16, డిసెంబర్ 2023, శనివారం

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////      "" విద్వాన్ సర్వత్ర పూజ్యతే!""                           ***** అవధాన మధురిమలు*****  శతావధాని శ్రీ డోకూరి కోట్ల బాలబ్రహ్మాచార్యులు ***** సమస్యాపూరణములు *****                                   1* "" అంధత్వంబు పురాభవగ్రధిత పుణ్యప్రాప్త మూహింపగన్.""                    శా. అంధత్వస్థిక మేమి నా బ్రతుకనన్ దానినట్లనెన్/ గాంధారీధవ యిట్లుగానియెడ దుష్కర్మ ప్రపంచపు గో/ డుం ధాత్రిన్ గని కుందఁగావలసి యుండున్, గాన నెంతేని నీ/ యంధత్వంబు పురాభవ గ్రధిత పుణ్యప్రాప్త మూహింపగన్.     2*"" పున్నమ చందమామ పయి ముట్టడి బెట్టెను జిమ్మ చీకటుల్.""                   ఉ. అన్నులమిన్న తావక ముఖాబ్జముపై విరబారుచున్న యా/ క్రొన్నెటిగుంపు భాతినదిగో కనుమా భవనాళి కెంతయున్/ గన్నుల పండువై వెలఁగఁగా గవిసెన్ఁబగ చేత రాహు వీ/ పున్నమ చందమామ పయి ముట్టడి బెట్టెను జిమ్మ చీకటుల్.                     3* "" మంచాలన్ బిగియించి గూటముల కమ్మా బిందియం దేగదే! ""     3* శా. ప్రాంచద్భంగి నొనర్చువత్సముల యంబారవముల్ వించు నే/ తెంచెన్ గోవులు త్రాళ్ళు దెంచుకొని యర్థిన్ జీకెడిన్ దూడలా/ మంచంబల్లుట మాని పిల్వుమిట కామందున్ బాల్పిండి పొ/ మ్మంచాలన్ బిగియించి గూటముల కమ్మా బిందియందేగదే!                   4* ""త్రాడు భుజంగమై కఱచె దాహము గల్గెను మోవి నీయవే.""                    ఉ. నేడు భరింపజాలనిఁక నిద్దపు పేర్మి గృతార్థుఁజేయఁబూఁ/ బోడిరొ నెమ్మనంబునను బూనిక నీవు దలంపనందునన్/ బాడు మరుండు హస్తమునఁబట్టిన చక్కెర వింటి తేటి బల్/ త్రాడు భుజంగమై కఱచె దాహము గల్గెను మోవి నీయవే.                                5* "" తన సుతుఁగూడి గర్భమును దాల్చెనయో ప్రభుఁడేమి సేయునో?""         చం. జనకుఁడెఱింగినన్ గడు దొసంగగునంచు నుషాకుమారి దా/ మనమున నెంచ కిప్పుడవమాన భయంబును లేక నెచ్చెలీ/ ఘనతరమైన మన్మథ వికారము నాపఁగలేక మీనకే/ తన సుతుఁగూడి గర్భమును దాల్చెనయో ప్రభుఁడేమి సేయునో?            దత్తపదులు;---                     1* "అల్లము -- బెల్లము -- పల్లము -- బుల్లము" పదములతో "రామాయణార్థములో" పద్యము.                               ఉ. అల్లముకుందుఁడాశ్రిత బుధావళి నేలగ రాముడొ జనం/ బెల్ల ముదంబునొంది నుతియింప దురాత్ముల రక్తముర్విపైఁ/ బల్లము మిఱ్ఱునేకమయి పాఱెడి యట్టొనరించి సంతసం/ బుల్లము రంజిలన్ బుధులనోమె నయోధ్యాపురాధినాథుఁడై.      3* " ఏడు వారముల పేర్లు వచ్చునట్లుగా భగవత్స్తుతి"                        తే. గీ. ఆదిత్యధామ! కీర్తిజితసోమ!/ మంగళాన్విత! బుధగురుమాన్య చరిత! శుక్ర శిష్య ధరాశని విక్రమఖని/ మన్నమో వాకములఁగొని మనుపుమయ్య!                  ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో) తేది 13--12--2023, బుధవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: