31, ఆగస్టు 2024, శనివారం

తెలుగు మాస్టారు

 : తెలుగు మాస్టారు

రచన లక్ష్మి మదన్

🪷🪷🪷🪷🪷🪷🪷


      మధ్యాహ్నం రెండు గంటలు కావస్తుంది...భోజనం చేద్దామని వంటింట్లో పీట వేసుకుని కంచంలో అన్నం కూర పెట్టుకొని చారు ఒక గిన్నెలో పోసుకొని మంచినీళ్లు చెంబు పెట్టుకొని కూర్చుంది సుజాత..


ఇంట్లో అందరూ భోజనాల బల్ల పైనే తింటారు ..కానీ! సుజాతకి కింద కూర్చుని తింటేనే తిన్నట్టు ఉంటుంది' ఎందుకమ్మా కింద కూర్చొని తింటావు టేబుల్ మీద తినొచ్చు కదా!" అని..పిల్లలు అడిగితే..


" నాకు ఇలా తింటేనే తిన్నట్టు ఉంటుంది.. నా తండ్రి చనిపోయే వరకు కూడా నేల మీద కూర్చొని భోజనం చేసేవాడు.. నాకు అదే అలవాటు వచ్చింది. ఇప్పుడైతే కాళ్ల నొప్పులు ఏం లేవు కదా! అవి వచ్చినప్పుడు టేబుల్ మీద తింటాలే" అని సమాధానం చెప్పేది.


కూతురు ప్రతిమ ఇంజనీరింగ్  ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రిపరేషన్ హాలిడేస్ కోసం వచ్చి హాల్లో కూర్చుని చదువుకుంటుంది... కొడుకు అదే ఊర్లో ఇంటర్ చదువుతున్నాడు... భర్త కొడుకు టిఫిన్ బాక్సులు తీసుకొని వెళ్ళిపోయారు తాను మాత్రం ప్రతిమకు భోజనం పెట్టి తాను కూర్చుంది తినడానికి...


ఇంతలో బయట నుండి 'కొంచెం భోజనం ఉంటే పెట్టండి తల్లీ!" అనే గొంతు వినిపించింది..


అది విన్న సుజాత..


" ప్రతిమా! ఒక్కసారి బయటకు చూడు ఎవరో పిలుస్తున్నారు" అన్నది సుజాత నోట్లో ముద్దని పెట్టుకోబోతూ..


" ఎవరో నమ్మా! భోజనం కావాలని అడుగుతున్నారు  పంపించేయనా"? అని అడిగింది.


" తప్పు ఎవరైనా అన్నం అడిగితే లేదని పంపించవద్దు.. అందులో నేను భోజనం చేసే ముందు వచ్చారు.. నేనే ఇదే కంచం తీసుకెళ్లి అతనికి భోజనం పెట్టేసి వస్తాను" అని తన పళ్లెం తీసుకుని బయటకు వెళ్ళింది సుజాత..


బయటకు వెళ్లిన సుజాత వచ్చిన వ్యక్తిని చూసి నిర్గాంత పోయింది,.. అతని ఎవరో కాదు.. వారి తెలుగు మాస్టారు.. "ఇదేంటి ఇతను భిక్షాటన కోసం వచ్చాడు.. ఎంతో గొప్పగా బ్రతికిన ఇతనికి భిక్షం అడుక్కోవాల్సిన పని ఏమిటి?" అని మనసులో అనుకొని..


" మాస్టారూ! మీరేమిటి ఇలా! ముందు లోపలికి రండి" అని చేయి పట్టుకొని తీసుకెళ్లి లోపల ఉన్న దివాన్ మీద కూర్చోబెట్టింది..


అతను సుజాత వంక అయోమయంగా చూసి గుర్తుపట్టలేదన్నట్టుగా మొహం పెట్టాడు..


"నేను సుజాతను మాస్టారూ! దక్షిణామూర్తి గారి అమ్మాయిని మనం బంధువులం కూడా అవుతాము గుర్తుకొచ్చానా!" అని అడిగింది.


అతని మొహంలో చిన్న వెలుగు కనిపించింది '' అన్నట్లుగా ఒక చూపు చూశాడు.. కానీ అతను చాలా నీరసంగా ఉన్నాడు మాట్లాడే పరిస్థితిలో లేడు..


అది గుర్తించిన సుజాత అతనికి విస్తట్లో అన్నం పెట్టింది దాన్ని తెచ్చి స్టూల్ వేసి అతని కూర్చున్న చోటే అమర్చింది ,"మీరు తినండి మాస్టారు" అని చెప్పింది.


అతను చేతుల వంక చూసుకున్నాడు... ఒక ఖాళీ బకెట్  తెచ్చి పెట్టింది.. దానిలో కడుక్కోమని చెప్పి చేతుల మీద నీళ్లు పోసింది..


అతని చేతులు కడుక్కొని నెమ్మదిగా భోజనం చేయసాగాడు.. అతని వయసు దాదాపు 83 ఏళ్లు ఉంటుంది...


అతని నిదానంగా భోజనం చేస్తుంటే.. గతమంతా కళ్ళ ముందు కదలాడింది సుజాతకి..


వంటింట్లో సుజాత తల్లివర్ధనమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది ..ఆ పొయ్యి మంటలో నాలుగు వంకాయలను పెట్టి కాలుస్తూ కూర్చుంది.. పక్కనే కూర్చున్న సుజాత 'ఆ వంకాయలతో ఏం చేస్తావమ్మా!" అని అడిగింది..


" నాన్నకి వంకాయలను అన్నంలో కలుపుకుని తినడం ఇష్టం అందుకనే కాల్చి పెట్టి దానిలో ఉప్పు నెయ్యి వేసి పెడతాను" అని చెప్పింది.


" అయితే నాకు కూడా కావాలి" అన్నది సుజాత.


" సరే నీకు కూడా ఇస్తా గానీ.. మన ఇంటికి బంధువు వచ్చారు.. అతను నీకు మామ వరస అవుతారు. ఇక్కడ స్కూల్లో టీచర్గా వచ్చారట అదే మీ స్కూల్లోనే ..వెళ్లి అతనికి మంచినీళ్లు ఇచ్చి నమస్కారం చేసి రా" అని చెప్పి తల్లి పంపించింది.


అతనికి మంచినీళ్లు ఇచ్చి నమస్కారం చేసింది సుజాత.


" ఏం చదువుతున్నావు తల్లి" అని అడిగాడు వచ్చిన బంధువు.


"9వ తరగతి చదువుతున్నానండి" అని చెప్పి లోపలికి వచ్చింది.


మామూలుగానే ఇంట్లో అక్కతో చెల్లెళ్లతో కొట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ మాట్లాడింది సుజాత ..అతని ముందు ఏమీ భయపడలేదు కూడా..


అసలు ఆ బంధువు గురించి పట్టించుకోకుండా చాలా అల్లరి చేసేసింది అప్పటికి తల్లి చెప్తూనే ఉంది "కొత్త వాళ్ళ ముందు ఏంటి ఆ అల్లరి?" అని.. అయినా సుజాత పట్టించుకోలేదు..


ఆలస్యంగా ఇంటికి వచ్చిన తండ్రి వచ్చిన బంధువుతో ఆప్యాయంగా మాట్లాడుతూ చాలా రాత్రి వరకు అతనితోనే కూర్చున్నాడు.


ఇద్దరూ ఒకరినొకరు బావ అనుకుంటూ సంబోధించుకున్నారు..


తెల్లవారి సుజాత యధాప్రకారంగా స్కూలుకు వెళ్ళింది..


అంతకు ముందు రోజే హెడ్మాస్టర్ వచ్చి మీకు కొత్త తెలుగు మాస్టర్ వస్తున్నాడు.. ఇప్పుడున్న మాస్టారు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయారు" అని చెప్పాడు..


కొత్త మాస్టారు ఎలా పాఠాలు చెప్తారు.. స్ట్రిక్ట్ గా ఉంటాడా లేక ఫ్రెండ్లీగా ఉంటాడా ఇవన్నీ చర్చించుకుంటున్నారు క్లాస్లో పిల్లలందరూ.. అంతకు ముందు ఉన్న మాస్టారు అసలు ఒక్కరోజు కూడా క్లాస్ తీసుకునేవాడు కాదు. ఎప్పుడు సెలవు పైనే ఊరికి వెళ్ళిపోయేవాడు..


ఇలా అనుకుంటుండగానే ఫస్ట్ పీరియడ్ లో మాస్టారు లోపలికి వచ్చారు...


అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పారు..


కానీ సుజాతకి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది.. ఎందుకంటే వచ్చిన మాస్టారు ఎవరో కాదు నిన్న వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువు..


"ఈవిషయం తెలియక ఇంత అల్లరి చేశాను నేను ఇప్పుడు సార్ ఏమంటారో" అని భయపడ సాగింది సుజాత...


ఒక్కొక్కరిగా వారి పేర్లు చెబుతూ పరిచయం చేసుకో సాగారు..


ఇక పరిచయం చేసుకోవడం సుజాత వంతు వచ్చింది ఒక్కసారిగా సుజాతకు చెమటలు పట్టుసాగాయి..

ఏమి మాట్లాడకుండా నిలబడ్డ సుజాతను చూసి..


" నువ్వు ఎవరో నాకు తెలుసు గాని.. నువ్వు నీ నోటితో నీ పేరు చెప్పు బిడ్డా" అన్నాడు మాస్టారు నవ్వుతూ..


కొంచెం భయం పోయి ధైర్యం వచ్చింది మెల్లిగా లేచి తన పేరు చెప్పింది....


ముగింపు మరో భాగంలో

 తెలుగు మాస్టారు

రచన లక్ష్మి మదన్

🪷🪷🪷🪷🪷🪷🪷


       అలా వచ్చిన తెలుగు మాస్టారు పేరు సూర్య నారాయణ శాస్త్రి గారు... మొదటి రోజే పిల్లలందరినీ ఆకట్టుకున్నారు.


అతను తెలుగు పండితుడే కాకుండా ఒక అవధాని అని, ఒక కవి అని తర్వాత తెలిసింది...


తెల్లని ధోతి అంగీ వేసుకుని నుదుట కని కనిపించని విభూతి రేఖలు పెట్టుకొని..చిన్న కుంకుమబొట్టుతో స్కూల్ కి వచ్చేవారు.. ఆయన ఒక్కొక్కసారి ఏ లోకంలోనో ఉన్నట్టుగా ఉండేవారు.. ఆయన ఆహార్యం మీద కూడా శ్రద్ధ ఉండేది కాదేమో!.. ఇంట్లో వారి సతీమణి ఇచ్చిన బట్టలను కట్టుకొని పెట్టిన భోజనం తిని బయలుదేరేవారు ఒక్కొక్కసారి చెప్పులు కూడా వేసుకునేవారు కాదు.


ఆయన పాఠం చెప్పే విధానం చూస్తే అరటి పండు వలిచినట్లు  అనిపించేది ..అప్పటికప్పుడే ప్రశ్నలకు జవాబు రాయగలిగేంత అర్థం అయ్యేలా వివరించేవారు.


పాఠం చెప్పగానే చివరలో అప్పటికప్పుడు ఎవరు పద్యం ఒప్ప చెప్పితే వారి ముఖంలో ప్రశంస కనపడేది.. ఆ ప్రశంస కోసం విద్యార్థులు ఎంతో తాపత్రయపడేవాళ్లు... కనీ కనిపించని ఒక ఎక్స్ప్రెషన్ ఉండేది ముఖంలో అదే తప్పు చెప్పితే అతని ముఖ కవళికలు మారిపోయేవి.. మాస్టారు తిట్టకుండా కూడా ఆ కవళికలను చూస్తేనే పిల్లలకు బాధ కలిగేది..


పిల్లలందరికీ చక్కని చందస్సును నేర్పించారు.. పద్యాలు ఎలా రాయాలో చూపించారు.. మంచి మార్కులు పొందిన వాళ్లకు తన రచనల్లో నుండి పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు.. ఇలా తెలుగు మాస్టారు పిల్లలకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు.


అప్పుడప్పుడు చతురోక్తులతో తరగతిని ఎంతో ఉల్లాసంగా ఉంచేవారు... అతని ప్రతిభ తెలుసుకున్న సుజాత అతనంటే  అపారమైన గౌరవం పెంచుకుంది.. వీళ్ళ ఇంటి దగ్గరనే మాస్టారు ఇల్లు ఉండేది వాళ్ల పిల్లలతో తనకి ఎక్కువ సాన్నిహిత్యం కూడా కలిగింది సుజాతకు.. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేది కానీ మాస్టారు లేనప్పుడు మాత్రమే వెళ్ళేది మాస్టారును చూడాలంటే స్కూల్లో మాత్రం చూడ్డానికి ఇష్టపడేది... అలా అతను అంటే ఇష్టంతో పాటు గౌరవం పెరిగింది.


ఇదంతా గుర్తుకొచ్చిన సుజాత ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి మాస్టారును చూసింది.. అతను భోజనం చేసి మెల్లిగా లేచి వెళ్లి పెరట్లో చేయి కడుక్కున్నాడు.


"మాస్టారూ! కాసేపు విశ్రాంతి తీసుకుంటారా"  అని అడిగింది సుజాత


" లేదమ్మా నేను వెళ్ళిపోవాలి" అన్నారు శాస్త్రి గారు.


" అసలు ఎక్కడుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు? మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ఉంది" అని అన్నది సుజాత.


అతని కళ్ళనుండి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి..


అతని భుజం మీద చేయి వేసిన సుజాత "బాధపడకండి మాస్టారూ! ఏం జరిగిందో చెప్పండి మీ బాధను తగ్గించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను" అని చెప్పింది.


" ఏం చెప్పను తల్లి !ఎంతో వైభోగంగా గడిచిన నా జీవితం ఈరోజు నేల రాలి పడింది.. పిల్లలందరినీ చక్కగా చదివించాను పెళ్లిళ్లు చేశాను ఏ మాత్రం నేను డబ్బులు మిగిల్చుకోకుండా వారి కోసం మాత్రమే ఖర్చు పెట్టాను.. పోయిన సంవత్సరం నాభార్య చనిపోయింది.. అప్పటినుండి నాకు నరకం మొదలైంది... ఆమె ఉన్నంతవరకు నాకు ఏ లోటు తెలియలేదు ఎవరి సూటి పోటీ మాటలు నాకు వినపడలేదు.. నాకు ఆమె వినబడనీయలేదు కూడా ..ఎప్పుడైతే ఆమె పోయిందో అందరి నిజస్వరూపాలు తెలిసిపోయాయి... నాకు కంచంలో పట్టెడన్నం కాకులకు విసిరిన దానికన్నా హీనంగా పెట్టడం మొదలయ్యింది ఇంట్లో నుండి నా పడక వీధి అరుగు మీదికి చేరింది... నా ఉనికి ఇంట్లో అందరికీ భారం అయిపోయింది... ఉద్యోగాల పేరిట అందరూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతారు నేను ఆ పంచలోనే బయట కూర్చుంటున్నాను ఆకలి వేస్తే లోపలికి వెళ్లడానికి లేదు ..ఒకప్పుడు నేను కట్టిన ఇల్లు అది.. ఇప్పుడు ఆ ఇంట్లోకి కాలు పెట్టడానికి నాకు అర్హత లేదు... పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లోనే పడతాయి అందులో నుండి పది రూపాయలు ఇవ్వడానికి కూడా ఎవరికీ మనస్సుఒప్పదు.. ఆకలి దప్పులకు ఓర్చుకుంటాను.. కానీ సూటి పోటీ మాటలను భరించలేకపోయాను.. నేను చేసిన నేరమేంటో నాకు అర్థం కాలేదు.. అవన్నీ భరించలేక ఇలా బయటకి వచ్చాను.. అదే ఊళ్లో అడుక్కుంటే వాళ్లకి ఇంకా భారమైపోతానని ఇలా ఈ ఊరికి వచ్చాను కానీ ఇక్కడ నిన్ను చూస్తానని నేను ఊహించలేదమ్మా! మీ నాన్నగారు నేను ఇద్దరం ఎంతో ప్రాణంగా మెలిగాము.. ఆయన అదృష్టవంతుడు నేను ఇలా మిగిలిపోయాను" అని చెప్పి వెక్కి వెక్కి ఏడవసాగారు శాస్త్రి గారు.


బాధతో కళ్ళ నీళ్లు వచ్చాయి సుజాతకి.m అక్కడే ఉండి వింటున్న ప్రతిమకి నోట మాట రాలేదు ఇంకా లోకం తెలియని ఆపసిదానికి "ఇలా కూడా చేస్తారా" అనిపించింది..


"మాస్టారు మీరు బాధపడకండి మా వారు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తాము.. అంతవరకు ఇక్కడే ఉండండి.. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు" అని చెప్పి కట్టుకోవడానికి ఒక ధోతి ఒక చొక్కా తెచ్చి ఇచ్చింది సుజాత.


ఆ బట్టలు మార్చుకొని అక్కడే దివాన్ మీద పడుకున్నారు శాస్త్రి గారు.


ఆరోజు సాయంత్రం భర్త శ్రీనివాస్ తో కలిసి శాస్త్రి గారిని ఆనంద నిలయానికి తీసుకెళ్ళింది.


అది వృద్ధాశ్రమం అని తెలుసుకున్న శాస్త్ర గారు మరింత బాధ పడిపోయారు..


" మీరు బాధపడకండి మాస్టారు లోపలికి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది" అని చెప్పి శాస్త్రి గారిని లోపలికి తీసుకెళ్లారు సుజాత దంపతులు.


లోపల అంతా సందడిగా ఉంది పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఉన్నారు..


కొంతమంది వృద్ధులు మూడు నుండి పదేళ్ల  వయసున్న పిల్లలకి పద్యాలు నేర్పిస్తున్నారు.. మరి కొందరు ఇంగ్లీష్ చదివిస్తున్నారు.. మరికొందరు కథలు చెబుతున్నారు ..మరికొందరు ప్రేమగా తినిపిస్తున్నారు ఇలా పెద్దవాళ్లు పిల్లలు ఆనందంగా కలిసే ఉన్నారు ఆప్రాంగణమంతా..


అదంతా చూస్తున్న శాస్త్రి గారికి ఏమి అర్థం కాలేదు అన్ని కుటుంబాలు ఇక్కడే కలిసి ఉన్నాయి..ఇది అనాథలు ఉన్నట్లుగా లేదు అని ఆశ్చర్యపోయారు..


అప్పుడు చెప్పింది సుజాత..


" మాస్టారూ! మన స్కూల్లో రమణమూర్తి అని ఒక అబ్బాయి ఉండేవాడు గుర్తుందా ?అతను స్కూల్ టాపర్ గా ఉండేవాడు అతను ఈ జిల్లా కలెక్టర్ గా పని చేశారు కొంతమంది ఇలా ఇంటి నుండి గెంటివేయబడిన వారిని చూసి ఆయన మనసు ద్రవించిపోయింది ..అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది అదే ఈ ఆనంద నిలయం ఇది వృద్ధాశ్రమం కాదు.. దీనిలోనే తల్లిదండ్రులు చెత్తకుండీలో వదిలేసిన పిల్లలు లేదా తప్పిపోయిన పిల్లలు మరియు ఇలాంటి వృద్ధులు ఉంటారు.. తల్లిదండ్రులు ప్రేమ కోల్పోయిన పిల్లలకి వీళ్ళు ఆ ప్రేమను పంచుతారు పిల్లలకు ప్రేమ కోల్పోయిన వృద్ధులకు వీళ్ళు అదే ప్రేమను తిరిగి అందిస్తారు.. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం తో వారికి బ్రతుకు భారం అనిపించడం లేదు తెల్లవారి లేచినది మొదలు నా పిల్లలకు ఇది చేయాలి అది చేయాలి అని వృద్ధులు వారి ప్రేమను పొందాలి అని పిల్లలు ఇలా తప్పించి పోతున్నారు కాలం వారికి ఇప్పుడు వారికీ ఆశా జనకంగా కనిపిస్తుంది .నిరాశ నిస్పృహ మాయమై ఆ స్థానంలో కొత్త ఊపిరి పోసుకుంది.. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను...


ఇక్కడ మొక్కుబడి భోజనం ఉండదు కొన్ని కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి ఆప్యాయంగా ప్రేమగా వడ్డిస్తారు..అందులో మేముకుడా ఉన్నాము.. ఇక్కడికి వచ్చినవారు ఇంట్లో గడిపిన దానికన్నా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నారు...


చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని సరియైన చోటుకే తీసుకొని వచ్చానా" అని అడిగింది సుజాత.


ఆయనకు ఇదంతా చూసిన తర్వాత ఎంతో సంతోషంగా అనిపించింది "ఇంకా ఎంతో మంది మహనీయులు  భూమి మీద ఉన్నారు కాబట్టి లోకంలో మానవత్వం మిగిలి ఉంది" అని అనుకునీ సుజాత చేయిని గట్టిగా పట్టుకున్నారు...


అప్పుడే అక్కడికి వచ్చిన ఐదేళ్ల పిల్లవాడు..


" తాతయ్యా! నాకు కథ చెప్పవా అమ్మ నాకు కథలు చెప్పేది కానీ ఇప్పుడు అమ్మ లేదుగా నువ్వు చెప్తావా" అని చేయి పట్టుకుని అడిగాడు.


అక్కడికి వచ్చిన నిర్వాహకురాలు చెప్పింది


" ఈ అబ్బాయి తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో పోయారు.. నెల క్రితం ఆ సంఘటన జరిగింది దాదాపు చనిపోయే స్టేజికి వచ్చిన ఇతన్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంతమంది ప్రేమను పొంది మామూలు మనిషి అయ్యాడు" అని చెప్పింది.


వెంటనే శాస్త్రి గారు ఆ అబ్బాయి చేయి పట్టుకుని


" నేను నీకు కథలు పద్యాలు అన్నీ నేర్పిస్తాను నీ పేరేంటి రా అబ్బాయ్" అని అడిగాడు చిరునవ్వుతో..


" నా పేరు సూర్య" అని చెప్పాడు.


"ఒరే ఒరే నా పేరు పెట్టుకున్నావట్రా" అంటూ ఆ పిల్లవాడి చేయి పట్టుకుని లోపలికి నడిచారు శాస్త్రి గారు..


సుజాత అతన్ని సంతృప్తిగా చూసి" ఇంక మాస్టారికి ఏ బాధ లేదు తెలుగుని ఇంకా బాగా బతికిస్తారు" అని అనుకుంటూ బయటకు వచ్చేసింది ఆనంద భాష్పాలు రాలుస్తూ!


శుభం

కామెంట్‌లు లేవు: