★ ఆయన గొప్ప మానవతావాది. కాళ్లకు వేసుకునే చెప్పులు ఎంత పాతవి అయిపోయినా, ఊడిపోతూ ఉన్నా, వాటిని తిరిగి కుట్టించుకుంటూ, బాగు చేయించుకుంటూ అవే తొడుక్కునేవారు. ''ఎందుకు పాతవాటితో అవస్థ పడటం'' అని ప్రశ్నిస్తే ''చెప్పులు కుట్టేవాడికి పని పెట్టాలి కదా! అతడికి దానం చేస్తే తీసుకోడు మనం ఇవ్వకూడదు. పని చేయించుకుని ఏదైనా ముట్ట చెప్పాలి. కొత్త చెప్పులు కొనుక్కుంటే అతడి బతుకెలా గడుస్తుంది? రిపేరు చేయటం నా వల్లకాదు అని అతగాడు అన్నప్పుడే కొత్తవి కొంటాను'' అన్న నిజమైన మనీషి తెలుగు జాతికి అవిస్మరణీయ పూజనీయులు "మల్లాది రామకృష్ణ శాస్త్రి" గారి 116 వ జయంతి (16 -6 -1905 ) నేడు.
★ అది పద్యమైనా లేక గద్యమైనా. కథ అయినా, కవిత అయినా, సినిమా పాటైనా లేక మాటైనా -- తెలుగు భాషా సుగంధ పుష్ప పరీమళం నలుదెసలా వ్యాపింప చేసిన ' సాహితీ మహర్షి ' శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చేసుకున్న పాపం వల్ల, మనం చేసుకున్న పుణ్యం వల్ల వీరు తెలుగు రచయితగా పుట్టారు. ఇటువంటి కవి, మరే భాషలో ఉన్నా అంతర్జాతీయ ఖ్యాతి పొంది ఉండేవాడు.నిజంగా ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఒకే పని తెలుగు భాషను గొంతు నులిమి చంపడం కంటి ముందే జరుగుతున్నా ..దాన్ని చూస్తూ మనం బ్రతికి ఉండడం మన ఖర్మ!
★ మద్రాసులోని పానగల్ పార్క్ చూసినప్పుడల్లా అందరికీ గుర్తుకు వచ్చే మొదటి వ్యక్తి శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు.పానగల్లు పార్కుకు వచ్చి శాస్త్రిగారిని కలిసినవారిలో ఆకలిగొన్నవారికి తన బ్యాగులో ఉన్న హోటల్ భోజనం టిక్కెట్ల కట్టలోంచి ఓ టిక్కట్టును చింపి ఇచ్చి వారి కడుపునింపిన వెన్నలాంటి కన్నతల్లి మనసు ఆయనది. కేవలం ఇలా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టించడంకోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే పాండీ బజార్ లో ఉన్న హోటల్ కి వెళ్లి ప్రత్యేకంగా భోజనం టిక్కెట్ల పుస్తకాన్ని కొనుక్కొచ్చేవారని ఆయన్ని బాగా ఎరిగినవారు చెబుతారు.
★ అందరినీ తన వాళ్లుగా భావించి ఆదరంగా చూసుకునే మంచి మనసు ఆయనది.బ్రతకడం అంటే అది.కేవలం మనకున్న తెలివితేటలను, అధికారాలను అమ్ముకొని సుఖాలనే ఎండమావుల వెంట బతికే పె(గె)ద్దలకు ఈ మంచితనం అర్థం కాదు.
★ తెలుగు వారికి చిరకాలం గుర్తుండే పాట అయిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్'(పాత దేవదాసు సినిమా లోనిది), ఆ పాటను గురించి అంతరార్ధాన్ని వేదాంత భాషలో ఎంత గొప్పగా చెప్పారో చూడండి. తెలుగు భాషలో 'కుడి' అంటే శరీరం అనే అర్ధం కూడా ఉంది,ఇక 'ఎడం' అంటే దూరం.శరీరం విడిపోయి నంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. శరీరం పోయినా ప్రేమ మాత్రం ఎన్నటికీ ఓడదు అన్న వారి మేథోవైభవాన్ని ఈ నేలలో స్థిరంగా ఉండిపోతుంది.
★ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీరికి పలు భాషలలో ప్రవేశమే గాక ప్రావీణ్యం కూడా ఉంది. సంస్కృతం, ప్రాకృతం, పాళీ, భాషలే కాకుండా, జర్మనీ, సింహళ, గ్రీకు భాషలలో కూడా వీరికి ప్రావీణ్యం ఉంది. ఓ సందర్భం లో ఆరుద్ర "గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును?" అని అడిగారు. దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే, అప్పుడు ఆరుద్ర "అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి" అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి.
★ ఇంతటి వైభవ పాండిత్యాన్ని కలిగినా సామాన్యంగా బ్రతికిన వినమ్రతాశీలి వారు.
ఆశ్చర్యం కలిగించే ఆయన జీవితాన్ని తెలుసుకోండి మీ పిల్లలకు చెప్పండి వారి హృదయాల్లో ఆరని మంచిదీపాన్ని వెలిగించండి.పూజ్య శ్రీ "మల్లాది రామకృష్ణ శాస్త్రి" వారి కి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కనకవల్లి, నరసింహశాస్త్రి గార్ల దివ్యపాదపద్మాలకు ప్రణమిల్లుతూ
రచన..
🙏 సాయి కుమార్ రెడ్డి. బత్తిన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి