*దేవాలయాలు - పూజలు 27*
సభ్యులకు నమస్కారములు.
*తాంబూల సేవనం* :-
*పూగి ఫలం మహాద్దివ్యం నాగవల్లి దలైర్యుతం ఎలాది చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతామ్*
తాత్పర్యం:- ఓ ప్రభూ దయచేసి ఈ తాంబూలం స్వీకరించండి. తమలపాకులు, యాలకుల చూర్ణం, వీటితో పాటు దివ్యమైన పూగీ ఫలం
(అరెక కాయ) తో కూడి ఉన్న ఈ తాంబూలాన్ని సిద్ధం చేశాను. ప్రభూ దయచేసి స్వీకరించండి.
హిందూ సంప్రదాయాలలో తాంబూలానికి విశిష్ట స్థానం మున్నది. తాంబూల ప్రదానం శుభకార్యాలకు మరియు పెద్దలను, ఆత్మీయులను గౌరవించడానికి గూడా ప్రతీక. ప్రాథమిక ఆచారాలు, అవసరాలలో అనగా అన్న ప్రాసన లగాయతు అక్షరాభ్యాసం, శ్రీమంతం, ఉపనయన వివాహాది శుభకార్యాలలో ఆనవాయితీగా ఉన్నది. తమలపాకులో శ్రీ పార్వతీ దేవి, శ్రీ లక్ష్మీ దేవి మరియు శ్రీ సరస్వతి నివాసముంటారని పెద్దల విశ్వాసము. తాంబూలం సమర్పించే వారిని దేవి దేవతలు ఆశీర్వదిస్తారు. మరింకా చెప్పాలంటే నాగవల్లి అను నామధేయం గల తమల పాకులకు ఎనలేని ప్రాధాన్యత కూడా కలదు. కొందరు దేవీ దేవతలకు తమలపాకుల శత పత్ర పూజాలు కూడా చేస్తారు.
అనాదిగా భోజనాదుల తదుపరి తాంబూల స్వీకరణ ఉంటున్నది. తాంబూల స్వీకరణ వలన మానసిక ఉత్సాహము మరియు ఆరోగ్య పరంగా జీర్ణ వ్యవస్థకు మేలు కల్గుతుంది.
*తాంబూల సమర్పణ సందర్భంగా కొన్ని నియమాలు*.
1) ఏక తమల పాకు, ఏక ఫలం గాని కల్గిన తాంబూలాలు కూడదు.
2) మూడు గాని అంతకంటే ఎక్కువ గాని తమలపాకులతో భగవంతునికి తాంబూలం సమర్పించాలి.
3) సుగంధభరితమైన *తాంబూలం తొడిమలు భగవంతుని వైపు ఉండకూడదు*.
4) *దోషాలకు తావివ్వ కూడదు* భగవంతుడు ప్రీతి చెందాలి, మానవాళికి శ్రేయస్సు అందించాలి.
5) అర్చక స్వాములు గాని గృహస్థులు గాని వారు ఇతరుల వద్ద పుచ్చుకున్న తాంబూల సామాగ్రిని భగవత్ నివేదనకు ఉపయోగించ రాదు.
*తాంబూలాలో రకములు:-* 1) పరగడుపు తాంబూలం,
2) పేరంటాల తాంబూలం, 3) వశీకరణ తాంబూలం, 4) వీడ్కోలు తాంబూలం,
5) పుష్ప తాంబూలం,
6) తాంబూల ద్వయం = శాలువా యుక్త సంభావనా తాంబూలం,
7) పూజలు మరియు వ్రతాల తాంబూలం,
8) నైవేద్య తాంబూలం. ఇంకా ఉండవచ్చును.
తాంబూలము యొక్క మరొక విశేష పద్ధతి అనాదిగా ఆచరించబడుతున్నది. వీడ్కోలు సమయంలో మాన్యులకు మరియు ఆత్మీయులకు తాంబూలం నమస్కార సహితంగా ఇవ్వబడుతున్నది. *బహుశా ఈ సంప్రదాయమే భగవత్ ఆరాధనలో చివరి అంశంగా చేర్చబడినది*.
అర్చక స్వాముల వారు తాంబూలం సమర్పిస్తూ *ఓం కాలాయ నమః తాంబూలం సమర్పయామి*. అని నివేదిస్తారు. కొంత వ్యవధి తదుపరి అనగా భగవానుని తాంబూల చరణానంతరం, భగవానుని ముఖ (నోటి) శుద్ధికై *శుద్ధ ఆచమనీయం* సమర్పయామి అంటూ ఉద్దరిణితో అర్ఘ్య పాత్రలో నీరు వదులుతారు. తాంబూల స్వీకరణ అనంతరం భవంతుడు విశ్రమిస్తాడు.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి