3.భగవంతుడు మనకు ఎందుకు కనబడడు?
భగవంతుడు కనిపించడని ఎవరు అన్నారు? భగవంతుడు తనని చూడదలచుకున్నవారికి తప్పక కనిపిస్తాడు. దానికి మార్గాలు కూడా మన ఋషులు, అనుభవజ్ఞులు చెప్తున్నారు.దేశాన్ని ఏలే రాజుని చూడాలంటే దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఏదైతో ఉంటుందో దానిని అనుసరించి వెళితేనే ఆయన వద్దకు వెళ్లి ఆయనను చూడగలవు. మరి సకలభవనచక్రవర్తి ఆయనను దర్శించుకోవాలంటే ఎంత ప్రోటోకాల్ అనుసరించాలి.
కానీ ఈ రాజు తన ఎడ్రస్ ఎక్కడో ఉందని చెప్పినా మనలో కూడా ఉన్నాడు."అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణఃస్థితః"
మనలో ఆయన ఉన్న స్థలం:- " అణోరణీయాన్ మహతోమహీయాన్" అణువులలో అణువుగానూ, గొప్పవాటిలో గొప్పవానిగానూ కూడా ఉన్నాడని వేదం చెప్తోంది.
"ఈశ్వరఃసర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్ఠతి."-- భగవద్గీత.
"సర్వస్య చాऽహం హృదిసన్నివిష్టో.." -- భగవద్గీత.
"పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం.....నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా
తస్యాఃశిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్థితః" -- బ్రాహ్మణం.
అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయస్థితః.- భగవద్గీత.
అథోముఖంగా ఉన్న ఒక పద్మం ఉందనీ అక్కడ నీవారధాన్యముయొక్క పైన పొల్లు ఎలా ఉంటుందో అంత సన్నటి ప్రకాశం ఉండి దాని కిరణానికి మధ్యలో పరమాత్మ ఉన్నాడు అని చెప్తున్నారు.
పుణ్డరీకేణ సదృశం హృదయం స్యాదధోముఖమ్ । జాగ్రతస్తద్వికశతి స్వపతశ్చ నిమీలతి ॥ “ ఇతి చ( సుశ్రుతే శారీరస్థానే చతుర్థేఽధ్యాయే ॥ )
పుడరీకంలాగ హృదయం అథోముఖం గా ఉండి మనం మెలకువగా ఉన్నప్పుడు అది వికసిస్తుంది ట. నిద్రలో ఉన్నప్పుడు ముడుచుకుంటుందట.
ఈ విధంగా మనలోపల ఉన్నవాడిని గూర్చి చెప్తున్నారు. వానిని చూసే మార్గాలు కూడా చెప్తున్నారు.
ఇక బయట ఉన్న మన రాజుగారి ఎడ్రస్:-
" న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః.
యద్గత్వా నా నివర్తన్తే తద్ధామ పరమం మమ."-- భగవద్గీత.
ఎక్కడైతే సూర్యచంద్ర అగ్నుల కాంతి ఉండదో ఎక్కడికైతే వెళ్లి మళ్లీ రారో అది ఆయన స్థానంట. ఇది సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్మ చెప్పినదే.ఇలా ఆయన్ని చూడాలంటే చూసిన తరువాత మన అనుభవం చెప్పాలన్నా మనం జీవించి ఉండము కదా!
లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్.
అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దాపల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలోత్పలపర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు
విహ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై.-- పోతనభాగవతం.
ఈ పద్యమైతే సాక్షాత్తూ శ్రీరామచంద్రులవారే వారు ఉండే స్థానాన్ని వ్రాశారని అంటారు.
ఇలా మన మహర్షులు, భక్తులు మన రాజుగారి అడ్రస్ చెప్పారు.
లోపల ఉన్నవాడు నిర్గుణుడు. అంటే రూపనామగుణములు లేనివాడు. అటువంటి వానిని రూపనామగుణాలున్న మనం ఎలా చూడగలం? కళ్లతో చూడాలంటే కంటికి కనబడే విధంగా వాడు ఉండాలి. పోనీ ఆయనగారి స్వరమాధుర్యం ఎలా ఉంటుందో వినాలన్నా దానికి తగ్గస్వరంలోనే ఆయన మాట్లాడాలి. ఇలా సగుణాలైన మన ఇంద్రియాలను బట్టి, మనం కోరిన విధంగా మన దగ్గరకు ఆయనే రావాలి. లోపలున్నా బయట ఉన్నా సరే. ఆ రాజుగారికి మనం కనబడుతూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే మన లోపలైనా బయటైనా ఆయన లేనిదే మనం లేము. కానీ మనకి ఆయన కనిపించాలంటే ఎన్నో నియమాలు నిబంధనలు. నియమనిబంధనలు పాటించకపోయినా నువ్వు ఎందుకు కనిపించవయ్యా? అని హఠం వేసుకుని కూర్చుంటే ఆయన కనిపించడా? కనిపిస్తాడు. ఆయన భౌతికమైన రాజుగారు లా కఠినాత్ముడు కాడు. పట్టుదలతో నువ్వు నాకు కనిపించాలంటే నియమనిబంధనలేవీ పాటించకపోయినా మన వద్దకు మనం అనుకున్న రూపంలోనే మనలోనుండే వాడే బయటికి వచ్చి తనని చూపించుకుంటాడు. అదే కదా! అవతరించటమంటే. భక్తకన్నప్ప కి కనిపించలేదా! ఏనుగు, పాము మొదలైన జీవజాలానికి కనిపించలేదా! మొన్న మొన్నటి రామకృష్ణ పరమహంస కి కనబడలేదా! ఇంకెందరో లెక్కించలేనట్టి మహాత్ములకు కనిపించలేదా! మరి మన కళ్లకి ఎందుకు కనిపించటంలేదు? మనకి ఆ పట్టుదల లేదు కాబట్టి. ఏదో ఆ సమయానికి కాస్త 'కృష్ణారామ' అనుకుంటే చాలని, అది కూడా అనుకోకపోయినా జీవితం ఎలాగైనా గడిచిపోతోందిగా అనే నిర్లిప్తత కారణంగా మనకి కనిపించటం లేదు.
---బాలా...✍️🌺
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి