*" వేద వ్యాసుని ముఖ్య శిష్యులు, వాళ్ళ వివరాలు "*
వేదవ్యాస మహర్షి ముఖ్య శిష్యులు: జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు, దాల్భభ్యుడు మొదలైనవారు.
ఇపుడు మనం చదివేది వైశంపాయనుడు లోక వ్యాప్తి చేసిన భారతం. ^జయము^ అని దీనికి మరో పేరు. హరి వంశం సంస్కృత భారతంలో చివరి పర్వం. వేరే గ్రంథం కాదు. దీన్ని ఎఱ్ఱన విడిగా వ్రాసి ప్రోలయ వేమారెడ్డికి అంకితం చేశాడు.
జైమిని చెప్పిన భారతం లో అశ్వమేధ పర్వం మాత్రమే లభిస్తున్నది. వేదవ్యాసుని తండ్రి పరాశరుడు వ్రాసిన ^పరాశర సంహిత^ జ్యోతిషంలో ప్రముఖ గ్రంథం కాగా *జైమిని సూత్రాలు* ఫలాంశ గణనలో విశిష్టమైన కొత్త మార్గాలు సూచిస్తాయి.
దాల్భ్య మహర్షి ప్రతిష్ఠ అయిన *ప్రసన్న వేంకటేశ్వరాలయం* "గుణ శీలం" అనే ఒక గ్రామం (కొంచెం పెద్ద దే) లో చూచాను. ఆలయం చిన్నదే. శ్రీరంగం సమీపంలో ఉంది. మతిస్థిమితం లేని వాళ్ళు ఆ స్వామిని ఆరాధించి స్వస్థులవుతారని ప్రసిద్ధి.
మహర్షి శిష్యులందరూ వివిధ శాస్త్రాలను లోక వ్యాప్తి చేశారు. వేదాలను యజ్ఞార్థం నాలుగు భాగాలుగా వేదవ్యాసుడు విభాగం చేశాడు. శిష్యులకు అన్నీ వేదాలు బోధించాడు.
1. ఋగ్వేదం —- పైలుడు,
2. యజుర్వేదం — వైశంపాయనుడు,
3. సామవేదం — జైమిని,
4. అధర్వణ వేదం — సుమంతుడు
ఈ నలుగురికీ బోధించి లోకంలో వ్యాప్తి చేయాలని ఆదేశించాడు.
కుమారుడైన శుక మహర్షికి భాగవతాన్ని ఉపదేశించి పరీక్షిన్మహారాజుకు ఉపదేశించమన్నాడు. ఒక్క వారం రోజులు భాగవతం ఏక దీక్షగా విని ఆ రాజు సద్గతి పొందాడు.
పాండవులకు, ధృతరాష్ట్రుడికి వ్యాసుడు ఎన్నో విషయాలు బోధించాడు.
అరణ్య వాస కాలం లో ధర్మరాజుకు "ప్రతిస్మృతి" అనే మంత్రాన్ని ఉపదేశించి అర్జునుడికి ఉపదేశించ మని చెప్పాడు. ఆ మంత్రం వల్ల పాశుపతాస్త్రం అర్జునుడికి లభించింది.
వ్యాసుడు నారాయణ తేజోంశ - *మునీనామపి అహం వ్యాసః* అని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ.
******************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి