🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 98*
కాశీ క్షేత్రము నుంచి శ్యామశాస్త్రి కబురు పంపించాడు. 'చాణక్యుని మాతృమూర్తి దేవకి తీవ్ర అస్వస్థతతో మంచము పట్టివున్నారని, కుమారుని కడసారి చూపు చూడవలెనని తపించుచున్నదని' వార్తాహారుడు విన్నవించాడు.
ఆ వార్త విని చాణక్యుడు తీవ్ర విచారగ్రస్తుడయ్యాడు. దుఃఖవేదనను నిగ్రహించుకొనుటకు తీవ్ర ప్రయత్నం చేశాడు.
ఆర్యుని మనోవేదనని చూడలేక తలడిల్లిపోయారు మురా, చంద్రగుప్తులు. వారు అనేక విధాల ఆర్యునికి హితధైర్యవచనాలు చెప్పారు.
"కాశీరాజుకి తక్షణం వర్తమానం పంపించి ఆర్యని మాతృమూర్తిని రాజవైద్యుల పర్యవేక్షణలో పల్లకిలో పాటలీపుత్రమునకు రప్పిస్తానని" చంద్రుడు చెప్పగా, చాణక్యుడు తల అడ్డుగా తిప్పి "కాశీ పుణ్యక్షేత్రమునందే కన్ను మూయవలెనని మా అమ్మగారి కోరిక. ఈ పరిస్థితిలో ఆమెను ప్రయాణం చేయించుట యుక్తం కాదు" అని చెప్పి తానే కాశీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తన వెంట వస్తానన్న చంద్రుని వారించి, వెంట పంపుతానన్న సైనిక పరివారాన్ని వలదని చెప్పి తానొక్కడే అశ్వారుడుడై కాశీకి బయలుదేరాడు చాణక్యుడు.
మూడురాత్రింపగళ్లు సుదీర్ఘ ప్రయాణానంతరం కాశీ చేరుకొని శ్యామశాస్త్రి గృహాన్ని చేరుకున్నాడు ఆర్యుడు. వీధి ద్వారకముకడనే కాశీరాజు హృషికేశవర్మ విచారగ్రస్థ వదనముతో చాణక్యునకు స్వాగతం పలికాడు. రాజవైద్యులు ఆ మరుక్షణమే చాణక్యుని దర్శించి పెదవి విరిచారు.
శ్యామశాస్త్రి దుఃఖేద్వేగాన్ని బలవంతంగా బిగబట్టుకుంటూ చాణక్యుని ఇంటిలోపలికి తోడ్కోని పోయాడు. చాణక్యుని అర్ధాంగి గౌతమి గుడ్లనీరు కక్కుకుంటూ ఏడాది చంటిబిడ్డ అన్నపుర్ణను చంకనేసుకుని అతనికి ఎదురొచ్చింది.
అందరి చూపులను తప్పించుకుంటూ పొంగిపొర్లుతూ బైటికి తన్నుకు రావాలని ప్రయత్నిస్తున్న దుఃఖాన్ని గొంతులోనే బిగబెట్టుకుంటూ కన్నతల్లి వైపు దీనంగా, బాధగా, ఆర్ద్రతగా చూసాడు చాణక్యుడు. బ్రాహ్మణ చాదస్తానికి తగినట్టు కుక్కిమంచంలో శుష్కించిన దేహంతో పడివుండి అంతిమక్షణాల కోసం నిరీక్షిస్తోంది అతని మాతృమూర్తి దేవకి.
"నారాయణా.... నారాయణా..." గొణుగుతున్నట్లు హీనస్వరంతో నారాయణ నామస్మరణ చేస్తోంది దేవకి. ఎక్కడో దక్షిణాంధ్రలో పుట్టి... వేదవేదాంగవేత్త అయిన చణకుల వారికి ధర్మపత్ని అయి... అకుంఠిత విష్ణుభక్తి తత్పరురాలై... ఆ మహావిష్ణువుని స్వప్నంలో సాక్షాత్కరింపజేసుకుని... ఆయన వరప్రసాదంగా కారణజన్ముడైన చాణక్యునికి జన్మనిచ్చి... ఆ కొడుకు భవిష్యత్తుకోసం తక్షశిలకు చేరి, ఆ తదుపరి కాశీ క్షేత్రాన్ని చేరుకొని... కన్నకొడుకు కళ్యాణాన్ని కళ్లారా చూసి... మనమరాలి ముద్దు ముచ్చటలతో మురిసిపోయి... అలిసిపోయిన ఆ ముదసలి ప్రాణి ... ప్రాపంచిక స్మృతి, శృతిలను అధిగమించి... నారాయణ నామస్మరణ... తన జీవితాంతం స్మరిస్తూ వచ్చిన విష్ణునామ చేస్తూ....
"అమ్మా.... నేనొచ్చాను..." పలకరించాడు చాణక్యుడు తల్లి పక్కన కూర్చుంటూ డగ్గుత్తికతో.... దుఃఖంతో అతని గొంతు అర్చుకుపోతోంది. కన్నతల్లికి కడసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు కన్నీళ్ళతో....
"అమ్మా .... నేనమ్మా .... నేను... నీ విష్ణుగుప్తుడ్ని...." దుఃక్కోద్వేగంతో పిలిచాడు చాణుక్యుడు.
ఆ పిలుపు ఎక్కడో నూతిలోంచి హీనస్వరంతో పిలిచినట్లు వినిపించింది దేవకికి... నారాయణ నామస్మరణ చేస్తున్న ఆవిడలో స్వల్పకదలిక...
"నేనమ్మా... నీ విష్ణుని...." దుఃఖంతో కాస్త గట్టిగా పిలిచాడు చాణక్యుడు, అతడి చెంపల మీదుగా కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయి. దేవకి ఆ పిలుపుకి స్పందించింది. నెమ్మదినెమ్మదిగా కన్నురెప్పలు పైకెత్తింది.
"అమ్మా .... నేనమ్మా... నేను..." ఆశగా, ఆరాటంగా తల్లి ముఖంలోకి చూశాడు ఆర్యుడు దుఃఖోద్వేగంతో.
దేవకి కనురెప్పల్ని మరింత విశాలం చేసింది. తన ఎదురుగా ఉన్న చాణక్యుని వైపు తేరిపార చూడబోయింది. అప్పుడు సంభవించిందో అద్భుత పరిణామం...
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి