శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, సింహాచలం చందనోత్సవము. సందర్భంగా ఈ కథనం
సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామీ వారి నిజ రూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ… అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది.
చైత్ర అమావాస్య ను గంధం అమావాస్య గా జరుపుతారు. ఇందుకు నిదర్శనం గా ఖచ్చితంగా గంధం అమావాస్య రోజున వర్షం పడుతుందని పెద్దలు చెపుతుంటారు.
విశాఖపట్టణం జిల్లా , సింహాచలం ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం. దేశంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో అతి పాచీనమైనది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం క్షేత్రం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
దశావతారాల్లోని రెండు అవతారాలు కలగలసిన అరుదైన స్వరూపమే సింహాచల క్షేత్రం లోని వరాహనరసింహావతారం. తన భక్తుడైన ప్రహ్లాదునికిచ్చిన మాట కోసమై హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారమూ కలిసి వరాహ లక్ష్మీనరసింహావతారం గా భక్తులకు అభయమిస్తున్నారు. స్వామివారు త్రిభంగి ముద్రలో అనగా వరాహము యొక్క తల, మానవ శరీరము, సింహం తోక కలిగిన మూర్తిగా దర్శనమిస్తారు.
స్థలపురాణం:-
******
తన అన్నహిరణ్యాక్షుని చంపినవాడని హరి మీద ద్వేషం పెంచుకున్న హిరణ్యకశిపుడు, స్వయంగా తనకు కలిగిన బిడ్డే హరిభక్తుడు కావడం సహించలేకపోయాడు. కన్నమమకారాన్ని కూడా చంపుకుని, పసివాడని కూడా చూడకుండా, అతని హరిభక్తిని మానిపించడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. అయినా వినకపోవడంతో అనేక రకాల చిత్రహింసలు పెట్టాడు. ఏనుగులతో తొక్కించాడు. విష సర్పాలతో కరిపించాడు. అగ్ని జ్వాలల మధ్య పడవేయించాడు. నిరంతర హరినామస్మరణతో, భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ప్రహ్లాదుడిని అవి ఏ రకంగానూ బాధపెట్టలేకపోయాయి. చివరికి ఒక కొండపైనుండి సముద్రంలోనికి తోసివేయించే ప్రయత్నం చేసాడు. ఆ కొండయే సింహాచలమనీ, ఎన్ని ఆపదలొచ్చినా, తన భక్తులను ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉండే శ్రీమన్నారాయణుడు సముద్రంలో పడిపోకుండా ప్రహ్లాదుడిని కాపాడాడనీ, అప్పుడు ప్రహ్లాదుడు, తనను కాపాడటానికి ద్వయావతారంలో(వరాహ, నరసింహ) వచ్చిన విష్ణుమూర్తిని అదే రూపంతో సింహాచలం మీద వెలిసి, భక్తులను కరుణించమని వేడుకున్నాడనీ స్థలపురాణం చెప్తోంది.
హిరణ్యకశిపుని సంహారానంతరం ప్రహ్లాదుడు సింహాచలం కొండపై వెలసిన స్వామికి దేవాలయం కట్టించాడు. కానీ కృతయుగం చివరికి అది శిథిలమైపోగా, విగ్రహం చుట్టూ మన్ను పుట్టలా కట్టింది. తర్వాతి యుగంలో చంద్ర వంశం లోని వాడైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆ ప్రాంతాలలో ఆకాశమార్గాన విహరిస్తుండగా, సరిగ్గా స్వామివారు వెలిసిన ప్రాంతంలో ఆయన రథం ఆగిపోవడంతో, అక్కడ ఏదో శక్తి ఉందని భావించి, క్రిందకి దిగాడు. ఆయన మట్టితో కప్పబడిన విగ్రహాన్ని చూసి, చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తూ ఉండగా ఆకాశవాణి స్వామివారిని చందనంతో కప్పి ఉంచమని, కేవలం సంవత్సరానికి ఒక్క రోజు(అక్షయ తృతీయ- వైశాఖ శుద్ధ తదియ) మాత్రమే స్వామి నిజరూప దర్శనంతో అనుగ్రహిస్తారనీ పలికింది. అప్పుడు పురూరవుడు స్వామివారి మూర్తిని చందనంతో పూత పూసి ఆలయం నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకూ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చందనపు పూతతో ఉన్న స్వామి లింగాకారుడిగా దర్శనమిస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి