26, డిసెంబర్ 2023, మంగళవారం

శ్రీకృష్ణావతారం

 *శ్రీకృష్ణావతారం:*  

  సంపుటి:: 5


🍁🍁🍁🍁🍁


*శ్రీకృష్ణ జననం:*


ఉగ్రసేనునికి క్షేత్రజ కుమారుడయిన కంసుడేగాక మరి ఎనిమిది మంది కుమారులు జన్మించారు. కంస, కంసవతి మొదలయిన అయిదుగురు కుమార్తెలు కూడా జన్మించారు. ఉగ్రసేనుని తమ్ముడు దేవకుడికి నలుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు జన్మించారు. ఆ ఏడుగురిలో చివరది దేవకి. ఈ ఏడుగురినీ వసుదేవుడు వివాహం చేసుకున్నాడు.


 దేవకీ వసుదేవులకే శ్రీకృష్ణుడు జన్మించాడు. దానవాంశంతో జన్మించిన కంసుడు చిన్ననాటి నుంచే ఎన్నో దుష్కృత్యాలకు పాల్పడ్డాడు. పుణ్యాత్ములను, బ్రాహ్మణులను హింసించసాగాడు. జరాసంధుని కుమార్తెలయిన అస్తి, ప్రాప్తిలను వివాహం చేసుకున్నాడతను. శిశుపాలుడు, దంతవకు్త్రడుతో స్నేహం కలుపుకున్నాడు. తండ్రి ఉగ్రసేనుణ్ణి బంధించి, తనని తాను రాజుగా ప్రకటించుకుని ప్రజలను పీడించసాగాడు.


ఆడపిల్లను తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు, ఆమె వెంట అన్నో తమ్ముడో లేదంటే పుట్టింటికి సంబంధించిన మరొక వ్యక్తి ఎవరయినా ఉండడం ఆచారం. తోడుగా వెళ్ళి ఆమెను అత్త ఇంట దిగవిడచి రావడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే దేవకీ వసుదేవుల వివాహం అనంతరం వారిని దిగ విడచి వచ్చేందుకు తోడుగా కంసుడు బయల్దేరాడు. 


చెల్లెలినీ, బావగారినీ రథంలో కూర్చోబెట్టుకుని, తానే రథాన్ని నడపసాగాడు కంసుడు. ఆ రథాన్ని అనేకమంది దాస దాసీజనం, పరివారం అనుసరించాయి. సకల మర్యాదలతో చెల్లెలిని అత్త వారింటికి తీసుకుని వెళ్తున్నాన్న ఆనందంలో ఉన్నాడు కంసుడు. అప్పుడు ఓ విచిత్రం జరిగింది. ఉత్సాహంగా ఉల్లాసంగా రథాన్ని నడుపుతున్న కంసుణ్ణి ఉద్దేశించి ఆకాశవాణి ఇలా పలికింది.


‘‘కంసా! సోదరిని సంతోషంగా అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నావు. చేజేతులా చావుని కొని తెచ్చుకుంటున్నావు. ఈ దేవకి కడుపున పుట్టిన ఎనిమిదవ బిడ్డే నీ ప్రాణాల్ని హరిస్తుంది. ఆ బిడ్డ చేతిలో నీకు మరణం తప్పదు.’’వినవచ్చిన ఆ మాటలకు విస్తుపోయాడు కంసుడు. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఏకదీక్షతో ఆలోచించాడు. ఆకాశవాణి మాటలు నిజం కాకతప్పదు. తనకి మరణం తధ్యం. దానిని తప్పించుకోవాలి. ఎలా?రథం దిగాడు కంసుడు. కొరకొరా చెల్లెలు దేవకిని చూశాడు.


 ఆమె సిగను పట్టి కిందకి లాగాడు. మొలలోని కత్తిని ఆమె పైకి దూశాడు.‘‘బావా’’ అడ్డుకున్నాడు వసుదేవుడు. ‘‘ఇది నా చెల్లెలు కాదు, నా ప్రాణాల్ని హరించే రాక్షసి. దీనిని ఈ క్షణమే హతమార్చి, నన్ను నేను కాపాడుకుంటాను. తప్పుకో.’’ అన్నాడు కంసుడు.


 వసుదేవుణ్ణి వెనక్కి నెట్టాడు. తూలిపడబోయి నిలదొక్కుకుని, కంసుని కాళ్ళు పట్టుకున్నాడు వసుదేవుడు.‘‘బావా! భోజకులానికే ఎన్నదగినవాడవు. శూరుడవు. నీకు తెలియని ధర్మం లేదు. స్త్రీహత్య మహాపాతకం. చెల్లెలు, కొత్తపెళ్ళికూతురు, కాళ్ళపారాణి కూడా ఆరలేదు. అలాంటిదాన్ని, అమాయకురాలిని చంపుతాననడం ధర్మమా చెప్పు? దయచేసి నా మాట విను, దేవకిని వదలిపెట్టు.’’ ప్రాథేయపడ్డాడు. వినలేదు కంసుడు. దేవకిని చంపితీరుతానన్నాడు. 


ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చూశాడు వసుదేవుడు. అయినా ఒప్పుకోలేదతను.


కొడుకుల నిచ్చెద నని సతి

విడిపించుట నీతి; వీఁడు విడిచిన మీఁదం

గొడుకులు పుట్టినఁ గార్యము

తడఁబడదే? నాటి కొక్క దైవము లేదే?


పుట్టబోయే కొడుకులను ఇస్తాను అని మాట ఇచ్చి, భార్యను విడిపించడం తెలివైనపని. వీడిప్పుడు వదిలితే తరువాత కొడుకులు పుట్టే నాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆనాటికి ఏ దైవమో అడ్డుపడక పోతుందా?


ఎనిమిదవ చూలు వీనిం

దునుమాడెడి నంచు మింటఁ దోరపుఁబలుకుల్ 

వినఁబడియె; నేల తప్పును? 

వనితను విడిపించు టొప్పు వైళం బనుచున్,


ఎనిమిదవ గర్భంలో పుట్టేవాడు వీడిని సంహరిస్తాడని మాటలు సూటిగా వినువీధి నుంచి వినపడ్డాయి. అవి ఎందుకు తప్పుతాయి. త్వరగా నా భార్యను విడిపించడం మంచిది” అని ఆలోచించాడు వసుదేవుడు


 తీవ్రంగా ఆలోచించి అప్పుడు ఇలా అన్నాడు వసుదేవుడు.

లలనకుఁ బుట్టిన కొమరుని

వలనం దెగె దనుచు గగనవాణి పలికె నం 

చలిగెద వేని మృగాక్షికిఁ

గల కొడుకులఁ జంప నిత్తుఁ గ్రమమున నీకున్.


“ఈమెకు పుట్టిన కొడుకు వలన మరణిస్తావని ఆకాశవాణి పలికిందని కదా కోపగిస్తున్నావు. దేవకికి పుట్టిన కొడుకులు అందరినీ నీకు తెచ్చి ఇస్తాను. వారిని నువ్వు చంపుదువుగాని.”దేవకిని వదులు.’’ వసుదేవుని వాగ్దానానికి శాంతించాడు కంసుడు. దేవకిని విడచిపెట్టాడు.



‘‘మాట తప్పవు కదా?’’ అడిగాడు వసుదేవుణ్ణి. తప్పనన్నాడతను. ‘‘సరే, వెళ్ళిరండి.’’ కంసుడు ఇద్దరినీ వదిలేశాడు. బ్రతుకుజీవుడా అని భర్త సహా అత్తారింటికి చేరుకున్నది దేవకి. 


సుదతి మున్ను గన్న సుతుఁ గీర్తిమంతుని

పుట్టుఁ దడవు కంసభూవరునకుఁ

దెచ్చి యిచ్చెఁ జాల ధృతి గల్గి వసుదేవుఁ

డాశపడక సత్యమందు నిలిచి.

దేవకీదేవి మొదటి కాన్పులో ప్రసవించిన కొడుకు కీర్తిమంతుడు. ఆమె కన్న ఆ మొదటి కుమారుడిని పుట్టిన వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకువచ్చి అన్నమాట ప్రకారం కంసుడికి ఇచ్చేసాడు


పసిబిడ్డను తీసుకుని చూశాడు కంసుడు. వేలెడు లేడు. తనని వీడేం చేస్తాడనుకున్నాడు. సన్నగా నవ్వుకున్నాడు. 


కొడుకు నీవు మరలఁ గొనిపొమ్ము వసుదేవ! 

వెఱపు లేదు నాకు వీనివలన; 

నల్గ వీనికి; భవ దష్టమపుత్రుండు

మృత్యు వఁట; వధింతు మీఁద నతని


“బావా! వసుదేవా! నీ కొడుకును తీసుకువెళ్ళు. వీడి వలన నాకు భయం లేదు. నీ ఎనిమిదవ పుత్రుడే నా పాలిట మృత్యువట. వాడు పుట్టిన వెంటనే వధిస్తాను.”

వసుదేవునికి పిల్లాణ్ణి తిరిగి ఇచ్చేశాడు కంసుడు. ఆ బిడ్డపేరే కీర్తిమంతుడు.



ధేనుకారిష్టకాఽనిష్టికృద్-ద్వేషిహా

కేశిహా కంసహృద్-వంశికావాదకః |

పూతనాకోపకః సూరజాఖేలనో

బాలహోపాలకః పాతు మాం సర్వదా || 6 ||


బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం

ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |

వాన్యయా మాలయా శోభితోరః స్థలం

లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||


రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే


శ్రీ కృష్ణ దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం. 


*Follow: సనాతన హిందూ ధర్మం*

కామెంట్‌లు లేవు: