16, అక్టోబర్ 2021, శనివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*457వ నామ మంత్రము* 16.10.2021

*ఓం మాత్రే నమః*

అనంతకోటి జీవరాశులకు తల్లి వంటిదైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మాతా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం మాత్రే నమః* అని ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరించు భక్తులకు, ఆ తల్లి వారికి తానొక మాతగా సర్వకాల సర్వావస్థలయందును వెన్నంటి యుంటూ శాంతిసౌఖ్యములు, ధనకనకవస్తువాహనసమృద్ధి, కీర్తిప్రతిష్టలను అనుగ్రహించును.

జగన్మాత అనంతకోటి జీవరాశులను సృష్టించినది గనుక అనంతకోటి జీవరాశులకు తల్లివంటిది గనుక, శ్రీమాత *మాతా* యని అనబడినది. ఆ తల్లి సర్వమంత్రాత్మిక. 

మూలవిద్యనుండి పుట్టిన సప్తకోటి మంత్రములకు స్వరూపిణియై విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణి సర్వమంత్రాలకు మాతృక. అందుచే అమ్మవారు *మాతా* యని అనబడినది.

అన్ని విద్యలకూ ఆదివిద్యను మూలవిద్య అందురు. అటువంటి మూలవిద్యనుండి ఉద్భవించిన సప్తకోటి మహామంత్రాలకు మంత్రాధ్యయని అనిపేరు. ఇట్టి మంత్రాధ్యయనియే పరమేశ్వరి స్వరూపము.  

మంత్రము అంటే *మననాత్ త్రాయతే ఇతి మంత్రః* - దేనిని మననం చేయుకొలదీ రక్షణ చేయగలదో దానిని మంత్రం అన్నాము. 

మంత్రం అనేది బీజాక్షరముల సముదాయముతో ఏర్పడినది. ఉదాహరణకు మర్రిచెట్టు స్థూలపదార్థమయితే ఆ మర్రిచెట్టుకు మూలమయిన బీజము (మర్రివిత్తనము) సూక్ష్మమయినది. ఈ సూక్ష్మమయినదే మంత్రము. 

మంత్రము అనేది బీజాక్షరము గాని బీజాక్షరముల సముదాయముగాని అవుతుంది అనుకున్నాంగదా! . ఉదాహరణకు బాలాత్రిపురసుందరీ మంత్రములో *ఐం క్లీం సౌ* తీసుకుంటే ఇందులో మొదటి బీజము *ఐం* ఈ బీజం జపిస్తే వాక్ వస్తుంది. గనుక ఈ *ఐం* అనేది వాగ్బీజము. తరువాత *క్లీం* ఇది కామరాజ బీజము. అనగా కోరిన కోరికలు తీర్చు బీజము. ఈ బీజం జపిస్తే కోరికలు సిద్ధిస్తాయి. మూడవది *సౌ* అనగా శక్తి బీజము. ఈ బీజం జపిస్తే మనసుని, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. 

ఈవిధమైన బీజములు మూలవిద్యలో ఏడు కోట్లు ఉన్నాయి. వీటన్నిటికీ పరమేశ్వరి తల్లి వంటిది గనుక అమ్మవారు *మాతా* యని అనబడినది.

జగన్మాత మూలప్రకృతిస్వరూపిణి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహములు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, పంచభూతములు, జీవకోటి ఏర్పడ్డాయి. వీనిలో దేనిని ఆరాధించిననూ, జగన్మాతయే మూలమగుటచే,ఆ తల్లి మూలప్రకృతియనియు అన్నాము. ఏ మంత్రముతో ఏ దేవతను ఆరాధించిననూ, అన్నిటికీ శ్రీమాతయే మూలము అనగా మాతృక గనుక ఆ తల్లి *మాతా* యని అనబడినది.

సర్వమంత్రములలోను ఆ తల్లి మాతృకాక్షరస్వరూపురాలైనది గనుక *మాతా* యని అనబడినది. నామ పారాయణమునందు దశమీతిథి నిత్యామంత్రమునకు మాత అను నామము ఉండుటచే పరమేశ్వరి *మాతా* యని అనబడినది.

లయకాలమునందు సృష్టి అంతయు ఆ తల్లి గర్భమునందు నిక్షిప్తమై, మరల సృష్టి కార్యమునందు ఆ తల్లి గర్భమునుండి బయల్వెడలుటచే, సకల సృష్టికి తల్లియైనది గనుక అమ్మవారూ *మాతా* యని అనబడినది.

బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అనవారు అష్టమాతృకలు. ఈ అష్టమాతృకల స్వరూపిణియై పరమేశ్వరి అలరారుతున్నది గనుక జగన్మాత *మాతా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మాత్రే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*458వ నామ మంత్రము* 16.10.2021

*ఓం మలయాచల వాసిన్యై నమః*

మలయపర్వత నివాసిని అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మలయాచలవాసినీ* యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం మలయాచల వాసిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులు పిల్లపాపలతోను, సిరిసంపదలతోను, శాంతిసౌఖ్యములతోను, కీర్తిప్రతిష్టలతోను చల్లగా ఉందురు. 

పరమేశ్వరి మలయ పర్వత నివాసిని యగుటచే *మలయాచలవాసినీ* యని అనబడినది. ఈ అమ్మవారు మలబారు ప్రాతంలో  మలయ (చందన) వనంలో భగవతిగా పూజింపబడు దేవిస్వరూపురాలు. మలయజము అనగా చందనవృక్షము. చందనవృక్షములుగల పర్వతము మలయాచలము అందురు. పరమేశ్వరికి చందనవృక్షములనినను, కదంబవృక్షములనినను అంతులేని ప్రీతి. ఆ తల్లి అందుకనే సుమేరు పర్వతంపై గల చందనవృక్షముల నడుమ అమ్మవారు ఉంటుంది గనుక అమ్మవారు *మలయాచలవాసినీ* అని యనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మలయాచల వాసిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *

కామెంట్‌లు లేవు: