*నవ పురాణం - 38 వ అధ్యాయం*
🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷
*బుధగ్రహ జననం - 1*
ఆశ్రమంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వరుసలుగా కూర్చున్న విద్యార్థులు. వేదమంత్రాలను వల్లె వేస్తున్నారు. వాళ్ళపైన చెట్ల రెమ్మల్లో దాక్కున్న చిలుకలు వాళ్ళను అనుకరిస్తూ మంత్రాలు పలుకుతున్నాయి.
ఆగకుండా వినవస్తున్న పక్షుల కిలకిలరావాలూ , అప్పుడప్పుడు వినవచ్చే నెమళ్ల అరుపులూ ఆశ్రమ వాతావరణానికి నేపథ్య సంగీతం అందిస్తున్నాయి.
వల్లెవేస్తున్న విద్యార్థుల స్వరాన్ని ఏకాగ్రతతో గమనిస్తూ , ఆకర్షిస్తున్న బృహస్పతి కనుబొమలు ఎవరో కదిలించినట్టు కదిలి - ఒకదానికొకటి దగ్గరవుతూ - మధ్యలో కలుసు కుంటున్నాయి. ఆయన చూపులు - వయ్యారంగా , అందంగా మెలికలు తిరుగుతూ - పచ్చిక తీసుకున్న పాపటలా కనిపిస్తున్న కాలిబాట మీద నడుస్తూ వస్తున్న యువకుడి మీద కేంద్రీకృతమయ్యాయి.
చక్కటి శరీర నిర్మాణం. మెరిసిపోతున్న శరీర వర్ణం. చూపుల్ని ఆకర్షించి , పట్టివుంచే అందం. మగవాళ్లకు కూడా మళ్లీ చూడాలనిపించే చక్కదనం. ఎవరా యువకుడు ? ఇంద్రలోకంలో కూడా ఇంత అందగాడు. తారసిల్లలేదే !
తన వైపే చూస్తూ , ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్న యువకుణ్ణి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు బృహస్పతి. యువకుడు బారులుగా కూర్చున్న విద్యార్థుల వెనక నిలబడి , వినయంగా బృహస్పతి వైపు చూస్తూ ఉండిపోయాడు.
*"ఎవరు నాయనా ?"* బృహస్పతి ప్రశ్నించాడు.
*“మీ దర్శనానికి వచ్చాను...”* చంద్రుడు వినయంగా అన్నాడు.
బృహస్పతి చేతిని పైకెత్తుతూ , శిష్య బృందాన్ని చూశాడు. శిష్యుల పఠనం ఆగిపోయింది. అలవాటు కొద్దీ చెట్టు మీద చిలుకలూ మౌనం ధరించాయి.
*"ఇలా దగ్గరగా రా !”* బృహస్పతి అన్నాడు. శిష్యుల తలలు ఒకసారి వెనుకకు తిరిగాయి. అందరి కళ్ళూ ఆ యువకుడి మీద నిలిచిపోయాయి. యువకుడు బృహస్పతి ముందు ఆగి , వినయంగా చూశాడు.
*"అనసూయ , అత్రిమహర్షి దంపతులు పుత్రుణ్ణి... నా పేరు చంద్రుడు...”.*
*“ఓహ్...ఆత్రేయుడివా !”* బృహస్పతి అడ్డు తగుల్తూ అన్నాడు.
*“చిత్తం. నా తండ్రిగారి ఆదేశం మేరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం మీ సన్నిధికి వచ్చాను. దయచేసి...”*
*"అలాగా !”* బృహస్పతి మళ్ళీ అడ్డొస్తూ అన్నాడు. అత్రి అనసూయ దంపతుల పుత్రుడిది అసామాన్య సౌందర్యం !
*"దయచేసి విద్యార్థిగా స్వీకరించి , విద్యాదానం అనుగ్రహించండి !"* అంటూ చంద్రుడు బృహస్పతికి పాదాభివందనం చేశాడు..
*"సుఖీభవ !"* బృహస్పతి దీవిస్తూ అన్నాడు.
*చంద్రుడు లేచి , ఆశ్చర్యంగా బృహస్పతి వైపు చూశాడు. "గురుదేవా ! నేను.... విద్యాదానం కోసం వచ్చాను..."*
బృహస్పతి కళ్ళు చిట్లించాడు. తన ఆశీర్వాదంలో సందర్భ శుద్ధీ , సమయ స్ఫూర్తీ , ఔచిత్యమూ లోపించాయని చంద్రుడు పరోక్షంగా గుర్తు చేస్తున్నాడు ! ఆయన మొహం మీద చిరునవ్వు మెరిసింది.
*"ఔను , విద్యార్థికి సుఖం ఉండదు. ఉండకూడదు !"* బృహస్పతి తనను దిద్దుకుంటూ అన్నాడు. కుడిచేతిని పైకెత్తి చంద్రుడి ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. *"సకల విద్యా ప్రాప్తిరస్తు !"*
*“ధన్యోస్మి !"* చంద్రుడు పునరభివాదం చేస్తూ అన్నాడు.
*"చంద్రా ! అనుష్టానాలు పూర్తి చేసి , మార్గాయాసం తీర్చుకో... తదనంతరం...”*
*"అనుష్ఠానాలు మార్గంలోనే పూర్తి చేసుకున్నాను. ఈ ప్రశాంత వాతావరణంలో అడుగు పెట్టగానే మార్గాయాసం మాయమైపోయింది గురుదేవా !"* ఆశ్రమాన్ని కలియజూస్తూ అన్నాడు చంద్రుడు.
బృహస్పతి చిరునవ్వు నవ్వాడు. *"సంతోషం నాయనా ! ఆ... అత్రి మహాశయులు కుశలమే కదా !"*
*"నాన్నగారు కుశలంగా ఉన్నారు...”*
*"సాధ్వి అనసూయా దేవి...”*
*"నాన్నగారి సేవే అమ్మకు సత్కాలక్షేపం గురుదేవా !"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు.
*"ఆ ఆదర్శ దంపతులు అదృష్టవంతులు ! వాళ్ళ పుత్రుడైన నువ్వు అదృష్టవంతుడివి ! సరే... చంద్రా... అలా కూర్చో... సాయంత్రం నిన్ను ప్రత్యేకంగా పరీక్షిస్తాను. నువ్వు ఆర్జించిందీ , నీ వద్ద ఉన్నదీ ఏదో తెలుసుకుంటాను ! లేనిదీ , అవసరమైనదీ నిర్ణయిస్తాను !”* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. ఆయన చూపులు ఆశ్రమం వైపు తిరిగాయి.
ఒక యువతి , నీటి పాత్రతో చకచకా వచ్చి , చంద్రుడికి తాగడానికి నీళ్ళు అందించింది వినయంగా.
*"ఆశ్రమ పరిచారిక పుంజికస్థల !"* బృహస్పతి పరిచయం చేశాడు. *"విద్యార్థుల విడిది గృహాల్ని చక్కగా చూసుకుంటుంది. ఆశ్రమంలో చేదోడు వాదోడుగా ఉంటుంది !"*
చంద్రుడు దాహం తీర్చుకుని పాత్ర పుంజికస్థలకు ఇచ్చివేశాడు. విద్యార్థుల వరుసల వెనుక వైపుకి అడుగులు వేశాడు. రెండు కళ్ళు చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్నాయి.
అవి బృహస్పతి కళ్ళు కావు !
అవి ఏ విద్యార్థి కళ్ళూ కావు !
అవి ఆశ్రమ గవాక్షంలోంచి చూస్తున్న కళ్ళు ! అవి కలువ రేకుల్లాంటి విశాలమైన కాటుక కళ్ళు !
అవి బృహస్పతి సతి కళ్ళు !
అవి మదవతి తార కళ్ళు !
బృహస్పతి శయనాగారంలోకి వచ్చాడు. తార మంచం మీద కూర్చుని ఉంది. వాతాయనంలోంచి దూసుకొస్తున్న గాలి , ఆమె పైట చెంగుతో ఆడుకుంటోంది. మధురమైన పూల సుగంధాన్ని మోసుకొస్తున్న గాలి శయనాగారమంతా వ్యాపిస్తోంది.
*"ఇంకా మేలుకునే ఉన్నావా , తారా ?"* ప్రశ్నించాడు బృహస్పతి.
భర్త రాకను అప్పుడే గమనించినట్లు తార తటాలున లేచి , నిలబడింది. “నిద్ర రావడం లేదు..." అందామె.
బృహస్పతి మంచం మీద నడుం వాల్చాడు విశ్రాంతిగా , అప్రయత్నంగా ఆయన చెయ్యి తార చేతిని పట్టుకుంది. తార , మంచం అంచున కూర్చుంది. ఆమె కళ్ళు బృహస్పతి ముఖంలోకి చూశాయి.
*"ఆ నూతన విద్యార్థి... చంద్రుడు..."* అంటూ ఏదో చెప్పబోయింది తార. *"చంద్రుడా ?!"* బృహస్పతి ప్రశ్నించాడు.
*"ఆ... అతని పేరు అదే కదూ... మన విద్యార్థులందరిలోనూ , అతనే పెద్దవాడ నిపిస్తోంది... పెద్దవాడేగా , స్వామీ ?"* అడిగింది.
*“చంద్రుడు వయసులోనే కాదు , తారా ! వినయంలోనూ , విద్యలోనూ , బుద్ధిలోనూ పెద్దవాడే !"* బృహస్పతి నవ్వుతూ అన్నాడు.
*"అలాగా...".*
*"చంద్రుడు ఎవరనుకుంటున్నావు ? బ్రహ్మ మానస పుత్రుడు అత్రిమహర్షికీ , సాధ్వీమణి అనసూయకూ అనుంగు పుత్రుడు !"*
*"తల్లిదండ్రులిద్దరూ గొప్పవారేనే !"* తార చిరునవ్వుతో అంది..
*"ఔను ! అత్రిమహర్షి చంద్రుణ్ణి ప్రత్యేకంగా నా వద్దకు పంపించారు. శిష్యరికం చేయమని !"* బృహస్పతి సగర్వంగా అన్నాడు.
*"పోనీ లెండి ! మీ శిష్యుల్లో యువకుడు ఉండడం మంచిది ! ఇప్పుడున్న వాళ్లంతా , చిన్నపిల్లలు ! నది నుండి నీళ్ళు తీసుకురాలేకపోతున్నారు !"* తార నర్మగర్భంగా అంది.
*"స్వామీ... ఆ చంద్రుడి చేత నదీజలం తెప్పించుకోవచ్చుగా !"*
బృహస్పతి నవ్వాడు. *"అడగాలా , తారా ! గురుకుల వాసం చేసే విద్యార్థులకు గురుశుశ్రూష ఎంత ముఖ్యమో , గురుపత్నీ సేవ కూడా అంతే ముఖ్యం !"*
తార అసంకల్పితంగా తృప్తిగా నిట్టూర్చింది.
*"పడుకో తారా ! మళ్లీ వేకువజామునే లేవాలి !"* బృహస్పతి ఆమె చేతిని సున్నితంగా లాగుతూ అన్నాడు.
తార మంచం దిగి నిలబడింది. సున్నితంగా ఆయన పట్టులోంచి తన చేతిని విడిపించుకుంది. *"మీరు పడుకోండి ! ఎందుకో నిద్ర రావడం లేదు. కాసేపు తోటలో తిరిగి... త్వరగా వచ్చేస్తా లెండి !"* అంటూ తార భర్త మాట కోసం ఎదురు చూడకుండా వెలుపలికి నడిచింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి