17, నవంబర్ 2023, శుక్రవారం

పెరియ పురాణం⚜️

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 02*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *2. ఇయర్ పగై నాయనారు*


పూంబుహార్ నగరంలో ఇయర్ పగై నాయనారు అనే పేరుగల

వర్తకుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. శివభక్తులు

ఏది అడిగినా లేదనకుండా ఇచ్చే దాన స్వభావి. ఆ విధంగా భక్తులు

అడిగినది లేదనకుండా ఇవ్వడం లోక స్వభావానికి విరుద్ధం కాబట్టి అందరూ

అతనిని ఇయర్ పగై (లోక ప్రవృత్తికి విరుద్ధమైన) నాయనారు అని పిలుస్తుండేవారు. 


తన భక్తుని దాన గుణాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో శివుడు ఒక ధూర్త బ్రాహ్మణ వేషధారియై ఇయర్ వగై నాయనార్ ఇంటికి

వచ్చాడు. నాయనార్ ఆ బ్రాహ్మణ శివభక్తుని భక్తి పూర్వకంగా సముచిత

సత్కారాలతో గౌరవించాడు. 


తనముందు నిలబడిన ఇయర్ పగై నాయనారును చూసి వంచక బ్రాహ్మణుడు నీ భార్యను కావాలని కోరి నీ

ఇంటికి వచ్చాను అని చెప్పగా నాయనారు ఏ మాత్రమూ కోపం చెందక

తన భార్యను సంతోషంగా తాపసికి సమర్పించాడు. అప్పుడా బ్రాహ్మణుడు

"నీ భార్యను నేను ఒంటరిగా పిలుచుకొని వెళ్తున్నపుడు నీ బంధువులు

నాపై పగబట్టి నాకు అపకారం చేయవచ్చు. కాబట్టి నగరం పొలిమేరలు

దాటేంతవరకు నీవు నాకు తోడుగా రావాలి" అని ఆజ్ఞాపించాడు. 


వెంటనే ఇయర్ పగై నాయనారు వాళ్ల వెనుకగా ఒకచేతిలో కరవాలము, మరొక

చేతిలో డాలును ధరించి తనను ఎదిరించిన వాళ్లను కరవాలంతో

నేలకూలుస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు.

ఊహించిన విధంగానే నాయనారు బంధువులు ఆయుధాలతో ఆ

ధూర్త బ్రాహ్మణుని చంపడానికి ఉద్యుక్తులయ్యారు. నాయనారు వాళ్లందరినీ

తన కరవాలంతో నిర్దాక్షిణ్యంగా సంహరించాడు.


తన భార్యను వైదికోత్తమునికి సమర్పించి "స్వామీ! ఇక మీరు

భయపడకుండా వెళ్లండి" అంటూ వాళ్లు సురక్షిత ప్రదేశానికి చేరుకున్న

తరువాత తన అర్ధాంగిని శాశ్వతంగా వదిలిపెట్టి వెనుదిరిగి చూడక

సంతోషంతో తన ఇంటికి బయలుదేరాడు. అన్యులు చేయడానికి

అసాధ్యమైన కార్యాన్ని చేసినవాడునూ, శివభక్తుడునూ అయిన ఇయర్

పగై నాయనారును బ్రాహ్మణుడు ఎలుగెత్తి పిలిచాడు. 


ఆ శబ్దాన్ని విని “ఈ

దాసుడు ఇదిగో వస్తున్నాడు. మీకు అపకారం తలపెట్టిన వారిని ఈ  కరవాలంతో ఖండిస్తాను" అని చెబుతూ ఇయర్ పగై నాయనారు

బ్రాహ్మణుడున్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ విధంగా పరిగెత్తుకుంటూ

వచ్చిన ఇయర్ పగై నాయనారుకు బ్రాహ్మణుడు కనిపించలేదు. రత్నాభరణ

భూషితురాలైన భార్య మాత్రం కనిపించింది. 


ఇంతలో శివగామవల్లీ సమేతుడై వృషభ వాహనం మీద కొలువు తీరిన నటరాజస్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నీవు నీ భార్య ఇరువురూ కైలాసానికి విచ్చేయండి”

అని వారిని తన కరుణా కటాక్షాలచే అనుగ్రహించాడు. 


చనిపోయిన

నాయనారు బంధువులను, కులపెద్దలను పునర్జీవితులను చేసి వాళ్లు కూడ

శివలోక పదవిని అందుకొని సుఖ సంతోషాలను అనుభవించే వరాన్ని

అనుగ్రహించాడు.


    *రెండవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: