సంపూర్ణ శ్రీ శివమహాపురాణం - కైలాస సంహితా - అధ్యాయం - 4 సన్న్యాస నియమములు
ఈశ్వరుడిట్లు పలికెను -
ఓ మహాదేవీ! నీయందు నాకు గల ప్రేమచే నేనీపైన సంప్రదాయానుసారముగా సన్య్యాసియొక్క దినచర్యను గురించి చెప్పెదను (1). సన్న్యాసి బ్రాహ్మముహూర్తమునందు నిద్రలేచి, శిరస్సునందు తెల్లని పద్మము రూపములో నుండే సహస్రారచక్రమునందు కూర్చుండియున్న గురువును భావన చేయవలెను (2). స్ఫటికమువలె స్వచ్ఛమైనవాడు, రెండు నేత్రములు గలవాడు, వరద-అభయముద్రలను దాల్చియున్నవాడు, మనస్సునకు ఆహ్లాదమును కలిగించువాడు, శివస్వరూపుడు అగు గురువునకు మనస్సులో భావనలచే సంపాదింపబడిన గంధము మొదలగు ద్రవ్యములతో చక్కగా క్రమములో సర్వోపచారములను చేసి, తరువాత చేతులను జోడించి నమస్కరించవలెను (3,4). ఓ మహాదేవా! నేను ఉదయము మొదలిడి సాయంకాలము వరకు, సాయంకాలము మొదలిడి ఉదయము వరకు ఏయే పనులను చేయుదునో, అవి అన్నియు నీ ఆరాధనయే అగుగాక! (5) తరువాత గురువునకు విన్నవించి, ఆయన అనుమతిని (మానసికముగా) తీసుకొని, కూర్చుండి ప్రాణాయామమును చేసి మనస్సును ఇంద్రియములను దేహమును జయించి (6), మూలాధారము మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు ఆరు చక్రములను (స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రములు) ధ్యానము చేయవలెను. బ్రహ్మరంధ్రమునకు మధ్యలో కోటి మెరపులతో సమానమగు తేజస్సు కలిగినట్టియు, సర్వశ్రేష్ఠమగు తేజోమయమగు నా సచ్చిదానందమూర్తిని ధ్యానించవలెను. నిర్గుణపరబ్రహ్మ, దోషరహితుడు అగు సదాశివుని 'సో%హమస్మి ( సదాశివుడు నేనే అగుచున్నాను)' అని భావన చేసి ఆ సదాశివునితో ఏకత్వముననుభవించి, తరువాత బయటకు వచ్చి సుఖముగా దూరమునకు వెళ్లవలెను (7-9). సావధానచిత్తుడగు ఆ యతి శిరస్సుపై వస్త్రమును కప్పుకొని ముక్కునకు వస్త్ర మును కట్టుకొని నేలపై గడ్డిని ఉంచి దేహమును శోధించి చేతితో గుహ్యము ధరించి పైకి లేచి తరువాత జలాశయమునకు వెళ్లి నీటిని గ్రహించి జాగరూకతతో శౌచమునాచరించవలెను (10, 11).
చేతులను, కాళ్లను కడుగుకొని రెండు సార్లు ఆచమనమును చేసి ఓంకారమును స్మరిస్తూ ఉత్తరము వైపునకు తిరిగి మౌనముగా పళ్లను తోముకొనవలెను (12). అమావాస్యనాడు, ఏకాదశి నాడు పళ్లను తోముకొనుటకు గడ్డిని కాని, ఆకులను కాని వాడరాదు. మిగిలిన రోజులలో వాటితో మాత్రమే తోముకొనవలెను. పన్నెండు సార్లు నీటిని పుక్కిలించి తరువాత ముఖమును కడుగుకొన వలెను (13). రెండు సార్లు ఆచమనమును చేసి మట్టితో మరియు నీటితో వెనుక భాగమును శుద్ధి చేసి అరుణోదయకాలము (సూర్యోదయమునకు అరగంట ముందు) మట్టితో స్నానమును చేయవలెను (14). గురువును మరియు నన్ను స్మరిస్తూ స్నానమును సంధ్యావందనము మొదలగు వాటిని చేయవలెను. ఆ వివరములను విస్తారమగుననే భయముతో ఇక్కడ చెప్పుట లేదు. వాటిని మరియొక చోట చూచి తెలుసుకొన వలెను (15). అర చేతులతో శంఖముద్రను పట్టి దానితో నీటిని తీసుకొని ఓంకారమును ఉచ్చరిస్తూ పన్నెండు లేదా ఆరు, లేదా మూడు పర్యాయములు తలపై అభిషేకించుకొనవలెను (16). ఒడ్డు పైకి వచ్చి, కౌపీనమును ఉతుకుకొని రెండు సార్లు ఆచమనమును చేసి వస్త్ర ముపై నీటిని చల్లి ఒంటిని తుడుచుకొనవలెను (17). ముందుగా ముఖమును తుడుచుకొని, తరువాత శిరస్సుతో మొదలిడి దేహమును అంతటా అదే వస్త్రముతో తుడుచుకొని, గురువు సన్నిధిలో నిలబడవలెను (18). శుభ్రమగు లంగోటాను ముడి ఎడమ వైపునకు వచ్చు విధముగా కట్టుకొని, తరువాత భస్మను ధరించవలెను. ఓ పార్వతీ! ఆవిధానమును చెప్పుచున్నాను (19). రెండు సార్లు ఆచమనమును చేసి సద్యోజాతమంత్రముతో భస్మను తీసుకొని 'అగ్నిరితి' అను మంత్రముతో దానిని అభిమంత్రించి దేహమును స్పృశించవలెను (20). తరువాత 'ఆపో వా' అను మంత్రముతో నీటిని అభిమంత్రించి దానితో భస్మను తడుపవలెను. ఓ పరమేశ్వరీ! ఓమాపో జ్యోతిః, మానస్తోకే అను మంత్రములను పఠించి, దానిని ముద్ద చేసి, రెండు ముద్దలుగా విభజించి, ఒక ముద్దను మరల అయిదు భాగములుగా చేసి, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు అను స్థానములయందు 'ఈశానః' ఆను మంత్రముతో మొదలిడి సద్యోజాతమంత్రము వరకు అయిదు మంత్రములను క్రమముగా పఠిస్తూ ధరించవలెను. తరువాత, దేహమంతటా ఓంకారమును ఉచ్చిరిస్తూ ఆ భస్మను పూసుకొనవలెను. తరువాత చేతులను కడుగుకొని రెండవ ముద్దను తీసుకొని దానిని పూర్వమునందు వలెనే చక్కగా పూజించి దానితో త్రిపుండ్రము (లలాటముపై మూడు రేఖలు) ను ధరించవలెను (21-24).
త్రియాయుషమంత్రమును, త్ర్యంబకమంత్రమును ఒక్కొక్కటి మూడు సార్లు చొప్పున జపించి ఓంకారమును నమశ్శివాయ మంత్రమును పఠించి శిరస్సు, లలాటము, వక్షఃస్థలము, భుజములు అను స్థానములయందు భస్మను ధరించవలెను (25). అపుడు విద్వాంసుడగు ఆ యతి పంచీకరణమంత్రమునుచ్చరించి తన గురువును భావన చేయవలెను. తరువాత చెప్పబోవు విధములో ఆరు ప్రాణాయామములను చేయవలెను (26).తరువాత నాభి, రెండు బాహువులు, వాటి సంధులు, వీపు అను స్థానములను క్రమముగా స్పృశించి, చేతులను కడుగుకొని రెండు సార్లు యథావిధిగా ఆచమనమును చేసి (27), కుడిచేతితో నీటిని తీసుకొని, ఎడమ చేతితో దానిని కప్పి పన్నెండు సార్లు ఓంకారముతో అభిమంత్రించవలెను (28). ఈ విధముగా శిరస్సుపై మూడు సార్లు సంప్రోక్షించుకొని, తరువాత మూడు సార్లు ఆ నీటిని త్రాగవలెను. తరువాత ఓంకారమును జపిస్తూ ఏకాగ్రమగు మనస్సుతో, సూర్యమండలమునకు మధ్యలోనున్నవాడు, సకలతేజోరాశి, పరంబ్రహ్మ, ఎనిమిది చేతులు గలవాడు, నాలుగు ముఖములు గలవాడు, అర్ధనారీశ్వరుడు, ఆశ్చర్యమును గొల్పువాడు, సర్వులకు ఆశ్చర్యమును కలిగించే గుణములు గలవాడు, సకలాభరణములతో విరాజిల్లువాడు అగు ఈశ్వరుని ధ్యానించి, తరువాత మూడు సార్లు యథావిధిగా అర్ఘ్యమునీయవలెను (29-31). తరువాత గాయత్రిని 108 సార్లు జపించి పన్నెండు తర్పణముల నీయవలెను. మరల ఆచమనమును చేసి యథావిధిగా మూడు సార్లు ప్రాణాయామమును చేయవలెను (32). తరువాత మనస్సులో శివుని స్మరిస్తూ పూజాగృహమునకు విచ్చేయవలెను. ద్వారము వద్దకు వచ్చి కాళ్లను కడుగుకొని మౌనియై రెండు సార్లు ఆచమనమును చేయవలెను (33). తరువాత ఆ పూజాగృహములోనికి ముందు కుడి కాలిని పెట్టి యథావిధిగా ప్రవేశించవలెను. పవిత్రాంతఃకరణుడగు యతి ఆ మండపము లోపల క్రమముగా మండలమును రచించవలెను (34).
శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు సన్న్యాసాచారమును వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి