29, డిసెంబర్ 2023, శుక్రవారం

రామకృష్ణుని పాండిత్యం"

 "తెనాలి రామకృష్ణుని పాండిత్యం"

                     01-09-2020

      విజయనగర సామ్రాజ్యాన్ని సాహితీ

సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు

పాలించే రోజులవి.ఆయన ఆస్థానంలో అష్ట

దిగ్గజ కవులుండేవారనే సంగతి అందరికీ

తెలిసిందే.అష్టదిగ్గజ కవుల్లో ఒకడైన తెనాలి

రామకృష్ణుని ప్రతిభా,పాండిత్యాలు కూడా

అందరికీ తెలిసిందే.

     అయితే రామకృష్ణుడంటే  పడని ప్రత్యర్ధులైన

 కవులు ఎలాగైనా రామకృష్ణుని పాండిత్యాన్ని

దెబ్బతీయడానికి పథకాన్ని రచించారు.ఒకసారి

రాయలు సభకు రావడానికి ముందు ఒక

సేవకుని ద్వారా "కుంజర యూధంబు దోమ 

కుత్తుక జొచ్చెన్"అనే సమస్యనిచ్చి పూరించమని

పంపారు. ఇది తెలిసిన రామకృష్ణుడు ప్రత్యర్ధులకు

ఆ సమస్యను ఈ విధంగా పూరించి పంపాడు.

కంద పద్యం:-

"గంజాయి తాగి తురకుల

 సంజాతము తోడ కల్లు చవిగొన్నావా?

 కొడకా ఎక్కడ

 కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్?"

బహమనీ సుల్తానుల హయాంలో తురుష్కు

లో సేవకులు గంజాయితో పాటు కల్లును కూడా

సేవించేవారు.వారితో కూడి తాగున్నావా?అని

తిడుతూ ఎక్కడరా!ఏనుగులు సమూహమెక్కడైనా

దోమ కుత్తుక లో చొరబడగలదా?చెప్పు అని

మందలిస్తూ ఆ సమస్యను పూరణచేసి. పంపాడు.

దానర్థం తెలియని సేవకుడు ఆ ప్రత్యర్ధులకు

దాన్ని ఇచ్చాడు.

    కాని ఇదేదీ జరుగనట్లు మౌనంగా ఉండి తరువాత

రోజు నిండుసభలో రాయల వారి ముందు ఈ సమస్య

ను రామకృష్ణుని కిస్తే రామకృష్ణుడు అవమానం

పడడం ఖాయమని  సంబర పడ్డారు. మరుసటిరోజు

రాయలు ఎదుట పై సమస్య నుంచారు.

      నిన్నటి సంఘటనను గుర్తుంచుకుని రామ

కృష్ణుడు ఆ సమస్యను రాయల వారి సభలో

ఈ విధంగా పూరించాడు.

కంద పద్యం:-

"రంజనజెడి పాండవులరి

  భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా!

  సంజయ!యేమని చెప్పుదు

  కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్!"

భావం:-

మహాపరాక్రమవంతులైన పాండవులు తలరాత

బాగోలేక విరాటరాజును కొలిచే స్థితికి వచ్చారు.

విధి ఎంత బలీయమైనది.ఏనుగుల గుంపు

దోమగొంతుకలో ప్రవేశించింది కదా!

  రామకృష్ణుని సమస్యా పూరణానికి

 ఆశ్చర్యపడిన రాయలు అభినందించాడు.

ప్రశంశలు రామకృష్ణునికి,భంగపాటు ప్రత్యర్ధి

కవులకు దక్కింది.

ద్రోణంరాజు శ్రీనివాసరావు ఎస్:ఎ.తెలుగు.

                  మునిపల్లి.

కామెంట్‌లు లేవు: