16, డిసెంబర్ 2023, శనివారం

సోదరుడి తో సమావేశం.

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*సోదరుడి తో సమావేశం..సూచన..*


*(యాభై తొమ్మిదవ రోజు)*


శ్రీ చెక్కా కేశవులు, మీరాశెట్టి గార్ల తో తన శరీర త్యాగం గురించి తన అభిప్రాయాన్ని చేప్పటమూ..వారు నిరాకరించడం జరిగిపోయిన తరువాత.. శ్రీ స్వామివారు తన తపస్సును కొనసాగించ సాగారు..ఒక వారం గడిచిపోయింది..శ్రీధరరావు దంపతులు కూడా తీరిక లేని పనుల్లో ఉండిపోవడం వలన..శ్రీ స్వామివారి వద్దకు వెళ్లలేక పోయారు..పైగా..శ్రీ స్వామివారు తన మానాన తాను తపస్సు చేసుకుంటూ వుంటారు..ఎలాగూ సజీవ సమాధి చేయడం లేదని చెప్పేశాము గదా..ఇక ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు అనే భ్రమ లో ఉండిపోయారు..


మరో నాలుగైదు రోజుల తరువాత..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసినంత కాలం క్రమం తప్పకుండా ఆహారపదార్ధాలు చేరవేసిన సోదరుడు పద్మయ్య, అన్నగారిని చూడటానికి ఆశ్రమానికి వచ్చారు..పద్మయ్యను చూసి శ్రీ స్వామివారు పలకరింపుగా నవ్వి..దగ్గరగా కూర్చోబెట్టుకుని..


"నీకు కొన్ని విషయాలను చెపుతాను..అవి నీవు నాకొఱకు చేసిపెట్టాలి..సరేనా?.. " అన్నారు..


" అలాగే ..చెప్పు..చేస్తాను.." అన్నారు పద్మయ్యనాయుడు..


"నాకు తపస్సు చివరి దశకు వచ్చేసింది..ఈ శరీరాన్ని వదిలేయాల్సిన సమయమూ ఆసన్నమైంది..నేను ప్రాణత్యాగం చేసిన తరువాత..నా దేహాన్ని..ఇదిగో..ఈ ఆశ్రమంలో కట్టించుకున్న భూగృహం (నేలమాళిగ) లో పద్మాసనం లో వున్నట్లుగా ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి సమాధి చేయాలి..అది నీ కర్తవ్యం..నువ్వే చేయాలి.."అన్నారు..


ఈ మాటలు చెప్పేటప్పుడు..లీలామాత్రంగా శ్రీ స్వామివారి కళ్ళు చెమర్చాయి..అది.పద్మయ్యనాయుడు గమనించారు

"చూసావా..నేను సన్యసించి..అన్ని బంధాలనూ తెంచుకున్నా కూడా..రక్త సంబంధం మాత్రం నన్ను ఈ నిమిషంలో కట్టి పడేసింది.." అన్నారు శ్రీ    ఆ నిముషమే శ్రీ స్వామివారు అలా భావోద్వేగానికి గురయింది..ఆ తరువాత మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేసి..పద్మయ్యనాయుడు తో ఆమాటా..ఈ మాటా మాట్లాడి పంపించివేసారు......(ఈ విషయం పద్మయ్యనాయుడు గారు స్వయంగా నాతో తెలిపారు..) పద్మయ్యనాయుడు వెళ్లిన తరువాత శ్రీ స్వామివారు తన ధ్యానం చేసుకోవడానికి ఆశ్రమం లోపలికి వెళ్లిపోయారు..


మరో మూడు రోజులు గడిచిపోయాయి..1976 ఏప్రిల్ నెల మూడవవారం లో ప్రభావతి శ్రీధరరావు గార్లు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వచ్చారు..సుమారు ఓ అరగంట వేచి చూసిన తరువాత..శ్రీ స్వామివారు తలుపు తీసుకొని వీళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారు..ఆయన ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతోంది..శరీరం మాత్రం శుష్కించి ఉన్నది..


"నాయనా..బాగా తగ్గిపోయారు..ఆహారం తీసుకోవడం లేదా?.." అన్నారు ప్రభావతి గారు..


"ఆహారం..అంత సమయం కూడా వృధా చేయటం లేదు తల్లీ..నిరంతర ధ్యానం లో ఉంటున్నాను..ఇదిగో ఇప్పుడు మీరొచ్చినారని వాక్కు వినబడితే..లేచి వస్తున్నాను..మళ్లీ అడుగుతున్నానని మీరు కలత పడవద్దు..ఇంకా రోజులే మిగిలివున్నాయి నా శరీరానికి..త్వరగా సమాధి ఏర్పాట్లు చేయండి.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..శ్రీ స్వామివారు సజీవ సమాధి విషయాన్ని వదిలేసి ఉంటారని భావించిన తమకు..అదేమీ లేదనీ.. శ్రీ స్వామివారు అదే పట్టు మీద ఉన్నారనీ.. అవగతం అయింది..వాళ్లిద్దరూ కూడా..తమవల్ల కాదని మళ్లీ తేల్చి చెప్పారు..


అయితే చిత్రంగా..ఈసారిమాత్రం శ్రీ స్వామివారు పెద్దగా నవ్వారు..నవ్వి.."మీరు మాత్రం ఏం చేస్తారు..పెంచుకున్న బంధాలు అంత త్వరగా తెగిపోవు కదా..పైగా మీ పరిమితులు మీకుంటాయి..ఇక నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను..ఇంత దూరం నన్ను లాక్కొచ్చిన ఆ పార్వతీదేవి..ఆ దత్తాత్రేయుడు నాకు మార్గం చూపక పోతారా?.." అన్నారు..


మొదటిసారి ఆ దంపతులు..శ్రీ స్వామివారు తమకు కాకుండా పోతారేమో అనే భావనకు లోనయ్యారు..


"మళ్లీ నేను చెప్పి పంపేదాకా.. మీరిద్దరూ ఈ ఆశ్రమానికి రాకండి..అమ్మా..కొన్ని దోసకాయలు మాత్రం పంపించు..ధ్యానం నుంచి లేచినప్పుడు వండుకుంటాను.." అన్నారు..


కొద్దిసేపు శ్రీ స్వామివారి వద్ద గడిపి..తిరిగి తమ ఇంటికి చేరారా దంపతులు..


శ్రీధరరావు గారి చివరి ప్రయత్నం..పర్యవసానం..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: