*16.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*
*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*15.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*ఉపాసకస్య మామేవం యోగధారణయా మునేః|*
*సిద్ధయః పూర్వకథితా ఉపతిష్ఠంత్యశేషతః॥12805॥*
యోగధారణ పూర్వకముగా నన్ను ఇట్లు ఉపాసించునట్టి యోగికి ఇంతవరకును నేను తెలిపిన సిద్ధులన్నియును సమగ్రముగా వశమగును.
*15.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*జితేంద్రియస్య దాంతస్య జితశ్వాసాత్మనో మునేః|*
*మద్ధారణాం ధారయతః కా సా సిద్ధిః సుదుర్లభా॥12806॥*
ఉద్ధవా! బాహ్యేంద్రియములను, అంతఃకరణములను జయించి, ప్రాణాయామపరాయణుడై, చిత్తమును నాయందే ధారణచేసిన యోగికి ప్రాప్తింపని సిద్ధియే యుండదు. అతనికి అన్ని సిద్ధులును సులభముగనే లభించును.
*15.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*అంతరాయాన్ వదంత్యేతా యుంజతో యోగముత్తమమ్|*
*మయా సంపద్యమానస్య కాలక్షపణహేతవః॥12807॥*
భక్తియోగము, జ్ఞానయోగము మొదలగు యోగములను సాధనచేసి సాయుజ్యముక్తిని పొందగోరెడివారికి ఈ సిద్ధులు విఘ్నహేతువులని కొందరు జ్ఞానులు పేర్కొందురు. ఏలయన వీటివలన పరమపదప్రాప్తికి విలంబమేర్పడును.
*15.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*జన్మౌషధితపోమంత్రైర్యావతీరిహ సిద్ధయః|*
*యోగేనాఽఽప్నోతి తాః సర్వా నాన్యైర్యోగగతిం వ్రజేత్॥12808॥*
యోగసాధనవలన ప్రాప్తించెడి సిద్ధులు అన్నియును, ఉత్తమజన్మలు, ఓషధులు, తపశ్చర్యలు, మంత్రోపాసనలు మున్నగువాటివలన గూడ లభించును. కానీ యోగసాధనకు పరమలక్ష్యములైన సాలోక్యాది మోక్షములు మాత్రము నాయందు చిత్తమును పూర్తిగా నిలుపకుండా, ఎట్టి సాధనవల్లనూ లభించుట కల్ల.
*15.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*సర్వాసామపి సిద్ధీనాం హేతుః పతిరహం ప్రభుః|*
*అహం యోగస్య సాంఖ్యస్య ధర్మస్య బ్రహ్మవాదినామ్॥12809॥*
ఈ సకల సిద్ధులకును ప్రాపకుడను (హేతువును), నిర్వాహకుడను, ప్రభుడను నేనే. అంతేగాదు, బ్రహ్మవాదులు ప్రతిపాదించిన ఆత్మోపాసనమైన సాంఖ్యశాస్త్రమునకును, భగవదుపాసనాత్మకమైన యోగమునకును, స్వర్గాది ప్రాపక యజ్ఞాదిరూపధర్మములకును ప్రవర్తకుడను నేనే.
*15.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*అహమాత్మాంతరో బాహ్యోఽనావృతః సర్వదేహినామ్|*
*యథా భూతాని భూతేషు బహిరంతః స్వయం తథా॥12810॥*
సకలజీవుల (ప్రాణుల) యందును నేను అంతర్యామిగా నుందును. కానీ, ఆ దేహములకు మాత్రమే పరిమితుడను (పరిచ్ఛిన్నుడను) గాను. నేను వాటికి బయటకూడ వ్యాపించియుండువాడను. అనగా ఆవరణ రహితుడను (అపరిచ్ఛిన్నుడను). ప్రాణులలోపల ద్రష్టగను, బయట దృశ్యమాన జగత్తుగను, సకలప్రాణుల లోపల, బయట ఉండెడి పంచమహాభూతములవలె వ్యాపించియుండు వాడను.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే పంచదశోఽధ్యాయః (15)*
ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు* అను పదునైదవవ అధ్యాయము (15)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి