్వు వికసించడం చూసి అందరూ ఆశ్చర్య పోయారు.


ఈ విధంగా సనందన సునాయాసంగా నదిని దాటి, గురువుగారి దగ్గరకి స్వయంగా వచ్చి  పొడి వస్త్రములను అందించాడు.


అప్పుడు శంకరాచార్యులు “నదికి ‘అవతల ఉన్న నువ్వు ఇంత తొందరగా నదిని  ఎలా దాటగలిగావు’?అని ప్రశ్నించారు. సనందనడు ‘గురువుగారు !మిమ్మల్ని తలుచుకుంటేనే , ఈ సంసారం అనే సముద్రంలో నీరు, మోకాళ్ళ లోతుకి వెళ్ళిపోతుంది.’ అటువంటి మీరు ఆజ్ఞాపించినప్పుడు నేను నదిని దాటడంతో ఆశ్చర్యమేముంది “ అని వినయంగా సమాధానము ఇచ్చాడు.  


శంకరాచార్యులు వారు, సనందుడికి  తామరపువ్వులు పరిచిఉన్న త్రోవని చూపిస్తూ సనందుడి అడుగులకి తామరపువ్వులు వికసించాయి.  కాబట్టి అతనికి ‘పద్మపాదా ‘ అని పిలిచారు.


నీతి:


ఎవరైతే అచంచల  భక్తి, విశ్వాసములతో గురుపాదములను శరణు వేడుతారో వారి మంచి చెడ్డలన్నీ గురువు చూసుకుంటారు.


🍁🍁🍁🍁🍁🍁🍁



అణుమాత్రాత్మకం దేహం షోడషార్ధం ఇతి స్మృతమ్‌

 ఆద దీత యతో జ్ఞానం తం పూర్వం అభివాదయేత్‌


అణు మాత్రమైన దేహములో అయిదు పంచ భూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు అనే పదహారింటి నివాసం అని ఆ దేహం గురించి ఆ దేహములో ఉండే ఆత్మ గురించి ఆత్మలో ఉండే పరమాత్మ గురించి ఎవరి వల్ల తెలుసుకుంటామో ముందు అతనికి నమస్కరించాలి. అనగా షోడశ వికారములు కల శరీరాన్ని ఇచ్చిన వారు తల్లిదండ్రులు. ఈ శరీరంలో ఇవన్నీ ఉన్నాయని నీవు పూర్వ జన్మలో చేసుకున్న కర్మే నీకు ఈ శరీరాన్ని తల్లిదండ్రుల ద్వారా ప్రసాదించినది. కర్మ ఫలాన్ని ఇచ్చేవారు తల్లిదండ్రులు జ్ఞాన ఫలాన్ని ఇచ్చేవారు గురువు. అందువలన తల్లిదండ్రుల వద్ద ఉన్నపుడు మొదట వారికి నమస్కరించవలెను. వారు కాక తక్కిన వారు ఎవరున్నా మొదట గురువుకు నమస్కారం చేయవలెను. తల్లిదండ్రులు ఇచ్చినది అణుమాత్ర దేహం, గురువు ఇచ్చినది మేరువంత జ్ఞానము కావున గురువుకు ముందుగా నమస్కరించవలెను.


🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: