18, జూన్ 2021, శుక్రవారం

. అత్రి మహర్షి

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

2. అత్రి మహర్షి 

అత్రి మహర్షి ఎవరో తెలుసా ? మనం సప్తమహర్షులు అనే మాట వింటూంటాం కదా ... వాళ్ళల్లో ఈయన ఒకడన్నమాట . అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులోంచి పుట్టాడు . అంటే బ్రహ్మమానస పుత్రుడన్నమాట . అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుఁడు " లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను , నువ్వు గొప్ప తపశ్శక్తిని పొంది నాకు ఈ సృష్టికార్యంలో సాయపడాలి ” అని అడిగాడు . అందుకు అత్రి మహర్షి సరే ! అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమయిన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు . ఈ మహర్షి చేసిన ఘోరతపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి , ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించి పోయింది . ఆ తేజస్సుని భూమ్యాకాశాలు కూడా భరించలేక పోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది . ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రిమహర్షికి పెళ్ళయ్యాక తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని , క్షీరసాగర మథన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు . కొంతకాలం తర్వాత , అత్రి మహర్షికి దేవహూతి కర్దముడు అనే దంపతులకు పుట్టిన తొమ్మిదిమంది కూతుళ్లలో ఒక కూతురయిన అనసూయతో పెళ్ళి జరిగింది . పెళ్ళి చేసుకున్న అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి జీవిస్తున్నాడు . అనసూయాదేవి గొప్ప పతివ్రతగా వినుతికెక్కింది . ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు . అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు . అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి 


అన్నారు . అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు . త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారిమీద మంత్రజలం చల్లి , చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది . మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గుర్ని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది . భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేసింది . త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి , లక్ష్మి , పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు .

 ఒకసారి కౌశికుడి భార్య , సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది . అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బ్రతికించింది . అత్రి మహర్షికి పిల్లలు లేరని వంద సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు . అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు . కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి కంట్లోంచి చంద్రుడు , అనసూయాదేవికి  మేముడు , దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు .

ఒకనాడు అత్రి మహర్షి అనసూయని పిలచి మనకి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు కలిగారు కదా ... నేనింక తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోదామనుకుంటున్నాను . నువ్వుకూడా నాతో వస్తావా ? పిల్లల దగ్గరుంటావా ? అని అడిగాడు . అప్పుడు అనసూయ స్వామీ ! మీకంటే నాకు పిల్లలు ఎక్కువ కాదు . కానీ , పిల్లలు బాగా చిన్నవాళ్ళు . వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళయ్యాక మనం వెడితే ధర్మంగా ఉంటుంది , ఈ లోగా పిల్లల్ని పోషించడానికి కొంచెం ధనం కావాలి కదా ! మీరు పృథు చక్రవర్తి దగ్గరకు వెళ్ళి ధనం తీసుకురండి అంది . ఆ సమయంలో పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు . ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు . అత్రి మహర్షి సరేనని బయల్దేరాడు . పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు . అత్రి ఓ మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు . అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు . అశ్వమేధయాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం , వస్తువులు మొదలయిన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయా దేవితో కలిసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు . ఒప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది . అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటయిపోయింది . అప్పుడు అత్రి మహర్షి తన చూపులోనే రాక్షసులందర్ని చంపేశాడు . 

*క్షత్రియ చంద్రవంశానికి ఆదిపురుషుడు అత్రి మహర్షే*

మన భారత దేశంలో క్షత్రియ వంశాలు ప్రధానంగా సూర్యవంశం, చంద్ర వంశంగా విభజితం అయ్యాయన్నది తెలిసిందే. అత్రి కుమారుడైన సోముడినే చంద్రుడు అనటంకూడా ఉంది. ఈ చంద్రుడి పేరుమీదనే 'చంద్రవంశం' రూపొందింది. ఈ వంశంలో దుష్యంతుడు, భరతుడు, శంతనుడు, భీష్ముడు, ఆ తర్వాత వారి సంతానమైన కురుపాండవులు ఉన్నది తెలిసిందే. (కశ్యపుని కుమారుడైన సూర్యుని పేరుమీదుగా సూర్యవంశం రూపొందింది. ఈ వంశంలో దిలీపుడు, రఘు మహారాజు, దశరథుడు, శ్రీరాముడు వంటి వారు ఉన్నారు.) 

 


ఎంతోమంది ఋషులు అత్రిమహర్షి నడిగి పూజా విధానం అభిషేకం , దేవతా ప్రతిష్ట , ఉత్సవాలు , దోషాలకు ప్రాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలుసుకుంటూ ఉండే వాళ్ళు , అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు , జపతపాలు రహస్య పాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలియచేయబడ్డాయి . అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు , గురుప్రశంస , చాతుర్వర్ణ ధర్మాలు , జపమాలాపవిత్రత , పుత్రులు దత్తపుత్రులు మొదలయినవాటి గురించి తెలియచేయబడ్డాయి .


 దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశ పెట్టింది . అత్రిమహర్షి  ! 


అత్రి మహర్షి గురించి చాలా విషయాలు మనకి తెలిసినట్టే కదా !  అత్రి మహర్షి గురించే కాదు ఆయన భార్య అనసూయాదేవి గురించి కూడా.

                            2. అత్రి మహర్షి 

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*

1 కామెంట్‌:

NAGESWARA RAO TURAGA చెప్పారు...

మనము బ్రాహ్మణులు కాదు.విప్రులుమాత్రమే.
బ్రాహ్మణుడు అంటే బ్రహ్మము తెలిసినవాడు. వేదాధ్యయనము చేసేవాడు.