2, జూన్ 2021, బుధవారం

ఆలు మగల సంవాదం!*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

(నాకు నచ్చిన శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు)

             🌷🌷🌷

*కొంచం సేపు హాయిగా నవ్వుకోండి* 🤣🤣🤣

  *ఆలు మగల సంవాదం!* 




      'ఇంక  నీతో నావల్ల కాదు .. నీకు విడాకులు ఇచ్చేద్దామని ఆలోచిస్తున్నాను'


'అయ్యో ..నేనేం చేసేనండీ ?'


'ఏం చెయ్యలేదో అడుగు '


'పోనీలెండి .. నేను ఏవేం చెయ్యలేదండీ ?'


'ఉదయాన్నే నా పరువు తీసేసేవు '


'ఉదయాన్నే మీరు కింద పడుకున్న పరుపు తీసి మడతెట్టేను .. అంతేగానీ .. మీ పరువెప్పుడు తీసేను ?'


'మా ఫ్రెండు గోపాల్ గాడొస్తే నేను లేనని చెప్పమన్నానా ?'


'నేను అదే చెప్పేను కదండీ '


'నీ మొహం చెప్పేవు .. ఆ గోపాల్ గాడు 'సరే అయితే .. వాడు ఎప్పుడొస్తాడు ?' అని అడిగితే , లోపలికి తొంగి చూసి , 'ఏవండీ మీరు మళ్ళీ ఎప్పుడొస్తారని అడుగుతున్నారీయన .. ఏవని చెప్పమంటారు ' అని అడగడం ఒకటి .. ఆ వెధవ పడీ పడీ నవ్వుకుంటూ వెళ్ళిపోయేడు .. ఇవాళ్టి నుంచీ మా ఆఫీసులో తలెత్తుకోలేను .. హోల్సేలు గా నా పరువు తీసిపడేసేవు '


'మరి అతనా ప్రశ్న అడుగుతాడని నేనూహించలేదు కదండీ .. '


'నువ్వెక్కడ ఊహిస్తావు ? ఏమీ ఊహించవు .. మన పెళ్ళైన కొత్తలో ఇద్దరం గుడికెళ్తే ఏం చేసేవు ?'


'గుడికెళ్తే దణ్ణం పెట్టుకునుంటాను .. అంతకు మించి ఏం చేస్తాను ? ప్రసాదం ఇద్దరికీ సమానంగానే పెట్టేను కదా '


'వెధవ సొద ..నీకు బుర్ర లేదో లేక లేనట్టు నటిస్తావో అర్ధం కాదు .. నేను అంటున్నది ప్రసాదం గురించో తీర్థం గురించో కాదు .. పంతులు గారు గోత్రం చెప్పమ్మా అంటే 'శాండిల్యస' అని మీ పుట్టింటి గోత్రం చెప్పేవు .. నేను కాదు హరితస అని చెప్పబోతూంటే , కాదండీ అంటూ నాతో వాదించడం ఒకటి '


'మరి పెళ్ళైన వెంటనే గోత్రం మారిపోతుందని  నాకెలా తెలుస్తుందండీ ?'


'అంటే .. నేనో నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నానేంటి .. నాకు తెలియడానికి '


'నేనలా ఎప్పుడన్నానండి ?'


'నువ్వనక్కర్లేదు .. నువ్వేమీ అనవు కూడా .. నా దరిద్రం ఏమిటో అన్నీ నాకలా అర్ధమవుతాయి మరి ..ఎప్పుడు చేసుకున్న ఖర్మో ఇదంతా .. మన శోభనం రోజున మీ పుట్టింటాళ్ళ ముందు నన్ను వెర్రాడిని చేసేసేవు '


'ఓహో .. ఆ లైటు సంగతా .. మీకింకా గుర్తుందాండీ ?'


'మర్చిపోయేదా మరి ? .. ఏదో సిగ్గుపడతావేమోనని .. వెళ్లి లైటు తీసి రా అంటే వెంటనే వెళ్లి ఆ ట్యూబ్ లైటు పీకి నా చేతిలో పెట్టేవు .. ఆ వేడికి కయ్యిమని నేనరుస్తే , మీవాళ్లు నువ్వేదో చేసేసేవేమోనని బయట్నుంచి లోపలికి వినపడేలా ఒకటే నవ్వు '


'మరి .. మా అమ్మా వాళ్ళు "ఇప్పుడు నీకు పెళ్లైంది .. నీ మొగుడు ఎలా చెబితే అలా చెయ్యాలి .. ఎదురు ప్రశ్నలడక్కూడదు " అని చెప్పేరండి .. అందుకే మీరు లైటు తీసి రా అంటే , ఆ ట్యూబ్ లైటు పీకమంటున్నారేమో అనుకున్నా '


'ఓహో .. అలా వచ్చేవా .. అయితే నేను వెళ్లి ఆ లైటార్పు అంటే ఏం చేసేదానివో ? ఉఫు ఉఫు అంటూ ఆ లైటు దగ్గిర ఊదేదానివా ?'


'లైటార్పు అంటే ఆపమనే కదండీ .. అందుకోసం స్విచ్చి ఉందిగా .. మళ్ళీ ఉఫు ఉఫు అంటూ ఊదడం ఎందుకు ?'


'అమ్మో ..  .. నీ సంగతి నాకు తెలుసే .. నంగిలా ఉంటావు కానీ చావు తెలివితేటలు నీవి .. అందికే మా అమ్మతో కూడా ఆడుకున్నావు '


'మీ అమ్మ తో.. అదే అత్తయ్యగారితో నేనెప్పుడు ఆడుకున్నానండీ ?.. అయినా ఆవిడ ఆడే ఆటలేముంటాయి ?'


'ఆవిడ ఆడే ఆటలు ఏముంటాయా .. ఏముందీ .. నీలాంటి కోడల్ని తెచ్చుకుని ఖర్మ కాల్చుకోడం లాంటి ఆటలు ఆడుతూంటుంది .. ఏదో కొత్త కోడలివి కదా అని నీకు ఫోన్ చేసి 'ఏవమ్మా .. వంట ఏం చేసేవు అని అడిగితే తినేసేమని చెబుతావా ?.. అంటే మా అమ్మకి వంట ఏం చేసుకుంటారో కూడా తెలీదనే కదా నీ అభిప్రాయం ?'


'అయయ్యో .. ఆవిడకి తెలీదని కాదండి .. నాకు తెలుసో లేదోనని పరీక్ష పెడుతున్నారనుకున్నాను '


'ఆ పరీక్ష పెట్టడానికి మా అమ్మో పేద్ద టీచరు .. నువ్వావిడ స్టూడెంటూ మరి '


'అత్తయ్యగారు నాకు దేవుడితో సమానమండి .. గురువు దేవుడితో సమానం కదండీ .. అంటే అత్తయ్యగారు నాకు గురువు తో సమానమే కదండీ '


'ఈ వెధవ లెక్కల్లో ఎమ్మెస్సీ  చెయ్యడం కాదు కానీ ప్రతీదానికీ ఓ ఈక్వేషన్ లాగుతావు .. మరి ఇంత గొప్ప తెలివైనదానివీ నిన్న సాయంత్రం మా ఫ్రెండ్సందరినీ అలా హడలగొట్టి పంపేవేం ?'


'నేనెక్కడ పంపేసేనండీ ? వాళ్ళే ఇంక వెళ్ళొస్తామని వెళ్ళిపోయేరు కదండీ '


'వాళ్ళందరూ ఏదో సరదాగా మనకి కొత్తగా పెళ్లైంది కదా .. మనింట్లో భోజనం చేద్దామని వచ్చేరు .. వస్తే అలా హడలగొట్టడమేనా ?'


'వాళ్ళు చెప్పాపెట్టకుండా కుటుంబాలతో సహా వచ్చేసేరు కదండీ .. ఇంట్లో సరుకులేవీ లేవు .. మిమ్మల్నడిగితే ఏదో ఒకటి వండేయ్ అన్నారు .. '


'మరి ఇంట్లో ఏవీ లేకపోతే లేవని చెప్పేడవొచ్చుగా .. '


'అందరిముందూ ఇంట్లో ఏవీ లేవని చెబితే బాగుండదు కదండీ '


'అందుకోసమని .. ఇంట్లో ఉన్న మ్యాగీ నూడుల్స్ తో పాయసం వండేస్తావా ? ఇద్దరు ముగ్గురైతే రోడ్డు మీదికెళ్లి డోక్కున్నారు కూడా .. వాళ్ళ ముందు నాకేడుపొచ్చినంత పనయ్యింది'


'మరి మీ గురించి వాళ్ళు తప్పుగా అనుకోకుండా  వాళ్లందరినీ ఇంట్లోంచి పంపేయడానికి నాకు వేరే ఏమీ తోచలేదండి .. నాకు వంట రాదు అనుకున్నా పర్వాలేదండి '


'ఖర్మ .. ఇంకేముందీ .. వీడి పెళ్ళానికి బుర్ర లేదు , వంట రాదు అని అందరూ ఇంక నన్ను చూసి నవ్వుకుంటారు '


'అయ్యో .. నాకు తెలీకుండానే మిమ్మల్ని చాలా బాధపెడుతున్నాను ..అయితే నాకు విడాకులిచ్చేస్తారాండీ ?'


'వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ళూ వేసాను కదా .. నా ఖర్మ అని సరిపెట్టుకుంటాను .. ఇంక మీ ఆఫీసుకి బయల్దేరు .. అసలే ఇవాళ మీకు జీతాలిచ్చే రోజు కూడా ..నీ డెబిట్ కార్డు నాకు ఇచ్చెళ్ళిపో'

🙄😂🙄😂🙄😘

🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

కామెంట్‌లు లేవు: