*15.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*
*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*15.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*విహరిష్యన్ సురాక్రీడే మత్స్థం సత్త్వం విభావయేత్|*
*విమానేనోపతిష్ఠంతి సత్త్వవృత్తీః సురస్త్రియః॥12799॥*
దేవతలు విహరించునట్టి ఉద్యానవనములందు క్రీడింపదలచిన యోగి శుద్ధసత్త్వమయమైన నా స్వరూపమును ధ్యానింపవలెను. అప్పుడు సత్త్వగుణాంశ స్వరూపులైన దివ్యాంగనలు విమానములపై ఎక్కి అతని సమీపమునకు చేరుదురు.
*15.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*యథా సంకల్పయేద్బుద్ధ్యా యదా వా మత్పరః పుమాన్|*
*మయి సత్యే మనో యుంజంస్తథా తత్సముపాశ్నుతే॥12800॥*
మత్పరాయణుడైన యోగి సత్యసంకల్ప రూపుడనైన నా యందు తన చిత్తమును స్థిరముగా నిల్పినచో అతనికి సంకల్పసిద్ధి కలుగును. అతని మనస్సులోని సంకల్పము తత్ క్షణమే సిద్ధించును.
*15.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*యో వై మద్భావమాపన్న ఈశితుర్వశితుః పుమాన్|*
*కుతశ్చిన్న విహన్యేత తస్య చాజ్ఞా యథా మమ॥12801॥*
నేను *ఈశిత్వము*, *వశిత్వము* అను సిద్ధులకును స్వామిని. అందువలన ఎవ్వరును నా ఆజ్ఞను ఉల్లంఘింపజాలరు. అందరును నా శాసనమునే అంగీకరించెదరు. నా ఈ రూపమును మనస్సున భావించుచు చింతనము చేసినచో, ఆ యోగియొక్క ఆజ్ఞనుగూడ నా ఆజ్ఞనువలె ఎల్లరును శిరసావహింతురు.
*15.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*మద్భక్త్యా శుద్ధసత్త్వస్య యోగినో ధారణావిదః|*
*తస్య త్రైకాలికీ బుద్ధిర్జన్మమృత్యూపబృంహితా॥12802॥*
యోగి భక్తి భావముతో తన చిత్తమును నా యందు ధారణ చేయగా చేయగా అది పూర్తిగా పరిశుద్ధమగును. తత్ప్రభావమున అతని బుద్ధి సహజముగా అగోచర విషయములైన జననము, మరణము మొదలగు విషయములను తెలిసికొనగల్గును. అతనికి భూత, భవిష్యద్వర్తమానకాలముల విషయము లన్నియును కరతలామలకములగును.
*15.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*అగ్న్యాదిభిర్న హన్యేత మునేర్యోగమయం వపుః|*
*మద్యోగశ్రాంతచిత్తస్య యాదసాముదకం యథా॥12803॥*
యోగి తన చిత్తమును ఏకీభావముతో నాయందు స్థిరమొనర్చినచో జలములలో నివసించు ప్రాణులకు జలములవలన ఎట్టి హానియు కలుగనట్లు, అతని యోగమయ శరీరమునకు అగ్ని, జలము మొదలగువాటివలన ఎట్టి కీడూ సంభవింపదు.
*15.30 (ముప్పదియవ శ్లోకము)*
*మద్విభూతీరభిధ్యాయన్ శ్రీవత్సాస్త్రవిభూషితాః|*
*ధ్వజాతపత్రవ్యజనైః స భవేదపరాజితః॥12804॥*
శ్రీవత్సాది చిహ్నములతోడను, శంఖ, చక్ర, గదా, శార్ ఙ్గాది ఆయుధములతోడను, అట్లే ధ్వజము, ఛత్రము, చామరములు మొదలగు లాంఛనములతోడను సుసంపన్నమైన నా విభూతులను (నా అవతారములను) ధ్యానించువానికి పరాజయము ఉండదు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి