🌹అమ్మ కొంగు🌹
పొయిమీద గిన్నెను పొదివి పట్టుకొనియు
ననునువుగా దించేది అమ్మ కొంగె
కన్నీరు నింపిన కన్నబిడ్డల యొక్క
అక్షులన్ దుడిచేది అమ్మ కొంగె
బజ్జుండ దలచిన బుజ్జాయి కుండెటి
ఆచ్ఛాదనమ్మది అమ్మ కొంగె
కొత్తవారినిచూడ కూడగా నును సిగ్గు
అమ్మాయి కడ్డు యా అమ్మ కొంగె
చలియందు నులివెచ్చ కలిగించు చుండెడి
కమ్మని దుప్పటి అమ్మ కొంగె
శ్రమవేళ చేరెడి చెమట బిందువులను
హాయిగా తుడిచేది అమ్మ కొంగె
పెరటిలో కూరలన్ విరిజాజు లన్నిటి
న్నరయంగ తెచ్చేది అమ్మ కొంగె
ఇల్లు సర్దునపుడు పిల్లల కున్నట్టి
బొమ్మలన్ గట్టేది అమ్మ కొంగె
అద్భుతంబైన సాధన మమ్మ కొంగె
హాయినిచ్చెటి సాధన మమ్మ కొంగె
కమ్మనైనట్టి సాధన మమ్మ కొంగె
అమ్మ కొంగుకు మించిన సొమ్ము లేదు
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి