16, ఏప్రిల్ 2023, ఆదివారం

ఓంకార (ప్రణవ) సాధన*

 .

       *ఓంకార (ప్రణవ) సాధన*


      "ఓం" అనే ప్రణవమే ధనుస్సు. లోనున్న జీవాత్మే బాణము. పరమాత్మయే లక్ష్యం. నిశ్చలమైన మనస్సుతో లక్ష్యాన్ని చేరు. లక్ష్యంతో ఐక్యమై నిన్ను నువ్వు అధిష్టించి పరిపాలించుకో.


      "ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరమ్ మా మనుస్మరమ్" 


      ఓం అనే ఏకాక్షరమే బ్రహ్మం . అది నాద స్వరూపమగును, జ్యోతి స్వరూపం అవుతుంది జీవుని యందు స్థితి చెంది ఉన్నది. అదే "నేను" అనే ప్రజ్ఞ. అదే భావంగా, వాక్కుగా మరియు ప్రాణంగా, శ్వాసగా వ్యక్తం అవుతోంది. అంటే తనను తాను ఉచ్చరించుకొంటోంది. దాని యందు అనుస్మరణం సిద్దిస్తే తానక్షరుడగును.


      అన్ని వేదాలు ఘోషించే గమ్యం, అన్ని తపస్వులు ఉధ్ఘాటించే గమ్యం, సమస్త సాధువుల ఏకైక లక్ష్యం ఓంకారమే. ఓంకార బ్రహ్మం యొక్క నాదస్వరూపమే. అన్ని శబ్దాలకు, భావములకు ఓంకారమే మూలము. కాబట్టి "ఓంకారాన్ని" నిరంతరం జపం చెయ్యి. 


       ఓంకారం ఏకాక్షరముగా త్రిగుణాతీతం. అందులోని "అ" కారం "ఉ" కార, "మ" కారములు త్రిగుణములు. అవే సృష్టి కారకములు. త్రిగుణాతీత శుధ్ధచైతన్యంగా తనను తాను తెలియుట. ఓంకారము ఉచ్చరిస్తూ అది తానే అని భావన చేయాలి. ఇదే అనుస్మరణం కావాలి.


       ధనము, పదవి, కుటుంబంపై ఆధారపడే వారు సుఖ దుఃఖాలకు లోను అవుతాడు. శరీరం పై ఆధారపడే వారు కూడా అలాగే దుఃఖితులు అవుతారు. ఇవి అన్నీ తనపై ఆధారపడి ఉన్నాయి. తనపై ఆధారపడే వానిపై ఆధారపడే వారు అవివేకి. తాను ఓంకారం పై ఆధారపడి ఉన్నాను అని తెలిసి దానిపై ఆలంబనగా అనుస్మరణం చేయడం సర్వోత్కృష్టం.


       ఓంకారం మాత్రమే అక్షరం (శాశ్వతమైనది). దాని నుండి మిగిలిన అక్షరాలు జన్మిస్తాయి. ఈ అక్షరాలు తెలిసినవానికి తాను అక్షరుడని తెలుస్తుంది. అదే ఉన్నతోన్నతమైన సిద్ది. ఈ సిద్ది పొందిన వారికి సమస్తం సిద్దించగలదు. అందుకే ఓంకారాన్ని నిరంతరం అనుస్మరణం చేయమని భగవానుడు బోధిస్తున్నాడు.


       ఓంకారాన్ని అనుస్మరణ రూపంలో ఆశ్రయిస్తే నువ్వు ఎన్నో మార్పులకు లోను అవుతావు. శరీరం యొక్క, పుట్టుక, బుద్ది, నాశము అను మార్పులను కూడా గమనించగల సనాతనుడుగా నిన్ను నువ్వు తెలుసుకోగలవు. సమస్త మార్పుల యందు మార్పు చెందని వానిగా నిన్ను నువ్వు తెలుసుకో గలవు. నువ్వు అక్షరుడవుగా, శాశ్వతంగా నిలువ గలవు. కాబట్టి ఓంకారాన్ని అనుస్మరణ చేయాలి.


       ఓంకారమే బ్రహ్మం. అది వ్యక్త బ్రహ్మం. దానినే ఆత్మ అంటారు. అనుస్మరణచే అది నువ్వే అని తెలియగలవు. అప్పుడు నీ నిజమైన మహిమను నువ్వు తెలుసుకుంటావు. లోపల బయటా శుచి నేర్చుకుంటూ ఓంకారాన్ని నీ యందు జరుగుతున్న స్పందనమును గుర్తించి ధ్యానం చేయాలి.


      ఓంకారాన్ని నిరంతరం అనుస్మరణ మార్గంలో తెలిసిన వారు కదలకుండానే దూర ప్రయాణం చేయగలడు. ప్రయాణిస్తూ స్థిరమైన స్థితిలో ఉండగలడు. కదిలే దానిలో కదలని వాడుగా, కదలని దానిలో కదిలే వాడుగా తన్ను తాను తెలుసుకోగలడు. 


      ఓంకారం తెలియాలంటే ఓంకారాన్ని నిరంతరం జపం చేయడమే మార్గం. ఆ స్మరణం అనుస్మరణం కావాలి. అంటే నిరంతరం గా జరగాలి. నిజానికి ఓంకారం నీ యందు నిరంతరం జరుగుతూనే ఉంది. దాన్ని ప్రశాంతంగా గమనించడమే నీ సాధన. వైఖరితో ఉచ్చరించడం ప్రాధమిక సాధన. జరుగుతున్న ఓంకారాన్ని గమనించడం ఉత్తమ సాధన. అది నువ్వే అని తెలియడం సిద్ది. అప్పుడు నువ్వు నీ శరీరం కాదు అని కూడా తెలుస్తుంది. ఇదే ముక్తి.

1 కామెంట్‌:

సుబ్రహ్మణ్యం నిష్ఠల. చెప్పారు...

సాధన చేస్తే ఫలితం ఉంటుంది.