28, ఆగస్టు 2023, సోమవారం

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-31

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-31🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁



‘నీవు వటువువా! గృహస్థువా! సన్యాసివా! యతివా! ఎవరికి కావాలి ? నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టావా, లేదా! 

అలా పెడితే నీ వెంట పరిగెతి రావడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు.’’ అంటారు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో. 


అన్నమాచార్యుల వారు అదే భావనతో కీర్తన చేస్తూ..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి రమ్మన్న చోటికి వచ్చి అంతగా కోర్కె తీర్చినవాడివే’’ అంటూ తరువాత చరణంలో ‘‘దొమ్ములు సేసినయట్టి తొండమాన్‌ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అంటారు. 



కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొండలలో కొలువై ఉండటమే కాదు, కొండలంతవరాలను గుప్పే దొడ్డదొర అని అన్నమయ్య ఈ పాటలో కీర్తిస్తున్నారు. 


రాజు అర్పించిన బంగారు పూలను వద్దని, మహాభక్తుడైన కురువనంబి (కుమ్మరిదాసు) అర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించిన ఉన్నతోన్నతమూర్తి వేంకటేశ్వరుడు! ఆశ్రితుడైన తొండమాన్ చక్రవర్తికి శంఖచక్రాలను అనుగ్రహించినవాడు శ్రీనివాసుడు! అనంతాళ్వార్ల వారి పుష్పకైంకర్యాన్ని స్వీకరించి అనుగ్రహించినవాడు స్వామి! 

తిరుమలనంబిని బ్రోచినవాడు! భక్తుడైన తిరుకచ్చినంబిని కంచి నుండి తన వద్దకు రప్పించుకున్నవాడు! అట్టి వేంకటేశ్వరుడు భక్తులైన మనందరినీ అపారమైన కరుణతో పాలిస్తున్నాడు అని ఆచార్యులవారు అంటున్నారు.



కుమ్మరిదాసుకు మోక్షమొసగుట

శ్రీవేంకటాచలమునకు నాలుగు మైళ్ళ దూరములో ‘‘గుర్వాకము’’ అనే పల్లెగ్రామము వుంది! ఆ పల్లెలో భీముడనే కుమ్మరి అతని భార్య మాలినితో నివసిస్తున్నాడు. ఆ నిరుపేద కుమ్మరి దంపతులు పరమభక్తులు.



భీముడు మన్ను త్రొక్కినా, కుండలు చేసినా శ్రీనివాసుణ్ణే నిరంతరం జపిస్తూండే వాడు. వారికి తమ వృత్తి, వేంకటేశ్వరుని నామస్మరణ తప్ప మరో ఆలోచనగానీ మరో పనిగానీ లేదు. మట్టితో సింహాసనము చేసి దాని మీద మట్టితో చేసిన వేంకటేశ్వరస్వామిని పెట్టి, మట్టి పువ్వులతో పూజించేవారు. ఒక్కొక్కసారి శ్రీస్వామివారి నామస్మరణలో శరీరము మరచిపోయేవారు.



భీముడి భక్తి విశేషాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయముగా తన భక్తుడైన తొండమానునకు చెప్పాడు.

శ్రీనివాసుడు భోజన ప్రియుడు. భక్త జన ప్రియుడు.. ఘుమ ఘుమ లాడే పిండి వంటలు వడ్డించకపోయినా పర్లేదు. 


స్వామి వారి కృపకు పాత్రులు కావాలంటే చిడికెడు ప్రసాదం పెట్టినా చిన్న బుచ్చుకోరు కానీ శ్రీవారు భక్తి రసం తగ్గితే మాత్రం అస్పలు ఒప్పుకోరు. 


ఈ నేపథ్యంలో తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో స్వామిని పూజించే వారు. నా అంత భక్తి పరులు లేరని ఒకింత గర్వంతో ఉండేవారు.


 ఓ రోజు శ్రీనివాసుని పాదాల చెంత స్వర్ణ పుష్పాల స్థానంలో మట్టిపూలు కనిపించాయి. ఇదేమి స్వామీ అంటూ శ్రీవారిని ప్రశ్నించాడు


 తొండమానుడు. దానికి స్వామి ఇవి కురువనంబి అనే భక్తుడు సమర్పించాడు. అతడి భక్తి అనితరసాధ్యం అని మెచ్చుకున్నారు స్వామి వారు. స్వామిని ఇంతగా పరవశింపజేసిన ఆ భక్తుడెవరో చూద్దామని తొండమాన్ చక్రవర్తి వెళ్ళారు. కుండలు చేసుకుంటున్న కురవనంబిని చూసి వెంటనే అతడి పాదాలమీద పడి నా ఆహాన్ని కన్నీళ్లుగా కరిగించుకుంటాను అనుమతినివ్వు భక్తా అని వేడుకుంటూ స్పృహ కోల్పోయి పడిపోయారు తొండమానుడు.



ఇంతలో అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమై కుమ్మరిదాసుతో కబుర్లాడుతున్నారు. స్వామివారికి కుమ్మరిదాసు భక్తి, ప్రేమ కలిపి ఆ ఏడుకొండలవాడికి మట్టిమూకుడులో సద్ది సంకటి పెట్టాడు. 


స్వామి వారు ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు


 మట్టి పాత్రలో భోజనము పెట్టి మట్టిచెంబుతో దాహమిచ్చింది. 


ఆ పరంధాముడు ఆనందముగా విందు ఆరగించేడు. ఆ తరువాత స్వామి కరుణ వల్ల స్వర్గం నుండి విమానము వచ్చింది.


 ఏడుకొండలవాడు ఆ దంపతులను అందులో స్వయముగా కూర్చుండబెట్టి స్వర్గలోకానికి సాగనంపేడు.


 ఇప్పటికీ తిరుమలలో మహామహ ప్రసాదాలన్నీ గర్భాలయపు గడప అవతలినుంచే సమర్పిస్తారు.


కానీ ఓటికుండలోని దద్యోదనం మాత్రం నేరుగా శ్రీవారి పాదాల చెంతకు చేరుతుంది. పరమ భక్తుడి పట్ల శ్రీవారి ప్రేమకు నిదర్శనం. 


ఏరోజుకారోజు కొత్తకుండ నైవేద్యం కాబట్టి పాత్రలను తోమాల్సిన పనిలేదు. అందుకే అన్నమాచార్యుని సంకీర్తనలలో శ్రీవేంకటేశ్వరుడు తోమని పళ్లేలవాడయ్యాడు.


ఆమని మ్రొక్కుల వాడు ఆది దేవుడే వాడు తోమని పళ్లేల వాడే దురిత దూరుడే.. వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని అంటూ తన్మయత్వం చెందాడు అన్నమాచార్యుడు.


బ్రహ్మాండ రూప గోవిందా, పుణ్య స్వరూప గోవిందా, శ్రీ చక్ర భూషణ గోవిందా, శ్రీ శంఖ రంజిత గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||31||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: