31, ఆగస్టు 2024, శనివారం

*శ్రీ గరుత్మంతుడి కధ - 18

 _*శ్రీ గరుత్మంతుడి కధ - 18 వ భాగం*_

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


      *విష్ణు_మహిమ*


ధర్మరాజుకి ఉపదేశిస్తున్న మునులు నారాయణుడు " వినతా పుత్రా ! దేవతలు కానీ, గంధర్వులు కానీ, దనుజులు కానీ ఇప్పటి వరకు నా నిజ స్వరూపము ఎరుగరు. అఖిలభూతములు నా యందు జన్మించి, నాయందు పెరిగి, నా యందే నశిస్తాయి. అఖిలభూతములు నాయందు ఉంటాయి. నేను అఖిల భూతములందు ఉంటాను. నన్ను తెలుసు కోవాలంటే జీవాత్మను పరమాత్మ వైపు మళ్ళించాలి. కామమును, అహంకారమును, కోపమును, జడత్వమును వదిలి పెట్టాలి. ఇతరుల నుండి ఏదీ గ్రహించకూడదు. అహింసను అవలంబించి మనసును నిర్మలంగా ఉంచుకుని నిత్య తృప్తులై ఉండాలి. అలాంటి వారికి నేను దర్శనం ఇస్తాను. సాంఖ్యయోగము అవలంబించినప్పటికి బాహ్యముతో సంబంధబాంధవ్యాలు తెంచుకోలేని వారికి నిశ్చయబుద్ధి లేని వారికి నేను కనిపించను. అధికమోహములో పడి కొట్టుకుంటూ పూజలు, వ్రతములు, ఉపవాసములు ఆడంబరముగా చేసే వారికి నేను కనిపించను. ఏకాంతమనస్కులు నన్ను దర్శించగలరు. రజ, తమోగుణులకు కాక కేవలం సత్వగుణము కలవారికి మాత్రమే నేను దర్శనమిస్తాను. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని నాలుగు విధములుగా విభజింపబడి ప్రాణులందు ఆత్మ, బుద్ధి, అహంకారము, మానస్సు అనే నాలుగు విధములుగా ప్రవర్తిస్తుంటాను. ఇది నా స్థూల రూపము. నీవు కూడా నన్ను తెలుసుకుని నాయందు భక్తితో సదా నన్ను ధ్యానిస్తూ నా నిజస్వరూపమును తెలుసుకో " అని నారాయణుడు నాకు తెలియజేసాడు. నారాయణుడు నాకు చెప్పినది నేను మీకు చెప్పాను " అని సుపర్ణుడు మునులకు సిద్ధులకు చెప్పినది విని వారు ఆనంద పరవశులై " మహానుభావా ! నీ వలన మేము విష్ణుతత్వము విని ధన్యులమైయ్యాము. ఈ కథ అత్యంత పుణ్యదాయకమై విన్న వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ కథ విన్న బ్రాహ్మణులకు వేదవిద్య అలవడుతుంది. క్షత్రియులకు జర్వత్రా విజయము లభిస్తుంది. వైశ్యులకు సంపద అభివృద్ధి చెందుతుంది. శూద్రులకు సకల శుభములు చేకూరుతాయి. సర్వజనులు ఇహపరసౌఖ్యాలను పొందుతారు. అని పొగిడారు. ధర్మనందనా ! ఈ కథ పూర్వము బ్రహ్మదేవుడు వసువులకు చెప్పగా వసువులు మా తల్లి గంగాదేవికి చెప్పినప్పుడు నేను విన్నాను. ఇప్పుడు నీకు చెప్పాను. ధర్మనందనా ! మనసులో చేసే సకలవిధ సంకల్పములను విడిచి పెట్టి ఆత్మను అగ్నియందు ప్రతిష్ఠించి బాహ్యసంబధములు విడిచి ధ్యానమగ్నుడవై విష్ణువును ధ్యానించి మోక్షమును సాధించు. ఇలా చేసిన వారికి మోక్షము సులువుగా లభిస్తుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.


*"తరువాయి భాగం రేపు "*

🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄

కామెంట్‌లు లేవు: