10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

పత్రాలు - వాటి ఔషధ గుణాలు .

 విఘ్నేశ్వరుడి పూజకు ఉపయోగించవలసిన పత్రాలు - వాటి ఔషధ గుణాలు .


   ప్రధమ పూజలు అందుకునేవాడు , పార్వతి తనయుడు అయిన విఘ్నేశ్వరుడికి పూజ చేయుటకు మొత్తం 21 రకాల పత్రాలను ఉపయోగించవలెను . ఇప్పుడు మీకు ఆ పత్రాల పేర్లు వాటి యెక్క ఔషధ గుణాలు గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను.


      మొత్తం 21 రకాల పత్రాలు వరసగా అవి.


 * మాచిపత్రి -


         ఇది కుష్టు , వాతరక్తం , జ్వరాన్ని , భూతబాధ , గ్రహ బాధని తొలగించును.


 * వాకుడు -


         కఫం , వాతం , శ్వాసము , శూలజ్వరం , వాంతుల రోగం , గుండెజబ్బు , ఆకలి లేకపోవటం , ఆమదోషం నివారించును.


 * మారేడు - 


         వాతాన్ని తగ్గించును , దీని పండు శూల, జ్వరాన్ని , మూత్రకృచ్చం నశింపచేయును.


 * గరిక - 


         ఇది రక్తపైత్యం , కఫం , తాపము , దప్పిక , విసర్పి రోగాలను నయం చేయును .


 * ఉమ్మెత్త -


         కుష్టువు , దురద, వ్రణము , అరికాలిబొబ్బలు , విషము వీటిని నశింపచేయును .


 * రేగు -


          ఇది పిత్తాన్ని , వాతాన్ని హరించును . ఆమ దోషాన్ని నివారించి ఆకలి బాగుగా కలుగచేయును .


 * ఉత్తరేణి -


           కఫము , కుష్టు , మహోదరము , మొలలవ్యాధి , వాపు , దురద, శూల , అరుచి సమస్యలను నివారించును. శీఘ్రవిరేచనం కలుగచేయును.


 * తులసి -


           దాహాన్ని కలిగించును. పిత్తాన్ని ఉత్పత్తి చేయును . హృదయానికి బలాన్ని కలిగించును. ఆకలి పుట్టించును . శ్లేష్మం , దగ్గు , శ్వాస , కుష్టు , క్రిమిరోగాలు , వాంతులు , దుర్గoదం , పార్శ్వపు శూల , విషాన్ని హరించును .


 * విష్ణుక్రాంత -


         పిత్తము , కఫాన్ని పోగొట్టును .విషము , కుష్టు , ఆమము , శోఫ , తలనొప్పి , నేత్రరోగాలను నయం చేయును .


 * దానిమ్మ -


         చలువచేయును , నీరుని పెంచును , గుండెకి బలము ఇచ్చును. దుష్టరక్తం హరించును , త్రిదోష హరమైనది, ఆకలి పుట్టించును , రక్తగ్రహణి తగ్గించును , కంఠస్వరం బాగుచేయను . దేహపుష్టిని , రక్తపుష్టిని ఇచ్చును , భోజనాంతరం పుచ్చుకునిన అన్నమును జీర్ణం చేయును , వాతము , కఫం , పైత్యాన్ని హరించును . రక్తమును శుభ్రపరచును.


 * దేవదారు -


         ఇది శ్లేష్మం , వాతం , ఆమదోషం , మలబంధం , ప్రమేహం , ప్రదరము , జ్వరం , క్రిమిరోగం పోగొట్టును .


 * మరువం -


          దీని కషాయం పైత్యం , శ్లేష్మం , విషము , మేహము , మొలలరోగం , క్షయరోగం , పైత్య భ్రమ , దాహము , తాపము తగ్గించును . విరేచనబద్ధము చేయును . ఆకలి పుట్టించును , జీర్ణశక్తిని వృద్దిచేయును , ఇంద్రియపుష్టి చేయును .


 * వావిలి - 


          ఇది క్రిమి , కుష్టువు , పిత్తము , శ్లేష్మం , ప్లీహము , గుల్మరోగం , అరుచి , సన్నిపాతం , జ్వరం , పిచ్చి , పీనస వీటిని నశింపచేయును .


 * జాతిపత్రి -


         ఇది కారంగా , ఉష్ణంగా , పరిమళంగా ఉండును. కఫం , మూత్రదోషం , అతిసారం , శ్వాస , హుద్రోగం , శూల నశింపచేయును. నోటికి పరిమళం కలిగించును.


 * శీతాఫలం -


         ఇది శరీరముకు వేడిచేసి చలువచేయును . రక్తమును , ఇంద్రియమును వృద్దిచేయును , ముంతగుండెకు , మనస్సుకు బలమును ఇచ్చును , జీర్ణశక్తిని ఇచ్చును. క్రిమిని హరించును , మేహవాతం అణుచును , శ్లేష్మము పెంచును .


 * జమ్మి -


         ఇది విసర్పిరోగం , వ్రణము , దద్దురులు , ప్రదరరోగం , కేశములను నశింపచేయును .


 * అత్తిపత్తి - 


          ఇది మూలవ్యాది , వరిబీజం , భగంధరం , దగ్గులు తగ్గును. కంటిపొరలు , వీర్యవృద్ధి , అతివేడి , పైత్య శాంతి కలుగచేయును.


 * రావి -


          చలువచేయును , పిత్తము , శ్లేష్మము , వ్రణము , యోని దోషము , మంట , పిత్తము , కఫము పోగొట్టును . బాగుగా పండిన రావిపండ్లు హృదయానికి ఎక్కువుగా మేలుచేయును . పిత్తరక్తం , విషపీడ , తాపం , వాంతి , అరుచి నశింపచేయును .


 * మద్ది -


         హృదయానికి హితమైనది , కఫ , పిత్తములను శమింపచేయును . విషము , రక్తదోషం , మేధోవృద్ధి , ప్రమేహము , వ్రణము అను వ్యాధులను పోగొట్టును .


 * జిల్లేడు -


        వాతదోషం , శోఫ , వ్రణము , దురద , కుష్టు , ప్లీహారోగం , క్రిమిదోషం నివారణ చేయును .


 * మామిడి -


       ఇది ప్రమేహము , రక్తదోషం , కఫం , పిత్తము, వ్రణము వీటిని హరించును . లేత మామిడికాయ త్రిదోషం , ప్రకోపం , రక్తదోషం హరించును .


 * వెలగ -


        ఇది శీతలంగా ఉండును , స్వరం , కఫము నశింపచేయును . దీని ఫలం మధురంగా , పుల్లగా ఉండును. శ్వాస కాస , అరుచి , దప్పిక తగ్గించును . కంఠశుద్ధి కలుగచేయును . నిద్ర కలుగచేయును . తలనొప్పి తగ్గించును . మూత్రములో పోవు తీపి తగ్గును.


        పైన చెప్పినవన్నీ విఘ్నేశ్వరుడు పూజలో వాడుదురు .


      

కామెంట్‌లు లేవు: