2, జూన్ 2021, బుధవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*నేలమాళిగ..నిరంతర సాధన...*


*(నలభై ఆరవ రోజు)*


మొగలిచెర్ల ఫకీరు మాన్యం లో నిర్మిస్తున్న ఆశ్రమం దాదాపు పూర్తి కావొచ్చింది..శ్రీ స్వామివారు సాధన చేసుకుంటూనే..మరోవైపు తన అవసరాల కనుగుణంగా ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు..తూర్పు ముఖంగా ఒక గది..ముందు వరండా..వరండాలో ఆగ్నేయం వైపు ఒక చిన్న వంటగది..ఈశాన్యం లో బావి..చుట్టూరా ప్రహరీ గోడ..ప్రహరీ లో తూర్పు వైపు ద్వారం..ఇలా ఉండేది..


తాను సమాధి స్థితి నుంచి వెలుపలికి రాగానే..ముందుగా బావి వద్దకు వెళ్లి..తలారా స్నానం చేసేవారు..ఆ స్నానం చేయడం కూడా ఏదో త్వరగా ముగించినట్లు కాకుండా..నింపాదిగా..శ్రద్ధగా చేసేవారు..ఆరడుగుల పైనే పొడవున్న తెల్లని మేనిఛాయతో..బావి వద్ద నిలబడి రెండుచేతులతో బక్కెట్ పైకెత్తి పట్టుకొని..అందులోని నీటిని ధారగా తలమీద పోసుకునే వారు..పరమశివుడు తనకు తానే అభిషేకించుకుంటున్నాడా అనిపించేది ఆ దృశ్యం చూస్తే!..


ఆ తరువాత ఆశ్రమ ఆవరణ అంతా తిరుగుతూ వుండేవారు..ఫకీరు మాన్యం లోకి పశువులను మేపుకొనడానికి వచ్చిన పశువుల కాపరులు..ఆశ్రమ ప్రహరీ వద్దకు వచ్చి..ప్రహరీ మీదుగా లోపలికి చూసేవారు..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు తిరుగుతూ కనిపించేవారు..వీళ్ళను చూసి పలకరింపుగా నవ్వేవారు..బాగా ఉత్సాహంగా ఉన్నరోజు.. ఆ పశువుల కాపరుల తో మాట్లాడేవారు కూడా..వారి యోగక్షేమాలు విచారించేవారు..ఆ సమయంలో శ్రీ స్వామివారిని కలిసిన వారితో ..ఏ కల్మషమూ లేకుండా..నవ్వుతూ..హాయిగా మాట్లాడేవారు..


ఒక్కొక్కసారి శ్రీధరరావు దంపతులు అలాంటి సమయంలో రావడం జరిగితే..వారిని కూర్చోబెట్టి..అనర్గళంగా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను విడమరిచి చెప్పేవారు..ఆ చెప్పడంలో కూడా ఖంగు మనే కంఠస్వరంతో..ఎంతో వేదాంతాన్ని రంగరించి..వినసొంపుగా చెప్పేవారు..పట్టుమని ముప్పై యేళ్ళు కూడా లేని ఆ యువకుడిలో అంత జ్ఞానం ఎలా వచ్చిందీ అని వినే వారికి అనిపించేది..మహా మహా యోగులు..మహర్షులు చెప్పిన భాష్యాలను అలవోకగా అర్ధం తో సహా వివరించేవారు..ఆ ధారణాపటిమ దైవదత్తమే కానీ..మరేదీ కాదని ప్రభావతి గారు అనేవారు తమ పిల్లల తో..


శ్రీ స్వామివారికి ఆహారం ప్రతిరోజూ శ్రీధరరావు గారింటి నుంచే వచ్చేది..ఆయన ధ్యానం లో ఉన్నప్పుడు గది ముందు తలుపుదగ్గర పెట్టి వెళ్లే వాళ్ళు..తిరిగి సాయంత్రం ఆ అన్నం డబ్బా ను తీసుకెళ్లే వాళ్ళు..ఒక్కొక్కసారి ఆ డబ్బా లో ఉన్న ఆహారం అలానే ఉండేది..అంటే శ్రీ స్వామివారు ధ్యానం నుంచి వెలుపలికి రాలేదని అర్ధం..మరోసారి వరుసగా రెండు మూడు రోజులపాటు అలానే జరిగేది..శ్రీ స్వామివారు నిరాహారంగా ధ్యానం లోనే ఉండిపోయేవారు..ఆ తపోసాధన ఎంత తీవ్రంగా ఉండేదో..శ్రీ స్వామివారు ధ్యానం నుంచి లేచి వెలుపలికి వచ్చినప్పుడు దగ్గరగా గమనించిన వారికి అర్ధమయ్యేది..ముఖం లో ఒకవిధమైన తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది..దృష్టి కూడా దిగంతాలకు అవతలివైపు చూస్తున్నట్లు గోచరించేది..పద్మాసనం వేసుకొని హఠయోగంలో అలా నిటారుగా..కూర్చుని ఉండేవారేమో..రెండు తొడల మీదా పాదములు పెట్టుకున్నందువల్ల..కమిలిపోయి మచ్చలు ఏర్పడేవి..ఇవేవీ ఆయన మనసుకు తోచేవి కాదు..ధ్యానం..సమాధి స్థితి..అంతే!..అదే ధ్యాస!..తానొచ్చిన కార్యం పూర్తి కావాలంటే..తాను ఇంత సాధనా చేయాల్సిందే అన్నట్లుగా వుండేవారు..ఎవరితోనూ సంభాషించేవారు కాదు..ఒకవేళ శ్రీధరరావు దంపతులు రాదల్చుకున్నా..ఓ నాలుగైదు రోజులపాటు రావొద్దని చెప్పి పంపేవారు..ఎవరైనా వచ్చినా.. ప్రహరీ కున్న ద్వారం వద్దే వేచి చూసి..తిరిగి వెళ్లవలసిందే..


ఆశ్రమం లోని ప్రధాన గది లో నిర్మించుకున్న  నేలమాళిగ లోనే ధ్యానానికి కూర్చుని..ఆ పైన ఒక చెక్క పలకను వేసుకునే వారు..అంటే..పూర్తిగా చీకటి గుహ లాంటి ప్రదేశాన్ని సృష్టించుకున్నారు..ఆ లోపల కూర్చుని ధ్యానం చేయడం మానవమాత్రులకు సాధ్యం కాదు..ఈవిషయంలో శ్రీధరరావు దంపతులకు ఒక భయం పట్టుకుంది..ఊపిరాడని స్థితి వస్తే ఎట్లా?..అని..ఆ దంపతులు తల్లడిల్లిపోయారు..ఆ సందేహాన్ని శ్రీ స్వామివారు ఎంత చాకచక్యంగా వాళ్లకు అర్ధమయ్యేలా నివృత్తి చేసారో.. రేపటి భాగంలో చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: