26, డిసెంబర్ 2023, మంగళవారం

శకుని పగ*

 *శకుని పగ*




చెవి దగ్గర చేరి, చెడు మాటలు తలకెక్కించి చెడగొట్టేవారిని చూసినప్పుడు, ఇతడు శకునిలా దాపురించాడని అంటూ ఉంటాం మనం. 


శకుని మాయావి, మోసగాడు, జూదగాడు. కుట్రలకూ, కుతంత్రాలకూ, దురాలోచనలకూ దుర్బోధలకూ మారు పేరు. ఇతడి మూలంగా నే కౌరవులు సర్వనాశనమైనారు. అందుకే మహాభారతంలో ఇతడి పాత్ర చాలా ముఖ్య మైంది. దుర్యోధనుడికి మేనమామ అయిన శకుని గురించి ఎంతో కుతూహలంగా ఉండే కథ ఒకటి ఉంది.


భారత కథా కాలంలో గాంధార దేశాన్ని సుబలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు నూరుగురు కుమార్లు, ఒక కూతురు ఉన్నారు. కూతురి పేరు గాంధారి. ఆమెకు వైధవ్యయోగం ఉందని జోతిష్కులు చెప్పారు. అది తప్పించడానికై ఆమె తండ్రి పండితుల సలహా ప్రకారం గాంధారిని మొదట ఒక మేకపోతుకు ఇచ్చి పెళ్ళి చేశాడు. తరవాత ఆ మేక చచ్చిపోయింది. ఆ తరవాత కొంతకాలానికి గాంధారి ధృతరాష్ట్ర మహా రాజును పెళ్ళాడింది.


గాంధారి కొడుకులు కౌరవులు. ధృతరాష్ట్రుడి తమ్ముడైన పాండురాజు కుమార్లు పాండవులు. చిన్నతనం నుంచే కౌరవులకూ పాండవులకూ సరి పడేదికాదు. ముఖ్యంగా దుర్యోధనుడికీ భీముడికీ అసలు సరిపడదు. భీముణ్ణి చూసి దుర్యోధనుడు ఓరీ ! రండ కొడుకా ! ' అని ఎగతాళి చేసి, అవమానిస్తూ ఉండేవాడు. భీముడికి రోషం వచ్చేది. కాని ఏం చేస్తాడు? కుంతి కుమార్లు అయిన పాండవులు పాండురాజు వల్లకాక దేవతల వరం వల్ల పుట్టినవాళ్ళు. దుర్యోధనుడు భీముణ్ణి రండ కొడకా అనడానికి అదే కారణం.


కాని రోషం పట్టలేని భీముడు దుర్యోధనుని తల్లి గాంధారి ఒకసారి వైధవ్యం పొందిన తరవాత, ధృతరాష్ట్రుడిని పెళ్ళాడిందన్న రహస్యం ఎలాగో తెలుసుకున్నాడు. ఇంకేం? అతనికీ సందు దొరికింది. "నేను రండ కొడుకు నైతే నీవు ముండ కొడుకువు!" అని దుర్యోధనుడిని హేళన చేసి బదులుకు బదులు తీర్చుకున్నాడు.


దుర్యోధనుడికి అభిమానం పుట్టుకొచ్చింది. తన తల్లి గాంధారి ఒకసారి వితంతువు అయిన తరవాత తన తండ్రిని పెళ్ళి చేసుకున్న మాట నిజమేనని తెలుసుకున్నా డు. తాతగారే ఈ మోసం చేశాడని వారి కుటుంబం పై పగబట్టాడు. తాత సుబలుడిని, నూరుగురు మేనమామలను చెరసాలలో పెట్టించాడు. వారికి అన్నం నీళ్ళు లేకుండా చేసి చిత్రహింసలు పెట్టాడు. అంతమందికీ ఒక గుప్పెడు మెతుకులు పడేసేవాడు. అప్పుడు సుబలుడు, అతని కుమారులు ఆ గుప్పెడు మెతుకులూ తాము తినకుండా అందరిలోకీ చిన్న వాడైన శకునికి పెట్టేవారు.


"గుప్పెడన్నంతో మన ప్రాణాలు ఎలాగూ నిలువవు. పసివాడైన శకునికి పెడితే, వాడొక్కడైనా బ్రతుకుతాడు. మన వంశం నిలుస్తుంది” అనుకున్నారు వారు.


“నాయనా, శకునీ! మేమెలాగూ చచ్చిపోతాం. నీవొక్కడివే ఇక మిగిలేది. దుర్మార్గుడైన నీ మేనల్లుడు దుర్యోధనుడిని ఎలాగైనా నాశనం చేసి పగ తీర్చుకో. మా ఆత్మలకు శాంతి కలిగించు” అని శకునికి బోధించారు గాంధార రాజులు.


పసివాడైన శకుని గుండెల్లో ఈ పలుకులు గాఢంగా నాటుకున్నాయి. కొన్నేళ్ళకు శకుని తండ్రి, అన్నలు అంతా అన్నం, నీళ్ళు లేక చనిపోయారు. అప్పుడు శకుని, చనిపోయిన తన తండ్రి ఎముకలు అరగదీసి, వాటితో చక్కని పాచికలు తయారుచేశాడు. ఆ పాచికలు శకుని ఎలా చెబితే అలా వింటాయి. ఏ పందెం కావాలని వాటిని విసిరితే ఆ పందెం పడుతుంది. ఎవరికంటా పడకుండా ఆ పాచికలు దాచి ఉంచాడు శకుని.


చెరసాల నుంచి విడుదలైన తరవాత శకుని, తన వాళ్ళెవరూ లేనందున, హస్తినాపురం లోనే అక్కను, బావను కనిపెట్టుకుని అక్కడే ఉండిపోయాడు. మనస్సులో పగ రగులుతు న్నా అది ఎప్పుడూ బయటపడనీయలేదు. మేనల్లుడు దుర్యోధనుడంటే ఎక్కడలేని ప్రేమ, అభిమానం నటిస్తూ వచ్చాడు. లోపల ఉద్దేశం మాత్రం తన వాళ్ళను నాశనం చేసిన ట్లే. అతన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలన్నదే. అందుకే శకుని ఎప్పుడూ దుర్యోధనుడి పై ఎక్కడలేని ప్రేమ ఒలకపోస్తూ మెల్లగా అతని చెవి దగ్గర చేరేవాడు. దుర్బుద్ధులు అతని తల కెక్కించేవాడు. దురాలోచనలు నూరిపోసేవాడు.


ఈ విధంగా పాండవుల పై దుర్యోధనుడికి అసూయ, ద్వేషం పుట్టించాడు. ఇతని ప్రేరణ వల్లనే దుర్యోధనుడు, ధర్మరాజును జూదానికి పిలిచాడు. మాయాజూదంలో శకుని ధర్మరాజును ఓడించి, పాండవులను అడవులకు పంపాడు. సంధి కుదరకుండా చేసి యుద్ధం జరిగేలా పన్నాగం పన్నాడు. తన వాళ్ళందరినీ దుర్యోధనుడు నాశనం చేసినట్టే చివరకు దుర్యోధనుడిని, అతని సోదరులను నాశనం చేసి, ఆ విధంగా పగ తీర్చుకున్నాడు.


సేకరణ

కామెంట్‌లు లేవు: