10, మే 2024, శుక్రవారం

నర్మదానది

 ॐ                       నర్మదానది 


*ఈ నెల 1వ తేదీ నుంచీ రేపు 12వ తేదీ వరకూ నర్మదానదీ పుష్కరాలు కదా! 


నర్మదా సరితాంశ్రేష్ఠా 

                  రుద్రదేహాద్విని సృతా I 

తీరమే త్సర్వభూతాని 

                 స్థావరాణి చరాణి చ ॥ 

 

  - నర్మద నదులలోకల్లా శ్రేష్ఠమైనది. 

    రుద్రుడైన శివుని దేహంనుండీ పుట్టింది. 

    చరాచర ప్రాణులన్నిటినీ తరింపజేయునట్టిది. 

    

    ఈ విధంగా నర్మదానదిని అతిపవిత్రమైనదిగా మన పూర్వులు భావించారు. 

    గంగాతీరాన కూడా లేనన్ని పుణ్యక్షేత్రాలు ఈ నర్మదా నదీ (నదము) తీరాన ఉన్నాయి. 


            నర్మద పుట్టుకపై పురాణగాథ 


    మండువేసవిలో ఒకనాడు శివునికి బాగా చెమట పట్టిందట. 

    ఆ చెమటనుండీ ఒక షందమైన అమ్మాయి ఉద్భవించింది. 

    అమే నర్మద నదిగా మారిపోయింది. 

    అందుకే నర్మదకు 'రుద్రదేహ' అనీ, శంకరుని కూతురు కనుక శాంకరీ అని కూడా పేర్లున్నాయి. 


                    ఉభయతట పావని 

  

    నర్మదా నదిని ఉభయతట పావని అంటారు. అంటే ఈ నదిలో ఏ ఒడ్డున ఎక్కడ స్నానం చేసినా పుణ్యప్రదమన్నమాట. 

     కొందరు భక్తులు నర్మదా నదికి ప్రదక్షిణం చేస్తారు. దీన్ని పరిక్రమణం అంటారు. 


              నర్మదా నదికి  ఇతరపేర్లు 


    'నర్మద' అంటే ఆనందాన్నిచ్చేది అని అర్థం. 

 1.దీన్నే రేవా అనీ, రేవాజీ అనీ కూడా వ్యవహరిస్తారు. 

     రేవ - అంటే దుముకు అని అర్థం. రేవ్ ధాతువునుండి రేవ అయింది. 

    అమరకంటకం వద్ద ఇది 3500 అడుగుల ఎత్తునుండి దూకుతుంది. అందువల్లనే దీనికి 'రేవా' అనే పేరు. 


 2.మేఖల పర్వతాలలో పుట్టడంచేత - మేఖల కన్యక 


3.సూర్ పన్ జలపాతం తరువాత ఈనది హరన్ పాల్ అనేచోట గుజరాత్ లో మైదాన ప్రదేశంలో ప్రవహిస్తుంది. 

   'హరన్ పాల్' అంటే ఒకలేడి దుముకగలంత వెడల్పు. హరిణమంటే లేడి. 

    ఈ చోట నర్మదానది అంత సన్నగా ఉండడం వల్ల, ఈ నదికి 'హరన్ పాల్' అనేపేరు వచ్చింది. 


                నర్మదా నది ప్రత్యేకత 


    మూడు సంవత్సరాలు సరస్వతిలోనూ, 

    ఏడు రోజులు యమునా నదిలోనూ, 

    ఒక్కరోజు గంగానదిలోనూ స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుందంటారు. 

    కానీ నర్మదానదిని చూస్తేచాలు పాపాలన్నీ పటాపంచలవుతాయట. 


    గంగానది కూడా ఏడాదికి ఒకసారి నర్మదానదిలో స్నానంచేసి, తన పాపాలను (తనలో భక్తులు స్నానంచేయడం ద్వారా భక్తులపాపాలను) కడిగివేసుకుంటుంది. 

    గంగ నర్మదలో స్నానం చేసినరోజుని 'గంగాసప్తమి' అంటారు. 


                       నర్మద బాణం 


    నర్మదానదిలోని చిన్నచిన్న కంకరరాళ్ళన్నీ శివలింగాలని పోలి ఉంటాయి. 

   అందుకే నర్మదా నదిలోని ప్రతి కంకరా శంకరుడే అనే పలుకుబడి వచ్చింది. 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

            భద్రాచలం

కామెంట్‌లు లేవు: