16, అక్టోబర్ 2021, శనివారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అన్నదానం..అభిప్రాయబేధం..*


ఆషాఢమాసం లో వచ్చే పౌర్ణమి ని గురుపౌర్ణమి గా వ్యవహరిస్తారని అందరికీ తెలుసు..పది పన్నెండేళ్ల క్రితం దాకా..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద గురుపౌర్ణమి నాడు పెద్దగా భక్తులు వచ్చేవారు కాదు..మొగలిచెర్ల గ్రామస్థులు కొద్దిమంది మరి కొద్దిమంది ఇతర భక్తులూ వచ్చేవారు..మేము కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసేవాళ్ళం..క్రమంగా ఒక్కొక్క సంవత్సరం గడిచేకొద్దీ..భక్తుల రాక ఎక్కువైంది..గురుపౌర్ణమి నాడు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేయాలని దశాబ్దం క్రితం నిర్ణయం తీసుకున్నాము..అందుకు తగ్గ ఏర్పాట్లనూ చేసుకున్నాము..శ్రీ స్వామివారి కృప వలన ఎన్నడూ ఏ ఆటంకమూ లేకుండా గురుపౌర్ణమి నాడు అన్నప్రసాద వితరణ జరిగిపోతున్నది..క్రమంగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు కూడా భాగస్వాములు కాసాగారు..


ఇలా ఉండగా..ఒక సంవత్సరం.."గురుపౌర్ణమి నాడు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నానండీ..మా అబ్బాయికి ర్యాంక్ వస్తే శ్రీ స్వామివారి వద్ద అన్నదానం చేయాలని సంకల్పించాను..ఆ స్వామి దయవల్ల అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది..ఒక నెల క్రితమే అనుకున్నాను కానీ ఇంట్లో కుదరక, అప్పుడు చేయలేదు..ఎలాగూ గురుపౌర్ణమి దగ్గరలోనే వుందికదా..ఆరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు భరిద్దామని అనుకున్నాను.." అన్నారు గుంటూరు నుంచి వచ్చిన కృష్ణారెడ్డి గారు..కానీ ఆ సంవత్సరం గురుపౌర్ణమి కి అన్నదానం చేయడానికి అంతకు ముందు వారమే మరొక భక్తుడు మాకు చెప్పివున్నాడు.. పైగా అన్నదానానికి కావాల్సిన సరుకులకోసం కొంత నగదు కూడా ఇచ్చి వెళ్ళాడు..ఆమాటే కృష్ణారెడ్డి గారికి చెప్పాము.."మీరు గురుపౌర్ణమి తరువాత వచ్చే శని, ఆదివారాల్లో ఏదో ఒక రోజు అన్నదానం చేయండి.." అని తెలిపాము..కానీ కృష్ణారెడ్డి గారు వినలేదు..తనకు ఆరోజు తప్ప, మరోరోజు వీలుకాదనీ..తాను గురుపౌర్ణమి నాడే అన్నదానం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాననీ మాతో చెప్పారు..ఒకవేళ మేము కాదంటే..శ్రీ స్వామివారి మందిర సమీపం లోనే ఆరోజు అన్నదానం చేస్తానని చెప్పారు..ఒకే స్థలంలో ఇద్దరు విడి విడిగా అన్నదానం చేయడం అంతగా బాగుండదని మా భావన..


ఏమి చేయాలో పాలుపోలేదు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని.."స్వామీ..చిన్న విషయమే కానీ..ముందు ముందు ఇటువంటి సంఘటనలు తరచూ జరిగితే..ఒక నియంత్రణ లేకుండా పోతుంది..మీరే పరిష్కారం చూపాలి.." అని వేడుకున్నాను..


అనవసరంగా కృష్ణారెడ్డి గారు పంతానికి పోతున్నారనిపించింది..సరే..ఈ రెండో వ్యక్తికి ఈ మాట చెప్పి చూద్దాం అని..ఆయనతో చెప్పాము.."నేను మీకు ముందే చెప్పి ఉంచాను కదండీ..అయినా సరే..శ్రీ స్వామివారి వద్ద నేను పంతానికి పోను..మీకు ఇబ్బంది గా అనిపిస్తే..నేను ఆ ప్రక్క ఆదివారం నాటి మధ్యాహ్నం అన్నదానానికి ఈ సరుకులు ఉపయోగిద్దాము..నా వల్ల స్వామివారి వద్ద ఎటువంటి అసౌకర్యమూ జరుగకూడదు.." అని పెద్ద మనసుతో చెప్పారు..మేము ఊపిరి పీల్చుకున్నాము..


సరిగ్గా గురుపౌర్ణమి కి ఒక్కరోజు ముందు..కృష్ణారెడ్డి గారు హడావిడిగా ఫోన్ చేశారు.."ప్రసాద్ గారూ..నేను పట్టుబట్టి గురుపౌర్ణమి నాడే అన్నదానం చేస్తానని చెప్పాను..కానీ నిన్న రాత్రి నుంచి నాకు మనసులో ఏదో తెలీని అశాంతి కలుగుతున్నది..రేపటి అన్నదానానికి వేరొకరు ఉన్నారని అన్నారు కదా..మీరు ఆయనకు నచ్చచెప్పుకొన్నారని తెలిసింది..వారి నెంబర్ వుంటే నాకు ఇవ్వండి....నాకెందుకో నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని అనిపిస్తోంది..దానివల్లనే నాకు ఈ ఆందోళన అని అనిపిస్తున్నది..ఆయనకు నేను ఫోన్ చేసి..క్షమాపణలు చెప్పుకుంటాను..రేపటి రోజు ఆయన చేతులమీదుగానే అన్నదానం జరిపించమని వేడుకుంటాను..ఆ పై శని, ఆదివారాలు రెండు పూటలూ నేనే అన్నదానం చేస్తాను.." అన్నారు..వారి ఫోన్ నెంబర్ కృష్ణారెడ్డి గారికి ఇచ్చాను..మరో అరగంట కల్లా ఆ భక్తుడు ఫోన్ చేసి..తనతో కృష్ణారెడ్డి మాట్లాడారనీ..తాను ఉదయానికే వచ్చి..అన్నదానానికి ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పారు..


ఆ గురుపౌర్ణమి రోజు ఎటువంటి అభిప్రాయబేధాలూ లేకుండా అన్నదానం జరిగింది..విశేషమేమంటే..కృష్ణారెడ్డి గారు స్వయంగా ఆ అన్నదానం లో పాల్గొని..వడ్డన కూడా చేశారు..ఆ సాయంత్రం..మాతో మాట్లాడుతూ..ఇప్పుడు తన మనసులోని ఆందోళన తగ్గిపోయిందనీ..తాను మొండితనానికి పోకుండా శ్రీ స్వామివారు ఆపారని చెప్పారు..ఆ ప్రక్క శని, ఆదివారాలు కృష్ణారెడ్డి గారు శ్రీ స్వామివారి మందిరం వద్ద సంతోషం తో అన్నదానం చేశారు..


మేము ఎక్కువగా ఊహించుకున్న సమస్య..చాలా సులభంగా తీరిపోయింది..మౌన సాక్షి మాత్రం శ్రీ స్వామివారే..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: