#Temple_Tourism_AP . శ్రీకాకుళం జిల్లా . ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయాలు . రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండయినా రైల్లో అయినా , రోడ్డు మార్గంలో అయినా రెండు మూడు రోజుల్లో ఈ ముఖ్యమైన , ప్రాచీన దేవాలయాలను చూడవచ్చు . శ్రీకాకుళంలో , విజయనగరంలో కూడా మంచి హోటళ్లు ఉన్నాయి . రాష్ట్ర టూరిజం వారు కానీ , APSRTC వారు కానీ ఓ చక్కని సర్క్యూటుని ఏర్పరచవచ్చు . వెనుకబడిన జిల్లా అయిన ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది . ఉత్తరాంధ్ర అభివృద్ధి పౌర సంఘాలు కూడా చొరవ తీసుకోవచ్చు . దేవాలయాల వివరాలు .
1. అరసువిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం : అందరికీ సుపరిచితమే . శ్రీకాకుళం పట్టణంలోనే ఉంటుంది . దేశంలోనే రెండు , మూడు సూర్య దేవాలయాలలో ప్రముఖ దేవాలయం మన రాష్ట్రంలో ఉండటం మన అదృష్టం . మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం . మరొకటి తూర్పు గోదావరి జిల్లా లోని గొల్లల మామిడాడలో ఉంది . ఇక్కడ ఉన్న కొలేజిలో పైన ఉన్న ఇమేజి ఆ దేవాలయానిదే .
2. శ్రీకూర్మం : దశావతారాలలో రెండవ అవతారంగా మనందరికీ సుపరిచితం కూర్మావతారం . మొత్తం దేశంలోనే కూర్మావతారానికి ఉన్న దేవాలయం ఈ శ్రీకూర్మనాధ స్వామి దేవాలయం . 9-11శతాబ్దాలలో నిర్మితమైన దేవాలయం . అంత గొప్పగా అభివృద్ధి చెందలేదని నా అభిప్రాయం . శ్రీకాకుళం నుండి 15 కి మీ దూరంలో ఉంటుంది . ఈ కొలేజిలో రెండవ వరుసలో మొదటి ఇమేజి
3. సంగం : సంగమేశ్వర ఆలయం . ఈ కొలేజిలోని రెండవ వరుసలో రెండవ ఇమేజి . వంగర మండలంలో ఉంటుంది . శ్రీకాకుళం నుండి 56 కి.మీ దూరంలో ఉంటుంది . రాజాం నుండి 20 కి.మీ దూరంలో ఉంటుంది . ఈ సంగం వద్ద నాగావళి , సువర్ణముఖి , వేగవతి నదులు కలుస్తాయి . అందువలనే సంగం అంటారు . మహా శివరాత్రి నాడు వేలాది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు . బహుశా చాలామందికి ఈ ఆలయం గురించి , ఈ ప్రదేశం గురించీ తెలిసి ఉండకపోవచ్చు .
4.సాలిహుండ : ఈ కొలేజిలోని రెండవ వరుసలో మూడవ ఇమేజి . ఈ గ్రామం గార మండలంలో ఉంటుంది . వంశధార నదీ తీరాన కళింగ పట్టణానికి అయిదు కి.మీ దూరంలో , శ్రీకాకుళానికి 18 కి.మీ దూరంలో ఉంటుంది . ఇక్కడ చాలా బౌధ్ధ స్థూపాలు , మోనాస్టరీ ఉన్నాయి . 1919 లో మొదటిసారిగా నేడు మనమంతా జయంతి జరుపుకుంటున్న గిడుగు రామమూర్తి పంతులు గారు కనుక్కున్నారు . రెండవ శతాబ్దానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి . తార , మరీచి విగ్రహాలు కనుగొనబడ్డాయి . ఇక్కడ నుండే సుమత్ర , తూర్పు దేశాలకు బౌధ్ధం వ్యాపించిందని చరిత్రకారులు చెపుతున్నారు .
5 . శ్రీముఖలింగం : చాలామందికి ఈ దేవాలయం పేరు తెలుసు . శివాలయం . వంశధార నదికి వెడమ వైపు ఉంటుంది . ఈ గ్రామానికి దగ్గరలోనే ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది . ఈ ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉన్నాయి . ముఖలింగేశ్వర , భీమేశ్వర , సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి . 8-11శతాబ్దాలలో నిర్మితమని అంచనా . శ్రీకాకుళానికి 48 కి మీ దూరంలో ఉంటుంది . బాధాకరమైన విషయం ఏమిటంటే ఎంతో గొప్ప ప్రాచీన ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవటం . ఈ కొలేజిలో చివర్లో ఉన్న ఆలయం .
6 . మందస : వరాహ స్వామి ఆలయం . చాలామందికి తెలియదు . సోంపేట నుంచి 26 కి మీ దూరంలో ఉంటుంది . మహేంద్రగిరి కొండ కింద ఉంటుంది . ఇక్కడ ఉన్న కోట దక్షిణ భారతంలోనే ఎత్తయిన ప్రదేశంగా చెపుతారు .
ఈ ప్రముఖ దేవాలయాలు కాకుండా మరెన్నో ప్రాచీన , ఈమధ్య కాలంలో నిర్మించబడిన ఆలయాలు ఉంటాయి . ప్రస్తుత ప్రభుత్వం టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన నేపధ్యంలో జిల్లాల వారీ నాకు తెలిసిన , నేను సందర్శించిన ఆలయాల గురించి మిత్రులతో పంచుకుంటున్నాను .
Nara Chandrababu Naidu #kanduladurgesh #aptourism #SrikakulamDistrict #srikakulam #religioustourism
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి