31, ఆగస్టు 2024, శనివారం

*శ్రీ గరుత్మంతుడి కధ -17

 _*శ్రీ గరుత్మంతుడి కధ -17 వ భాగం*_

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


గరుత్మంతుడు_కశ్యపుడు

నేను నా తండ్రి కశ్యపుడి వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేయగా నా తండ్రి నాతో " కుమారా ఆమహానుభావుడెవరో కాదు అతడే నారాయణుడు. నీ మీద కలిగిన దయవలన నీకు దర్శన మిచ్చాడు. నేనుఆయనను దర్శించ వలెనన్న కోరికతో ఆయనను ఆరాధిస్తూ యోగసమాధిలో ఉండి తపమాచరించాను. ఆయన నాకు అనేక శరీరాలతో ఉన్న తన విశ్వ రూపము చూపి " కశ్యపా ! నీలో ఇంకా కోరికలు చావలేదు. మనసులో కోరికలు పెట్టుకుని నన్ను చూడడం జరగని పని. నీ వు నిస్సంగుడవైనప్పుడు నన్ను దర్శించగలవు " అన్నాడు. అటువంటి దివ్యమూర్తికి సేవలు చేసే భాగ్యము లభించిన నీవు అదృష్టవంతుడవు నీ జన్మ ధన్యమైంది. నీవు వెంటనే బదరికాశ్రముకు వెళ్ళి అక్కడ ఆ దివ్యమూర్తిని సేవింపుము " అని చెప్పాడు. నేను వెంటనే బదరికాశ్రము వెళ్ళి అక్కడ అచ్యుతుడు, పుండరీకాక్షుడు, గోవిందుడు, లోకజనకుడు, నారాయణుడు అను దివ్యమూర్తిని దర్శించి అతడికి భక్తితో నమస్కరించాను. ఆ పీతాంబర ధారి శంఖు చక్ర గధా ధారి అయి అష్ట భుజములతో ఉన్న నారాయణుడు " వచ్చావా ! మంచి పని చేసావు నా వెంట రా " అంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళాడు.

గరుత్మంతుడు నారాయణుడిని వెంటవెళ్ళుట


#తపస్సుచేసుకొంటున్న_శివుడు

నేను ఆయనను అనుసరిస్తూ ఎన్నో యోజనములు పయనించాను. అక్కడ ఏ విధమైన ఇంధనము లేకుండా మండుతున్న అగ్నిలో ఆ పీతాంబరధారి ప్రవేశించాడు. నేను ఆయనను అనుసరించాను. అక్కడ పార్వతీ సహితుడైన శివుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు వారిని దాటి వెళ్ళాడు. నేను ఆయనను అనుసరించాను క్రమంగా గాంఢాంధకారం అలుముకుంది నాకు ఏమీ కనిపించ లేదు. " ఈ దిక్కుకు రా " అన్న శబ్ధము వినిపించింది. నేను దిక్కు తోచక అటువై వెళ్ళాను. క్రమక్రమంగా చీకట్లు అంతరించి అక్కడ ప్రకాశవంతమైన వెలుగు ప్రసరించింది. అక్కడ సూర్యుడు  పట్టపగలు మాదిరి ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. కమ్మని సంగీతము వినవస్తుంది. తామర కొలనులు ఉన్నాయి. అందమైన మగవారు ఆడవారు నారాయణ మూర్తిని పూజిస్తుండగా ఆయన అలా వెళుతుండగా నేను ఆయనను అనుసరించాను. నేను ఆ వెలుగును తట్టుకోలేక స్వామీ అని అరిచాను. ఆయన వాత్సల్యంతో " వినతాకుమారా ! నేను నిన్ను మరచిపోతానా ! నా వెంట రా ! నీవు నన్ను చూడలేదని బాధపడకు. మమతలు, అహంకారం మనసున రానీక నిశ్చల మనసుతో ఏకాగ్రచిత్తులైన వారు మాత్రమే నన్ను చూడగలరు. నీకు నా మీద కలిగిన భక్తిప్రత్తులు కారణంగా నీవు కేవలం నా స్థూల శరీరము మాత్రమే చూడగలుగు తున్నావు " అని స్వామి నాతో అన్నాడు. అప్పటికి అమితమైన వేడి తేజస్సు చల్లబడింది. నేని తిరిగి స్వామిని అనుసరించాను. నారాయణుడు ఆకాశానికి ఎగిరాడు నేను కూడా ఆయన వెంట ఎగిరాను. అక్కడ స్వామి అంతర్ధానం అయ్యాడు. ఇటురా ! అన్న శబ్దం వినిపించి నేను అటుగా వెళ్ళాను. అక్కడ తెల్లటి హంసలు విహరిస్తున్న తామర కొలను కనిపించింది.అక్కడ నారాయణుడు స్నానం చేస్తుండగా నేను ఆయన వద్దకు చేరబోయాను. ఆయన నాకు కనిపించ లేదు బదులుగా వెలుగుతున్న కొన్ని వందల అగ్నులు కనిపించి వేధ ఘోషలు వినవచ్చాయి. అప్పుడు కొన్ని వందల గరుడపక్షులు నన్ను చుట్టుముట్టగా నేను భయ భ్రాంతుడనయ్యాను. నేను అచ్యుతా, శివా, సహస్రాక్షా, వేదమయా, అనాది నిధనా, త్రిభువనైక నాధా, త్రినైనా, గోవిందా, పద్మనాభా, హరా, కృపా విధేయా  అని పెద్దగా స్వామిని స్తోత్రం చేసాను. అప్పుడు స్వామి నా ఎదుట ప్రత్యక్షమై " వినతా పుత్రా ! భయపడకు " అని నా భుజం తట్టాడు. నేను కళ్ళు తెరిచి చూడగా బదరికాశ్రమంలో ఉన్నాను. అది చూసి ఆశ్చర్య చకితుడనై ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకుని పులకించి పోయాను. అప్పుడు నాముందు ఎనిమిది భుజములతో ప్రత్యక్షమైన నారాయణుడిని చూసి స్వామి ముందు మోకరిల్లి " మహానుభావా ! నేను నీ పాదసేవకుడను అయితే, నేను నీ దయకు పాత్రుడనైతే, నేను వినడానికి అర్హుడనైతే నీ మహిమ నాకు తెలిసేలా చెప్పు " అని అడిగాను.


*" తరువాయి భాగం రేపటి శుభోదయంలో  "*

🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏

కామెంట్‌లు లేవు: